Telugu Global
NEWS

వైఎస్ఆర్‌కు నచ్చిన ఆ నియోజకవర్గం నుంచే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ?

తెలంగాణలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికల జరుగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రభుత్వ పథకాలను భారీగా ప్రచారం చేసుకుంటున్నది. బీజేపీ జూలై 3న భారీ బహిరంగ సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నది. ఇక తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ తమదేనంటూ బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. ఇటీవల తన బహుజన రాజ్యాధికార యాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. […]

RS Praveen Kumar
X

తెలంగాణలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికల జరుగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రభుత్వ పథకాలను భారీగా ప్రచారం చేసుకుంటున్నది. బీజేపీ జూలై 3న భారీ బహిరంగ సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నది.

ఇక తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ తమదేనంటూ బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. ఇటీవల తన బహుజన రాజ్యాధికార యాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇది విజయవంతం కావడంతో మరింత ఉత్సాహంగా దూసుకొని పోతున్నారు.

తెలంగాణలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంపై బీఎస్పీ చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్ఎస్పీ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గం, హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం తనకు కలసి వస్తుందని ప్రవీణ్ కుమార్ అంచనా వేసుకున్నారు. ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మీద వ్యతిరేకత ఉన్నదని, అక్కడ ఆర్ఎస్పీ పోటీ చేస్తే గెలుస్తాడని ప్రశాంత్ కిశోర్ కూడా రిపోర్టు ఇచ్చినట్లు టీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఆర్ఎస్పీ స్థాపించిన స్వేరో సభ్యులు కూడా ఆయన చేవెళ్ల నుంచే పోటీ చేయమని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చాలా అదృష్టంగా భావించేవారు. తనకు అధికారం తెచ్చిపెట్టిన పాదయాత్ర సహా.. చాలా పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సబితను చేవెళ్ల చెల్లెమ్మగా అప్పట్లో అభివర్ణించేవారు. అయితే ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్ అయిన తర్వాత ఆమె మహేశ్వరం నియోజకవర్గానికి మారిపోయారు.

గత రెండు ఎన్నికల్లో కాలె యాదయ్య ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ తరపున, 2018లో టీఆర్ఎస్ తరపున ఆయన గెలిచారు. అయితే ప్రస్తుతం అతనిపై స్థానికంగా వ్యతిరేకత ఉన్నది. ఇతర పార్టీలు కూడా అక్కడ బలహీనంగా ఉన్నాయి. అయితే, సాంఘీక సంక్షేమ పాఠశాలల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ చాలా పాపులర్ అయ్యారు.

యువత, విద్యార్థుల్లో ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉన్నది. కేవలం దళిత, బహుజనుల్లోనే కాకుండా ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా ఆయనను గౌరవిస్తారు. ఎన్నికల్లో నిలబడితే యువ ఓటర్లు ఆయనకు తప్పకుండా ఓటేస్తారని భావిస్తున్నారు. అందుకే చేవెళ్ల నుంచి పోటీకి నిలబడితే స్థానిక ఎమ్మెల్యే వ్యతిరేకతతో పాటు, గతంలోని తన విద్యార్థుల అండ కూడా గెలవడానికి ఉపయోగపడుతుందని ఆర్ఎస్పీ భావిస్తున్నారు.

First Published:  30 Jun 2022 5:38 AM GMT
Next Story