Telugu Global
NEWS

కోమటిరెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్ అధిష్టానం..

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అధిష్టానం షాకిచ్చింది. ఈనెల 26న వడ్డేపల్లి రవికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు ఎంపీ కోమటిరెడ్డి. అయితే ఆ చేరిక చెల్లదని, వడ్డేపల్లి రవికి కాంగ్రెస్ సభ్యత్వం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్. అధిష్టానానికి తెలియకుండా, కనీసం టీపీసీసీ చీఫ్ కి సరైన సమాచారం ఇవ్వకుండా కండువా కప్పేసినందుకు కోమటిరెడ్డిపై ఆయన గుర్రుగా ఉన్నట్టు సమాచారం. త్వరలో దీనిపై […]

కోమటిరెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్ అధిష్టానం..
X

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అధిష్టానం షాకిచ్చింది. ఈనెల 26న వడ్డేపల్లి రవికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు ఎంపీ కోమటిరెడ్డి. అయితే ఆ చేరిక చెల్లదని, వడ్డేపల్లి రవికి కాంగ్రెస్ సభ్యత్వం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్.

అధిష్టానానికి తెలియకుండా, కనీసం టీపీసీసీ చీఫ్ కి సరైన సమాచారం ఇవ్వకుండా కండువా కప్పేసినందుకు కోమటిరెడ్డిపై ఆయన గుర్రుగా ఉన్నట్టు సమాచారం. త్వరలో దీనిపై కోమటిరెడ్డి వివరణ కూడా ఇవ్వాల్సి రావొచ్చని అంటున్నారు ఆ పార్టీ నేతలు.

వివాదాల వడ్డేపల్లి..
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు వడ్డేపల్లి రవి. అయితే టికెట్ అద్దంకి దయాకర్ కి రావడంతో.. రవి రెబల్ గా పోటీ చేశారు. ఇండిపెండెంట్ గా బరిలో దిగి కాంగ్రెస్ ఓట్లు చీల్చారు. దయాకర్ ఓటమికి ప్రధాన కారణం అయ్యారు.

దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. అక్కడ కూడా ఇమడలేక ఇప్పుడు బయటకొచ్చారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేరికలపై ప్రధానంగా దృష్టిపెట్టడంతో అదే అదనుగా భావించి రవి.. కోమటిరెడ్డిని ఆశ్రయించారు. 2024 వరకు రవిపై సస్పెన్షన్ ఉన్నా కూడా కోమటిరెడ్డి ఆ వ్యవహారాన్ని పక్కనపెట్టి కాంగ్రెస్ కండువా కప్పారు.

ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం సున్నితంగా ఆ వ్యవహారాన్ని పక్కనపెట్టారు. మరోసారి కలుద్దాం అని వడ్డేపల్లి రవికి కబురు పంపారు. ఈలోగా ఈ వ్యవహారం రచ్చ రచ్చ అయింది.

దయాకర్ ఫిర్యాదు..
తన ఓటమికి కారణమైన వ్యక్తిని, అందులోనూ సస్పెన్షన్ లో ఉన్న వ్యక్తిని తిరిగి పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ అద్దంకి దయాకర్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ చేరికకు ఎలా సహకరిస్తారంటూ మండిపడ్డారు.

దీంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ స్పందించారు. సమాచారం సేకరించి వడ్డేపల్లి చేరికను నిరాకరించారు. ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం ఇవ్వట్లేదని ప్రకటించారు. దీంతో కోమటిరెడ్డికి పెద్ద షాక్ తగిలినట్టయింది.

ఆమధ్య టీపీసీసీ చీఫ్ పదవి రాకపోవడంతో అసంతృప్తితో రగిలిపోయిన కోమటిరెడ్డి.. ఇటీవల కాస్త పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఇప్పుడు మరోసారి ఆయనకు వడ్డేపల్లి రూపంలో షాక్ తగిలింది. వడ్డేపల్లి రవి చేరికను అధిష్టానం కాదనడం సంచలనంగా మారింది.

First Published:  29 Jun 2022 9:03 PM GMT
Next Story