Telugu Global
National

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అస్త్ర సన్యాసం..

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో విపక్షాలన్నీ ఏకమై బీజేపీకి చుక్కలు చూపెట్టాలనుకున్నాయి. అయితే మమతా బెనర్జీ పెట్టిన మీటింగ్ కే సగం మంది మొహం చాటేయడంతో అక్కడే ఏదో తేడా కొట్టింది. ఆ తర్వాత కూడా విపక్షాలన్నీ అంటీ ముట్టనట్టుగా ఉంటున్నాయి. టీఆర్ఎస్ ని కలిసేందుకు వస్తే మమ్మల్ని కలవొద్దని టీపీసీసీ నేతలు తేల్చి చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ వల్లే తాము విపక్ష కూటమికి మద్దతివ్వలేమని అకాలీ దళ్ వంటి ఇతర పార్టీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు […]

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అస్త్ర సన్యాసం..
X

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో విపక్షాలన్నీ ఏకమై బీజేపీకి చుక్కలు చూపెట్టాలనుకున్నాయి. అయితే మమతా బెనర్జీ పెట్టిన మీటింగ్ కే సగం మంది మొహం చాటేయడంతో అక్కడే ఏదో తేడా కొట్టింది. ఆ తర్వాత కూడా విపక్షాలన్నీ అంటీ ముట్టనట్టుగా ఉంటున్నాయి. టీఆర్ఎస్ ని కలిసేందుకు వస్తే మమ్మల్ని కలవొద్దని టీపీసీసీ నేతలు తేల్చి చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ వల్లే తాము విపక్ష కూటమికి మద్దతివ్వలేమని అకాలీ దళ్ వంటి ఇతర పార్టీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అభ్యర్థిని బరిలో దింపిన మమతా బెనర్జీ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

ద్రౌపదీ గెలుపుకే అవకాశాలెక్కువ..
విపక్ష అభ్యర్థిని బరిలో దింపి, కూటమికోసం కష్టపడుతున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం అస్త్ర సన్యాసం చేసినట్టుగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్మూ గెలుపుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు మమతా బెనర్జీ. ముర్మూకు మద్దతిచ్చే అంశంపై ప్రతిపక్ష పార్టీలు ఓసారి ఆలోచించాల్సిందని అంటున్నారామె. అదే సమయంలో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ముని నిలబెట్టే ముందు ప్రతిపక్షాలతో బీజేపీ చర్చిస్తే బాగుండేదని కూడా అభిప్రాయపడ్డారు మమత. ఏకాభిప్రాయంతో ఎన్నికయ్యే వ్యక్తి రాష్ట్రపతిగా ఉండడమే దేశానికి మంచిదని, ఆ దిశగా బీజేపీ కృషిచేసి ఉండాల్సిందని అంటున్నారు మమత. అంటే కేవలం బీజేపీ తమతో చర్చించలేదన్న కారణంగానే తాము పోటీగా అభ్యర్థిని నిలబెట్టినట్టు పరోక్షంగా ఒప్పుకున్నారు మమత.

ద్రౌపదీ ముర్మూకి పెరుగుతున్న మద్దతు..
వ్యవసాయ చట్టాల రద్దుకోసం ఏకంగా కేంద్ర కేబినెట్ నుంచి బయటకు వచ్చి, ఎన్డీఏకి మద్దతు ఉపసంహరించుకున్న అకాళీదల్ వంటి పార్టీలు సైతం.. రాష్ట్రపతి ఎన్నికలను సాకుగా చూపిస్తూ బీజేపీకి దగ్గరవుతున్నాయి. అకాళీదల్ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్.. ద్రౌపదీ ముర్ముకే తమ మద్దతు అని ప్రకటించారు. కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత వల్లే తాము బీజేపీతో వెళ్లాల్సి వస్తోందని చెప్పారాయన.

ఇటు బీజేపీకి మద్దతు పెరుగుతోంది, అటు విపక్ష కూటమిలో గెలుపు ధీమా సన్నగిల్లుతోంది. దీంతో ద్రౌపదీ ముర్మూ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం లాంఛనమేనని తేలుతోంది. ప్రతిసారీ జరిగే తంతు ఇదే అయినా.. ఈసారి మాత్రం విపక్షాలు ఎన్నికలకు ముందే అస్త్రసన్యాసం చేశాయి, బీజేపీ అభ్యర్థి గెలుపు లాంఛనమేనని స్టేట్ మెంట్లు ఇస్తున్నాయి.

First Published:  1 July 2022 9:17 PM GMT
Next Story