Telugu Global
MOVIE REVIEWS

మూవీ రివ్యూ – పక్కా కమర్షియల్

నటీనటులు : గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, అజయ్ ఘోష్, ప్రవీణ్, సప్తగిరి తదితరులు సంగీతం : జేక్స్ బీజాయ్ సినిమాటోగ్ర‌ఫి : క‌ర‌మ్ చావ్ల‌ స‌మ‌ర్ప‌ణ : అల్లు అరవింద్ నిర్మాణం : జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్ నిర్మాత‌ : బ‌న్నీ వాస్ కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-డైరక్షన్ : మారుతి రేటింగ్ : 1.75/5 సినిమాలో కామెడీ తీయడం వేరు. సినిమానే కామెడీగా తీయడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఇన్నాళ్లూ తన […]

మూవీ రివ్యూ – పక్కా కమర్షియల్
X

నటీనటులు : గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, అజయ్ ఘోష్, ప్రవీణ్, సప్తగిరి తదితరులు
సంగీతం : జేక్స్ బీజాయ్
సినిమాటోగ్ర‌ఫి : క‌ర‌మ్ చావ్ల‌
స‌మ‌ర్ప‌ణ : అల్లు అరవింద్
నిర్మాణం : జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్
నిర్మాత‌ : బ‌న్నీ వాస్
కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-డైరక్షన్ : మారుతి
రేటింగ్ : 1.75/5

సినిమాలో కామెడీ తీయడం వేరు. సినిమానే కామెడీగా తీయడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఇన్నాళ్లూ తన సినిమాల్లో కామెడీ తీసిన దర్శకుడు మారుతి, పక్కా కమర్షియల్ సినిమాను మాత్రం కామెడీగా తీశాడు. పొట్ట చెక్కలయ్యేలా కామెడీ తీస్తున్నానని భ్రమపడుతూ తీశాడు. కామెడీ పేరిట కిచిడీ తీసి ప్రేక్షకుడి మొహాన కొట్టాడు. కామెడీ అంటూ మారుతి తీసిన ఒక్కో సీన్ చూస్తున్న జనం ఉసూరుమన్నారు. కొందరు బయటకు వెళ్లిపోతే, మరికొందరు వాట్సాప్ లో ఛాటింగ్స్ చేసుకున్నారు. ఇంకొందరు పక్కోళ్లతో బాతాఖానీ పెట్టుకున్నారు. పక్కా కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉందో చెప్పడానికి ఇంతకుమించి చెప్పాల్సిన పని లేదు.

సినిమా స్టార్ట్ అవ్వడం బాగానే ఉంది. జడ్జిగా సత్యరాజ్, ఓ ఆడపిల్లకు న్యాయం చేయలేకపోయాననే గిల్టీ ఫీలింగ్, ఆ తర్వాత ఆ పిల్ల ఉరి వేసుకోవడం, అక్కడ హీరో ఎంట్రీ ఇవ్వడం, తన పక్కా కమర్షియల్ అని చేతలతో చూపించడం అన్నీ సజావుగా సాగిపోయాయి. అయితే ఈ క్రమంలో మూవీ మొదలైన 40 నిమిషాలకే క్లైమాక్స్ ఏంటనేది సగటు ప్రేక్షకుడు ఊహించుకుంటాడు. ఎందుకంటే, ఇంతకుముందు పటాస్, టెంపర్ లాంటి సినిమాలు చూసిన అనుభవం అతడికుంది. గతంలో మహేష్ బాబు నటించిన దూకుడు, ఆగడు సినిమాల్లో కూడా ఈ టైపు ఎత్తుగడ ఉంది. పక్కా కమర్షియల్ సినిమాకు మొదటి ఫెయిల్యూర్ ఇక్కడే పడింది.

