Telugu Global
NEWS

హైదరాబాద్ లో రెండు రోజుల బీజేపీ ‘సంబరాలు’

హైదరాబాద్ లో శని, ఆదివారాల్లో .. రెండు రోజులపాటు బీజేపీ ‘సంబరాలు’ జరగనున్నాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, చర్చా గోష్టులు, ఎగ్జిబిష‌న్ల‌తో నగరమంతా కాషాయమయం కానుంది. ఇప్పటికే సిటీలో అనేకచోట్ల మోడీ, ఇతర బీజేపీ నేతల భారీ కటౌట్లు, పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. పార్టీ పతాకాలతో రోడ్లపక్కన పరిసరాలన్నీ నిండిపోయాయి. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితర ప్రముఖులంతా నగరంలో అడుగుపెట్టనున్నారు. 340 మందికి పైగా […]

హైదరాబాద్ లో రెండు రోజుల బీజేపీ ‘సంబరాలు’
X

హైదరాబాద్ లో శని, ఆదివారాల్లో .. రెండు రోజులపాటు బీజేపీ ‘సంబరాలు’ జరగనున్నాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, చర్చా గోష్టులు, ఎగ్జిబిష‌న్ల‌తో నగరమంతా కాషాయమయం కానుంది. ఇప్పటికే సిటీలో అనేకచోట్ల మోడీ, ఇతర బీజేపీ నేతల భారీ కటౌట్లు, పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. పార్టీ పతాకాలతో రోడ్లపక్కన పరిసరాలన్నీ నిండిపోయాయి. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితర ప్రముఖులంతా నగరంలో అడుగుపెట్టనున్నారు. 340 మందికి పైగా డెలిగేట్లు ఈ కార్యక్రమాలకు హాజరవుతారని అంచనా. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణాలో అధికార పగ్గాలను చేప‌ట్టేందుకు ఉవ్విళ్ళూరుతున్న కమలనాథులు ఈ తరుణాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు చేయని యత్నమంటూ లేదు. ఈ రెండు రోజుల్లో జరిగే అన్ని సెషన్లకూ మోడీ హాజరవుతారట. పార్టీ భవిష్యత్ వ్యూహాలను రూపొందించుకునేందుకు జాతీయ కార్యవర్గ సభ్యులంతా హాజరవుతారని పార్టీ నేత తరుణ్ ఛుగ్ తెలిపారు.

ఈ సాయంత్రం ఈ సమావేశాలు ప్రారంభమవుతాయని, వీటిలో మోడీ పాల్గొనడమే గాక, కార్యకర్తలతో మమేకమవుతారని ఆయన చెప్పారు. ఇక ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారని వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా ఈ కార్యక్రమాలకు హాజరు కానున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 35 వేల పోలింగ్ బూత్ ల నుంచి బీజేపీ కార్యకర్తలు ‘విజయ్ సంకల్ప్ ర్యాలీ’లో పాల్గొంటారని తరుణ్ ఛుగ్ చెప్పారు. జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రజలు, పార్టీ కేడర్లతో సమావేశమవుతారని, వారి వారి నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయి సమస్యలను తెలుసుకుంటారని ఆయన వివరించారు.

ఇప్పటికే నగరంలో 14 పార్టీ సమావేశాలు జరిగాయి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ఈ రెండు రోజుల్లో జరిగే ఇలాంటి సమావేశాలకు హాజరు కానున్నారు. వచ్చే సంవత్సరాంతంలో జరిగే జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అప్పుడే ఇలా సన్నాహాలు ప్రారంభించింది. బీజేపీ ‘మిషన్ సౌత్’ లో భాగంగా ఈ రాష్ట్రంలో పాగా వేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటోంది. తెలంగాణాలో టీఆర్ఎస్ అపసవ్య పాలనకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని తరుణ్ ఛుగ్ వ్యాఖ్యానించారు.

బీజేపీ పోస్టర్లకు దీటుగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు
హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ కార్యక్రమాల నేపథ్యంలో.. వీధివీధినా వెలసిన ఈ పార్టీ నేతల పోస్టర్లు, పతాకాలకు దీటుగా అధికార టీఆర్ఎస్ కూడా తమ ఎనిమిదేళ్ల పాలనలో సాధించిన విజయాలతో కూడిన పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇతర మంత్రుల పోస్టర్లతో అనేక ప్రాంతాలు నిండిపోయాయి. ఓ వైపు కాషాయ జెండాలు, మరోవైపు గులాబీ జెండాలతో నగరమంతా కొత్త సందడిని సంతరించుకుంది. రాబోయే ఎన్నికల్లో నువ్వా, నేనా అన్న రీతిలో ఈ సందడి సరికొత్త రాజకీయ పోకడలకు కేంద్రబిందువుగా మారింది.

First Published:  1 July 2022 10:29 PM GMT
Next Story