Telugu Global
NEWS

బర్త్ డే పార్టీలు అర్ధరాత్రే జరగాలా..? – ‌పబ్బుల్లోనే జరుపుకోవాలా..?

డ్రగ్స్ దందా వెలుగు చూశాక పుడింగ్ అండ్ మింక్ పబ్ లైసెన్సను ఆబ్కారీ శాఖ రద్దు చేసిన వైనం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది.  ఈ వ్యవహారం బట్టబయలు కాగానే మూడు వర్గాలు మూడు రకాలుగా స్పందించాయి. ఎక్సైజ్ శాఖ లైసెన్స్ రద్దు చేయగా, పోలీసు శాఖ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. ఇక సెలబ్రిటీ వర్గం వింతగా స్పందించింది. సెలబ్రిటీలు తాము అమాయకులమని బుకాయించగా, సంపన్నులైన  కొందరు తల్లిదండ్రులు  తమ పిల్లలను వెనకేసుకొచ్చారు. […]

Pubs in hyderabad
X

డ్రగ్స్ దందా వెలుగు చూశాక పుడింగ్ అండ్ మింక్ పబ్ లైసెన్సను ఆబ్కారీ శాఖ రద్దు చేసిన వైనం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది. ఈ వ్యవహారం బట్టబయలు కాగానే మూడు వర్గాలు మూడు రకాలుగా స్పందించాయి.

ఎక్సైజ్ శాఖ లైసెన్స్ రద్దు చేయగా, పోలీసు శాఖ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. ఇక సెలబ్రిటీ వర్గం వింతగా స్పందించింది. సెలబ్రిటీలు తాము అమాయకులమని బుకాయించగా, సంపన్నులైన కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను వెనకేసుకొచ్చారు.

తాడిచెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నామని కొందరు చెబితే, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నది మరికొందరు. బర్త్ డే పార్టీకి వెళ్లామని, ఇప్పుడే వచ్చామని, డ్రగ్స్ ఎవరు తీసుకున్నారో తెలియదని, తాము అసలే తీసుకోలేదని, అయినా, ఒకరిద్దరు తీసుకుంటే అందరినీ అనుమానించడమేమిటని ఇలా చిత్రవిచిత్రమైన స్టేట్ మెంట్లు ఇచ్చేశారు.

పబ్ ల లైసెన్స్ ల గురించి పరిశీలిస్తే…అసలు భాగ్యనగరంలో పబ్ ల కల్చర్ అవసరమా..?, 24 గంటల మద్యం సరఫరా ఎందుకు ?, అదేమైనా ప్రాణావసర ఔషధమా..?, నిత్యావసరమా..?, మద్యం ముసుగులో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తుంటే ఏం చేస్తున్నారు. చేయకుండా ఏయే చర్యలు తీసుకుంటున్నారో తెలియదు.

వాటికి లైసెన్స్ లు ఇచ్చేటప్పుడు అన్నీ పరిశీలించాలిగా.?. మన జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్లనే ఆధునిక కాలంలో అనేక రుగ్మతలు తలెత్తుతున్నాయని వైద్యులు, ప్రజారోగ్య నిపుణులు నెత్తినోరు కొట్టుకుని గగ్గోలు పెడుతుంటే , ఆబ్కారీ శాఖ ఇవేవీ పట్టనట్టు వ్యవహరిస్తోంది.

జీవనశైలిని మార్చేందుకు ఇతోధికంగా శ్రమిస్తోంది. మద్యం సరఫరాలకు, విక్రయాలకు రాత్రి 11 గంటల దాకా సమయం ఉండగా,పబ్ లలో, క్లబ్బుల్లో, కొన్ని బార్లలో 24 గంటల వరకు లైసెన్స్ లు ఎడాపెడా ఇచ్చేస్తోంది. ఆబ్కారీ శాఖ నిర్వాకానికి ప్రజలతోపాటు, పోలీసుశాఖ, వైద్యఆరోగ్యశాఖ, కార్మికశాఖలు ఇబ్బంది పడుతున్నాయి. పబ్ లలో, బార్లలో తాగి తందానాలు ఆడే వారివల్ల ప్రమాదాలు, నేరాలు జరిగి కేసులు న్యాయస్థానాలకు వెడుతుండడంతో కోర్టులపై భారం పడుతోంది.