క్లైమాక్స్ ఏంటనేది సినిమా ప్రారంభమైన 40 నిమిషాలకే ఊహించుకోదగ్గ ఈ సినిమాలో కథ ఎలా ఉందో చూద్దాం. జడ్జిగా ఉండే సూర్యనారాయణ (సత్య రాజ్) న్యాయం కోసం కోర్టు గడప తొక్కిన అమూల్య (చిత్ర శుక్ల) కి న్యాయం అందించలేకపోయాననే బాధతో జడ్జ్ గా రిజైన్ చేసి వృత్తికి గుడ్ బై చెప్పేసి కిరాణా కొట్టు పెట్టుకుంటాడు. అలా తండ్రి బాధను చూసి, తన బాల్యాన్ని కోల్పోయిన లక్కీ (గోపీచంద్) లాయర్ అవుతాడు. పక్కా కమర్షియల్ గా మారిపోతాడు. కేసుల్ని తారుమారు చేస్తూ తెగ డబ్బు దోచేస్తుంటాడు.

సూర్యనారాయణ తను ఎవరి వల్ల న్యాయస్థానానికి దూరమయ్యాడో అతని కేసునే కొడుకు లక్కీ టేకప్ చేసి కమర్షియల్ రూటులో వెళ్తుండటంతో వివేక్ ( రావు రమేష్)ని నిందితుడిగా కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించాలని మళ్ళీ లాయర్ గా మారతాడు సూర్యనారాయణ. కమర్షియల్ -నాన్ కమర్షియల్ అంటూ తండ్రి కొడుకుల మధ్య జరిగే కోర్టు కేసులో చివరికి ఎవరు గెలిచారు? హీరో ఎందుకు పక్కా కమర్షియల్ గా మారాడు అనేది బ్యాలెన్స్ కథ.

ఈ కథకు గోపీచంద్ ను తీసుకోవడం అనేది మంచి నిర్ణయం. నెగెటివ్ షేడ్స్ లో గోపీచంద్ సరిగ్గా సరిపోయాడు. అయితే అతడి కోసం యాక్షన్ సన్నివేశాలు పెట్టారు. మరి మారుతి డైరక్టర్ కాబట్టి కామెడీ కూడా పెట్టాలి కదా. అవి కూడా పెట్టారు. మరి రాశిఖన్నా ఉందిగా, ఆమె కూడా మరికొన్ని సీన్లు రాశారు. అయ్యో, సీనియర్ నటుడు సత్యరాజ్ కు అన్యాయం అయిపోతోంది, ఇప్పుడెలా? అందుకే ఆయనకు కూడా 3 సీన్లు పెట్టారు. విలన్ పాత్ర బలంగా లేకపోతే హీరోయిజం ఎలివేట్ అవ్వదు, యాక్షన్ సీన్లు కూడా పండవు. కాబట్టి రావురమేష్ కు భారీగా సీన్లు పెట్టారు. పాపం.. అజయ్ ఘోష్, మారుతినే నమ్ముకున్నాడు. అలాంటి నటుడికి అన్యాయం చేస్తే ఎలా? అతడికి కూడా 4 సీన్లు పెట్టారు. ఇలా సాగింది మారుతి నెరేషన్.

తన రెగ్యులర్ సినిమాల్లో ఉండే నటీనటులందర్నీ రిపీట్ చేసిన ఈ దర్శకుడు, వాళ్లు ఎక్కడ హర్ట్ అవుతారో అనే సింపతీతో సీన్లు రాసినట్టుంది తప్ప. ప్రేక్షకుడు ఎక్కడ హర్ట్ అవుతాడో అనే ఆలోచనతో సన్నివేశాలు రాసినట్టు కనిపించదు. ఈ మొత్తం వ్యవహారంలో రాశిఖన్నా కూడా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. క్యారెక్టర్ లో కామెడీ లేకపోతే ఆమె చేయదు కాబట్టి ఆమె కోసం కామెడీ రాయాలి. అయ్యో, రాశిఖన్నా నో చెబితే మరో హీరోయిన్ మనకు దొరకదు అనే భయంతో ఆ పాత్రను ఇరికించినట్టుంది. తన డార్లింగ్ (మారుతి బయట ఇలానే పిలుస్తాడు) రాశిఖన్నా హర్ట్ అయితే తట్టుకోలేననే బాధతో దర్శకుడు ఈ పాత్రపై ఎక్కడలేని ప్రేమను పెంచుకున్నాడు. ఎంతలా అంటే తండ్రికొడుకుల మధ్య మంచి ఎమోషనల్ సీన్ పండించాల్సిన టైమ్ లో కూడా మధ్యలో రాశిని దూర్చి వెకిలి కామెడీ పెట్టేంతలా. ఇలా రాశి ఖన్నా పాత్రతో సినిమాను ఎంత చెడగొట్టాలో అంతలా చెడగొట్టాడు మారుతి. ఈమె పాత్రతో కామెడీ పేరు చెప్పి కంగాళీ చేశాడు.

