Telugu Global
Business

వారసులకు ముఖేష్ అంబానీ ఆస్తుల పంపిణీ.. రిలయన్స్ విడిపోకుండా అద్భుతమైన ప్లాన్

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లలో ఒకరు, దేశంలో అదానీ తర్వాత అత్యధిక సంపద కలిగిన వ్యక్తి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఇక అంబానీ కుటుంబంలో మూడో తరం రిలయన్స్ బాధ్యతలను చేపట్టడానికి మార్గం సుగమమం అయ్యింది. ఇప్పటికే పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీని జియో టెలికాంకు చైర్మన్‌గా నియమించారు. కూతురు, చిన్న కొడుకు కూడా త్వరలోనే రిలయన్స్‌లో కీలకం కానున్నారు. అదే సమయంలో తన ఆస్తులను, సంస్థలను మూడు భాగాలు చేయాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. […]

Mukesh Ambani
X

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లలో ఒకరు, దేశంలో అదానీ తర్వాత అత్యధిక సంపద కలిగిన వ్యక్తి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఇక అంబానీ కుటుంబంలో మూడో తరం రిలయన్స్ బాధ్యతలను చేపట్టడానికి మార్గం సుగమమం అయ్యింది.

ఇప్పటికే పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీని జియో టెలికాంకు చైర్మన్‌గా నియమించారు. కూతురు, చిన్న కొడుకు కూడా త్వరలోనే రిలయన్స్‌లో కీలకం కానున్నారు. అదే సమయంలో తన ఆస్తులను, సంస్థలను మూడు భాగాలు చేయాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళిక పూర్తి చేసినట్లు తెలుస్తున్నది.

తండ్రి ధీరూబాయ్ అంబానీ చేసిన తప్పును తాను చేయకూడదని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. ధీరూబాయ్ బతికి ఉన్నన్ని రోజులు ఆస్తులను విడదీయకుండా ముఖేష్, అనిల్‌లను కొన్ని వ్యాపారాలకు చైర్మన్లుగా మాత్రమే నియమించాడు.

దీంతో ఆయన చనిపోయిన తర్వాత ఆస్తుల పంపిణీలో గొడవలు వచ్చాయి. తల్లి మధ్యవర్తిత్వంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముఖేష్‌కు, టెలికాం, ఇతర వ్యాపారాలు అనిల్ అంబానీకి వచ్చాయి. కానీ సరైన ప్రణాళిక, ముందు చూపు లేకపోవడంతో అనిల్ అంబానీ చేతికి వచ్చిన రిలయన్స్ వ్యాపారాలన్నీ నష్టాల బాట పట్టాయి.

అనతి కాలంలోనే అనిల్ పూర్తిగా అప్పుల్లో కూరుకొని పోయి అనేక సంస్థలను వదిలేసుకున్నాడు. మరోవైపు అన్న ముఖేష్ మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు తోడు అనేక సంస్థలను నెలకొల్పి విజయవంతం చేశాడు. రిలయన్స్ అనే సంస్థ మూతబడకుండా కాపాడింది ముఖేష్ అంబానీనే అని చెప్పవచ్చు. తన తదనంతరం రిలయన్స్ విడిపోకుండా ఇప్పటికే ‘వాల్ మార్ట్’ తరహా వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సన్నిహితులు అంటున్నారు.

వాల్టన్ ఫ్యామిలీ మోడల్ ఏంటి?

కుటుంబ వ్యాపారాలను కాపాడుకోవడంలో చాలా మంది వాల్టన్ ఫ్యామిలీ మోడల్‌ను అనుసరిస్తుంటారు. వాల్ మార్ట్ అనే సంస్థను 1962లో శామ్ వాల్టన్ స్థాపించాడు. అమెరికాలో తొలి స్టోర్ స్థాపించి విజయవంతం అయిన వాల్టన్.. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ మార్కెట్ చైన్‌గా వాల్ మార్ట్ ఎదిగింది. అయితే నలబై ఏళ్ల క్రితమే వాల్టన్ తన వ్యాపారాలను నలుగురు బిడ్డలు అలీస్, రాబ్, జిమ్, జాన్‌లకు సమానంగా పంచాడు.

ఒక ఇండిపెండెంట్ బోర్డు ఏర్పాటు చేసి, కుటుంబ సభ్యులనే బోర్డు డైరెక్టర్లుగా నియమించి ఆ నలుగురి వ్యాపారాలను పర్యవేక్షించేలా ఏర్పాటు చేశాడు. నాలుగు వ్యాపారాలుగా విడదీయడంతో ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్సులు కూడా తగ్గిపోయాయి. అంతే కాకుండా నలుగురి మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించిన గొడవలు కూడా ఏనాడూ రాలేదు. దీంతో వాల్‌మార్ట్ ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగిపోతోంది.

అంబానీ ఏం చేయబోతున్నారు?

ముఖేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, చిన్న కొడుకు అనంత్ అంబానీ, కూతురు ఇషా అంబాని ఇప్పుడు ఆయన వ్యాపారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రిలయన్స్‌కు చెందిన టెలికాం వ్యాపారమైన జియోను ఆకాశ్‌కు అప్పగించారు. జియో టెలికాం డైరెక్టర్‌గా ముఖేష్ రాజీనామా చేసి ఆకాశ్‌ను చైర్మన్‌గా నియమించాడు. ఇక రిలయన్స్ వ్యాపారాలు విడిపోకుండా ఉండేందుకు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నారు.

టాటా సన్స్ అనే ట్రస్ట్ కిందే టాటా వ్యాపారాలన్నీ ఉన్నట్లు.. రిలయన్స్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నారు. దీని కిందే అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించిన సంస్థలు ఉండనున్నాయి. టెలికాం ఆకాశ్‌కు.. రిటైల్ వ్యాపారం కుమార్తె ఇషాకు.. పెట్రో కెమికల్, మీడియా విభాగాలను అనంత్‌కు అప్పగించనున్నారు. ఈ మూడు వ్యాపారాలను రిలయన్స్ ట్రస్ట్ పర్యవేక్షించనున్నది. అంటే వారసులు వేర్వేరు వ్యాపారాలు చూసుకుంటున్నా,.. అందరిపై ట్రస్ట్ పర్యవేక్షణ ఉంటుంది. ఈ ట్రస్ట్‌లో కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు డైరెక్టర్లుగా ఉండనున్నారు. ఇదీ ముఖేష్ అంబానీ వ్యాపార వ్యూహం.

First Published:  30 Jun 2022 8:23 AM GMT
Next Story