హైదరాబాద్ అంతర్జాతీయ నగరం కాబట్టి 24 గంటలు మందు లైసెన్స్ లు కావాలని వాదిస్తున్న వారు, అనుమతి కోరుతున్న వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం ఇండియాలోనే ఉన్నాం కదా..భారత కాలమానం ప్రకారం నడిచేటప్పుడు తెల్లవార్లూ మద్యం ఎందుకు.? ఇక్కడ విదేశీయులు ఎవరూ లేరే..ఒకవేళ ఉన్నా వారు కూడా భారత కాలమానం ప్రకారం అడ్జస్ట్ కావాలి కదా…?. కొంతమంది విదేశీయుల కోసం ఎక్కువమంది భారతీయులను చెడగొడతారా.?. భాగ్యనగరానికి వచ్చే విదేశీయులు, ప్రవాస భారతీయులు జెట్ లాగ్ తో కొన్ని గంటలు ఇబ్బంది పడతారు.

ఆ తర్వాత వారే అడ్జస్ట్ అవుతారు. వారికి మద్యం రాత్రి 11 గంటల వరకు లభిస్తున్నపుడు ఆ తర్వాత ఎందుకు సరఫరా చేయాలి.? అంటే ఆ వంకతో ఇక్కడి యువతను చెడగొట్టడమేగా. అలాంటి లెసెన్స్ లు ఇస్తున్న ఆబ్కారీ శాఖను, అటు పోలీసు శాఖ, ఇటు వైద్యారోగ్య శాఖ అభ్యంతర పెట్టకపోవడమేమిటి.?.

ఇక తల్లిదండ్రుల దగ్గరకు వద్దాం. మా పిల్లలు డ్రగ్స్ జోలికి పోరు, మద్యం అసలే ముట్టుకోరు అంటూ పలువురు పేరెంట్స్ వాదించారు. బర్త్ డే పార్టీకి వెళ్ళారు. అలా వెళ్లడం కూడా తప్పేనా అని దబాయిస్తున్నారు. ఇలా అంటున్నవాళ్లంతా బర్త్ డే పార్టీలకు తెల్లవారు జామునే ఎందుకు వెళ్లాలి. అలాంటి పార్టీలు అర్ధరాత్రో, అర్ధరాత్రి దాటాకో ఎందుకు జరుగుతున్నాయో ఎప్పుడైనా ఆరా తీశారా… ? ఎప్పుడైనా ఆలోచించారా..?,

అసలు ఆ పార్టీలకు తమ పిల్లలను ఎందుకు పంపిస్తున్నారో తల్లిదండ్రులు చెప్పాలి. అయినా, పుట్టినరోజు పండుగలు, పార్టీలు పబ్ లలో, బార్లలో, హోటళ్లలో ఎందుకు జరుపుకోవాలి..? ఇంటిలో జరుపుకుంటే తప్పా… నామోషీయా..?, అంతంత ఖరీదైన పబ్ లలో, హోటళ్లలో 150 నుండి 200 మంది అతిథులకు, స్నేహితులకు పార్టీ ఇవ్వడానికి డబ్బు ఖర్చుచేసే సంపన్నులకు తమ ఇంటిలో సౌకర్యాలు కల్పించే స్తోమత లేదా..? అదీగాక, పుట్టినరోజు పార్టీ అనేది అర్ధరాత్రి ఎందుకు, మధ్యాహ్నం పూటో, సాయంత్రమో,లేదా రాత్రి భోజన సమయానికో జరుపుకుంటే నష్టమేమిటి..?.

అంటే కేవలం డ్రగ్స్, మద్యం, హుక్కా తదితరాల సరఫరా కోసమే అర్ధరాత్రి దాటాక ఈ పార్టీలు అరేంజ్ అవుతున్నాయని అర్థమవుతోందిగా. అలాంటి వాటికి తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించకూడదు. ఇంకో సంగతి..ఆయా పార్టీలకు హాజరయ్యే 150 మంది ఆయారోజుల్లో ఉదయం నుండి ఏం వెలగబెడుతున్నట్టు.?. వారికి మిత్రుల బర్త్ డేల కన్నా మించిన రాచకార్యాలు ఏం ఉన్నాయి.?. పోనీ, ఉన్నా, తమ ఫ్రెండ్స్ కోసం ఆయా పనులకు, ఉద్యోగాలకు సెలవులు పెట్టవచ్చుగా..? ఏడాదికి ఒక్కసారే వచ్చే మిత్రుల పుట్టినరోజు పండుగకు ఆ మాత్రం త్యాగం చేయలేరా..?.

మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ లు ముగించి చక్కగా ఎవరింటికి వారు వెళ్లిపోవచ్చుగా, తెల్లవార్లూ తాగి తందానాలాడితేనే పుట్టినరోజు జరుపుకున్నట్టా..?. ఆ పార్టీలో ఎవడో డ్రగ్స్ వాడితే అందరూ ఇబ్బంది పడడం ఎందుకు , పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగడమెందుకు.? తాగి నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తూ తమ ప్రాణాలమీదకు తెచ్చుకోవడం ఏమిటి? అమాయకుల ప్రాణాలను బలిగొనడం ఎందుకు.? ఇవన్నీ తల్లిదండ్రులు, పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, పాలకులు గమనించాలి.

నిజానికి పుట్టినరోజు నాడు తనను తాను తెలుసుకోవాలి. తప్ప తన్ను తాను మరిచిపోయే డ్రగ్స్ వాడడం కాదని గ్రహించాలి. తమను ఈ లోకానికి రప్పించిన తల్లిదండ్రులను పూజించాలి. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గౌరవించాలి. తమను ఈ స్థాయికి తీసుకువెళ్ళిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. పోనీ, వీరంతా తమకు అనవసరం, మిత్రులే కావాలి అనుకుంటే, వారికి షడ్రసోపేతమైన భోజనాలు పెట్టాలి. ఇంకా మందుపోసి చిందేయాలనుకుంటే కూడా అలాగే చేసుకోవచ్చు.

కానీ అవన్నీ పబ్ లలో, బార్లలో నడిరేయి కాకుండా పగలే చేసుకోవాలి. ఈ దిశగా తల్లిదండ్రులు మార్గనిర్దేశనం చేయాలి. హోటళ్లలో, బార్లలో ఇలాంటి పార్టీలు జరుగుతున్నపుడు పోలీసులు కూడా ముందే అప్రమత్తం కావాలి. నేరాలు జరిగాక రైడ్స్ చేయడం కాకుండా మందుచూపుతో వ్యవహరించాలి.

చివరగా, పార్టీకి వెళ్లడానికి పబ్ వాళ్లు ఒక యాప్ క్రియేట్ చేయడం ఎందుకు, ఎవరు రావాలో, ఎలా రావాలో, ఎప్పుడు రావాలో, ఎందరు రావాలో పబ్ వాడు డిసైడ్ చేస్తాడా…?అంటే దానర్థం.. ఆ పబ్బుల్లో, క్లబ్బుల్లో మద్యం, మాదక ద్రవ్యాలు సరఫరా వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే కదా..? లేకుంటే ఇన్ని జాగ్రత్తలు , ఇంత హంగామా ఎందుకు..?

ఇక, నేరాలను అదుపు చేయడంలో ప్రజలు తమకు సహకరించాలని పోలీసులు కోరుతుంటారు. నేరస్తుల వీపులు వాయగొట్టేందుకు ప్రజలు ముందడుగేస్తే అదే పోలీసులు అడ్డుకుంటారు. అదేమంటే చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదంటారు. ఇదిగో ఈ వైఖరే అక్రమార్కుల పంట పండిస్తోంది. మనం ఎన్ని దందాలైనా చేయవచ్చు, అక్రమాలకు పాల్పడవచ్చు.