“తీసేయాలి, అర్జెంట్ గా సినిమా తీసేయాలి, వెంటనే మరో సినిమాకు షిఫ్ట్ అయిపోవాలి”. పక్కా కమర్షియల్ సినిమా చూస్తే దర్శకుడిలో ఈ తొందర ఎక్కువగా కనిపించింది. అంత తొందర ఎందుకో అర్థంకాదు. తెలిసిన కథే చెబుతున్నప్పుడు సన్నివేశాల్ని ఎంత జాగ్రత్తగా పేర్చుకోవాలి? ఎంత ఒద్దికగా అల్లుకోవాలి? పాత్రల్ని ఎంత పద్ధతిగా మలుచుకోవాలి? సంగీతాన్ని ఎంత వీనులవిందుగా రాబట్టుకోవాలి? ఈ అంశాలపై మారుతి దృష్టిపెట్టినట్టు కనిపించలేదు. తీసేయాలి, అర్జెంట్ గా తీసేయాలి అనే తొందర మాత్రమే కనిపించింది. లేకపోతే ఆ పాత్రలేంటి? ఆ పాత్రల చుట్టూ అల్లుకున్న సన్నివేశాలేంటి? విలన్ ను కలిసే సందర్భంలో హీరోకు ఫైట్ పెట్టడం అవసరమా? అక్కడ హీరో విలన్ గా చేసిన సినిమాలు చెప్పడం అవసరమా? ఇక ప్రీ క్లైమాక్స్ లో వరలక్ష్మి ఎందుకు? ఇక క్లైమాక్స్ లో రావురమేష్ ను పిచ్చోడిగా చూపించడం ఏంటి? సినిమా అంతా చేసిన రచ్చ చాలదన్నట్టు ఎండ్ టైటిల్స్ దగ్గర కూడా రాశితో చేసిన హంగామా ఏంటి? ఇదంతా మాకు అవసరమా అని నిట్టూర్చాడు ప్రేక్షకుడు.

ఉన్నంతలో గోపీచంద్, ఈ సినిమాను కాపాడే ప్రయత్నం చేశాడు. పక్కా కమర్షియల్ గా అతడు చేసిన నటన, లాయర్ లుక్ బాగుంది. రాశిఖన్నా గురించి ఇంతకుముందే పారాగ్రాఫుల కొద్దీ చెప్పుకున్నాం. సత్యరాజ్ డీసెంట్ గా నటించాడు. రావురమేష్ లో విలనిజం కంటే ఓవరాక్షన్ ఎక్కువగా కనిపించింది. ఆ తప్పు అతడిది ఎంతమాత్రం కాదు, అతడితో చేయించుకున్న దర్శకుడిదే. ప్రవీణ్, సప్తగిరి కామెడీ ఛండాలంగా ఉంది. అజయ్ ఘోష్ కామెడీ సీన్లు సెకండాఫ్ లో 2 ఉన్నాయి. టెక్నికల్ గా సినిమా బాగుంది. గీతాఆర్ట్స్ డబ్బు బాగానే ఖర్చుపెట్టింది. జేక్స్ బిజాయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది, పాటలు ఫెయిల్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి.

ఓవరాల్ గా పక్కా కమర్షియల్ సినిమాలో కామెడీ ఆశిస్తే భంగపాటు తప్పదు, అలాగని ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఆశిస్తే ఆశాభంగం తప్పదు. సూపర్ హిట్ పాటలు ఆశిస్తే నిరాశ తప్పదు. అన్నీ అరకొరగా వడ్డించిన ‘సగం కమర్షియల్’ సినిమా ఇది.

Next Story