Telugu Global
National

అప్పుడే ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు

మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే రెబెల్ ఎమ్మెల్యేలలో ఇద్దరికి బెదిరింపు కాల్స్ అందాయి. రెబెల్ శివసేన ఎమ్మెల్యే బాలాజీ కిన్కర్, మరో రెబెల్ బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్ ల్యాడ్… తమను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ అందాయని తెలిపారు. తమకు భద్రత మరింత అవసరమని వారు కోరుతున్నారు. థాక్రే రాజీనామా చేసి 12 గంటలు కూడా కాలేదని, అప్పుడే ఎవరో తమను ఇలా బెదిరిస్తున్నారని వారన్నారు. కాగా-మరో 48 గంటల్లో ముఖ్యమంత్రి, ఉప […]

prasad-lad
X

మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే రెబెల్ ఎమ్మెల్యేలలో ఇద్దరికి బెదిరింపు కాల్స్ అందాయి. రెబెల్ శివసేన ఎమ్మెల్యే బాలాజీ కిన్కర్, మరో రెబెల్ బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్ ల్యాడ్… తమను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ అందాయని తెలిపారు.

తమకు భద్రత మరింత అవసరమని వారు కోరుతున్నారు. థాక్రే రాజీనామా చేసి 12 గంటలు కూడా కాలేదని, అప్పుడే ఎవరో తమను ఇలా బెదిరిస్తున్నారని వారన్నారు. కాగా-మరో 48 గంటల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని, ఈ కార్యక్రమానికి షిండే వర్గం నుంచి రెబెల్ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లు అంతా హాజరవుతారని తెలుస్తోంది.

12 మంది సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కవచ్చునని భావిస్తున్నారు. ఆ తరువాత బీజేపీ లేదా షిండే కోటా నుంచి ప్రహర్ వంటి చిన్నా చితకా పార్టీలకు చెందిన కొందరు సభ్యులను, ముగ్గురు ఇండిపెండెంట్లను కేబినెట్ లోకి తీసుకోవచ్చునని సమాచారం.

సభలో ఓటింగ్ జరిగిన పక్షంలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని రాజ్యసభ ఎంపీ మహేష్ జెత్మలానీ ట్వీట్ చేశారు. అవినీతి, హింసతో కూడిన ద్రోహులతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పుట్టుకొచ్చిందని, చివరకు లజ్జాకరంగా పతనమైందని ఆయన అన్నారు.

దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో రాష్ట్రం మళ్ళీ ఉన్నత పథంలోకి దూసుకుపోతుందని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అటు బీజేపీ కోర్ గ్రూప్ కూడా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించే సూచనలున్నాయి. ఫడ్నవీస్ రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లో జులై 2 న జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో హాజరవుతారని ఈ వర్గాలు వెల్లడించాయి.

సభలో బల పరీక్ష వాయిదా !

ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయడంతో అసెంబ్లీలో గురువారం ఉదయం ఫ్లోర్ టెస్ట్ వాయిదా పడినట్టేనని పార్టీ వర్గాలు చెప్పాయి. పైగా గవర్నర్ ఆదేశాల మేరకు సభలో బల పరీక్ష అవసరం లేదని రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ అసెంబ్లీ కార్యదర్శి రాజేంద్ర భగవత్ తెలియజేశారు. థాక్రే తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఏక్ నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని తాజాగా పార్టీ వర్గాలు వివరించాయి. ఇన్నాళ్లూ రెబెల్ సేన ఎమ్మెల్యేలను ముంబైకి వచ్చి సభలో జరిగే బల పరీక్షలో పాల్గొనాలంటూ సవాల్ చేసిన సేన ఎంపీ సంజయ్ రౌత్ చల్లబడ్డారు.

సీఎంగా ఉద్ధవ్ రాజీనామా చేస్తున్నప్పుడు తాము ఎంతో భావోద్వేగానికి గురయ్యామని తెలిపారు. కుల, మతాలతో నిమిత్తం లేకుండా ప్రతివారూ ఆయనను సమర్థించారని, పైగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆయనను విశ్వసించారని రౌత్ అన్నారు.

మరోవైపు ముంబైలోని వైబీ చవాన్ సెంటర్ లో జరిగే తమ పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు పవార్ ఈ ఉదయం బయల్దేరివెళ్లారు. రాష్ట్రంలో ఇన్ని పరిణామాలు జరుగుతున్నా కాంగ్రెస్ నేతలు ఎవరూ పల్లెత్తుమాట మాట్లాడకపోవడం విశేషం.

First Published:  30 Jun 2022 1:32 AM GMT
Next Story