సహకరించే లంచగొండి యంత్రాంగం ఉండనే ఉంటుంది అనే అభిప్రాయం నేరాలకు పాల్పడే వారిలో బలపడిపోయింది. అందుకే ఏ నేరమైనా తీసుకోండి దానికి సహకరించే వ్యక్తులు అటు అధికార యంత్రాంగంలోనో. రాజకీయ నేతాగణంలోనో ఉంటారు. ఉదాహరణకు ఈ పబ్ ల లైసెన్స్ లు, మాదకద్రవ్యాల సరఫరా నే తీసుకుంటే.. నగరం నడిబొడ్డున అంత దర్జాగా డ్రగ్స్, మద్యం ఎలా సరఫరా చేయగలరు.?, అంటే వారికి పెద్దల అండదండలు ఇబ్బడిముబ్బడిగా ఉంటేనేగా.

డబ్బు వెదజల్లితే లైసెన్స్ లు, ఇతర పర్మిషన్లు వాటంతట అవే వస్తాయి. మద్యం, మాదకద్రవ్యాల సరఫరాలో సంబంధిత శాఖలు చూసీచూడనట్టు వ్యవహరిస్తాయి. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా మీడియాకు తెలియకుండా నిర్వాహకులు మేనేజ్ చేయగలరు. వ్యవహారం మరీ శ్రుతిమించితే మందలించి, చిన్నచిన్న కేసులు పెట్టి చేతులు దులిపేసుకునేందుకు ఆబ్కారీ, పోలీసు శాఖలు రెండూ రెడీగా ఉంటాయి.

ఇటీవల ఓ బాలికపై అత్యాచారానికి దారితీసిన పబ్ పై ఎన్.ఎస్.యు.ఐ నాయకత్వంలో బయలు దేరిన వారిని పోలీసులే అడ్డుకున్నారు. ఆ పబ్ కు వందల మంది పోలీసులు కాపలా కాశారు. ఆందోళనకారులనే తరిమివేశారు. పబ్బు చెక్కు చెదరకుండా కాపాడారు. అప్పుడా పబ్ యజమాని, లేదా నిర్వాహకుడు ఏమనుకుంటాడు. తాను తన పబ్ లో ఎన్ని అసాంఘిక కార్యకలాపాలు సాగించినా తనకేమీ కాదు. పోలీసులే దగ్గరుండి రక్షణ కల్పిస్తారనుకుంటాడు.

అందుకే ధీమాగా ఉంటాడు. సమాజం ఎక్కడికి పోయినా, ఏమై పోయినా నాకేంటి? అనుకుంటాడు. అమ్మాయిలపై అత్యాచారాలు జరిగితేంటి? , మైనర్లు తాగి తందానాలాడితేంటి .? అనే వైఖరి వేళ్ళూనుకుంటుంది. అలాగాకుండా తాను కూడా సంఘంలో భాగమని, తనకు కూడా శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యత ఉంటుందని అతను అనుకుంటే మైనర్లను రానిచ్చేవాడే కాదు, మద్యం, మాదకద్రవ్యాలు సరఫరా చేసేవాడే కాదు, చేసినా సమాజం ఊరుకోదు అని భయపడేవాడు.

ఆ భయం కూడా ఆ యజమానికి లేదు. తనకు రక్షణగా పోలీసులుంటారని, తన ఆస్తికి వారే రక్షకులు అని భావించాడు. ఇలాంటి వైఖరి పాతుకుపోయినపుడు పోలీసులకు వారెందుకు భయపడతారు. ఇక ప్రజలు పోలీసుశాఖకు ఎందుకు సహకరిస్తారు.? .అలా కాకుండా కొద్దిసేపు పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తే పబ్ రూపురేఖలు మారేది. దానివల్ల చట్టాన్ని ఆందోళనకారులు చేతుల్లో తీసుకున్నప్పటికీ సమాజానికి మేలు జరిగేది. ఎలాగంటే,,? తాను అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే, అధికార యంత్రాంగాన్ని , పోలీసులను, పాలకులను మేనేజ్ చేసినా ప్రజలనుంచి తప్పించుకోలేననే వాస్తవం ఆ పబ్ యాజమాన్యానికి తెలిసి వచ్చేది.

అలాంటి సువర్ణావకాశాన్ని పోలీసులు పోగొట్టుకున్నారు. అందుకే సమాజంలో నేర ప్రవృత్తి పెచ్చరిల్లుతోంది. దీంతో ఏం జరిగినా మనకెందుకులే , అంతా పోలీసులు చూసుకుంటారులే అని ప్రజలు భావిస్తున్నారు.

Next Story