Telugu Global
National

నితీష్ కుమార్ బీజేపీకి షాక్ ఇవ్వనున్నారా ?

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న ఈ సమయంలో బీహార్ లో జరుగుతున్న పరిణామాలు అక్కడ కూడా సంక్షోభం తప్పదనే వాదనలను ముందుకు తెస్తున్నాయి. బీహార్ లో ప్రస్తుతం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. సభ ప్రారంభమైన రోజు నుండి ప్రతిపక్ష ఆర్జేడీ అగ్నిపథ్ పథకంపై సభను అడ్డుకుంటోంది. సభలో అగ్నిపథ్ చర్చకు స్పీకర్ అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం నుండి వర్షాకాల సమావేశాలు అయిపోయేదాకా తమ పార్టీ సభను నిరవధికంగా బహిష్కరిస్తున్నట్టు మంగళవారం భోజన విరామ సమయానికి ముందు […]

నితీష్ కుమార్ బీజేపీకి షాక్ ఇవ్వనున్నారా ?
X

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న ఈ సమయంలో బీహార్ లో జరుగుతున్న పరిణామాలు అక్కడ కూడా సంక్షోభం తప్పదనే వాదనలను ముందుకు తెస్తున్నాయి.

బీహార్ లో ప్రస్తుతం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. సభ ప్రారంభమైన రోజు నుండి ప్రతిపక్ష ఆర్జేడీ అగ్నిపథ్ పథకంపై సభను అడ్డుకుంటోంది. సభలో అగ్నిపథ్ చర్చకు స్పీకర్ అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం నుండి వర్షాకాల సమావేశాలు అయిపోయేదాకా తమ పార్టీ సభను నిరవధికంగా బహిష్కరిస్తున్నట్టు మంగళవారం భోజన విరామ సమయానికి ముందు ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. వారికి మద్దతుగా వామపక్షాలు, ఎమ్ ఐ ఎమ్ , కాంగ్రెస్ పార్టీలు కూడా సభను బహిష్కరించాయి.

అయితే భోజన విరామ సమయం తర్వాత సభ ప్రారంభంకాగానే చూస్తే అధికార జేడీయూ సభ్యులు కూడా సభకు రాలేదు. దాంతో జేడీయూ తో అధికారం పంచుకుంటున్న బీజేపీ కంగు తింది. ఒక బీజేపీ ఎమ్మెల్యే లేచి సభలో కోరం లేదని స్పీకర్ దృష్టికి తీసుకవచ్చారు. అయితే సాంకేతికంగా కోరం ఉందని స్పీకర్ చేసిన వాదనను బీజేపీ సభ్యుడు వ్యతిరేకించాడు. తాము చర్చించటానికి అనేక విషయాలున్నాయని ఇలాంటి సమయంలో సభ్యులు హాజరు కాకపోవడం సరైంది కాదని బీజేపీ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ సమయంలోనే స్పీకర్ సభను వాయిదా వేశారు.

అనంతరం ఇదంతా జేడీయూ, ఆర్జేడీ కలిసి వేసిన పథ‌కమనే వాదనలు మీడియాలో వినిపించాయి. జేడీయూ బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలనుకుంటోందని అందువల్లే ఇలాంటి అడుగులు వేస్తోందని విశ్లేషణలు వచ్చాయి.

సభ వాయిదా పడ్డ అనంతరం ఒక మంత్రితో సహా కొద్దిమంది జెడి(యు) ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో షికారు చేస్తూ మీడియాకు కనిపించారు. ఆర్జేడి బహిష్కరణ పిలుపు వల్లనే తాము కూడా సభకు రాలేదన్న వాదనలను వారు ఖండించారు.

“జెడి(యు) సభ్యుల గైర్హాజరు వెనుక ఏదైనా ఎజెండా ఉందని అనుకోవడం తప్పు. సమావేశం నుండి తిరిగి వస్తున్నప్పుడు మేము కొంచెం ఆలస్యంగా వచ్చాము” అని ఆహారం, వినియోగదారుల రక్షణ శాఖా మంత్రి , ముఖ్యమంత్రికి సన్నిహితంగా భావించే లేషి సింగ్ అన్నారు.

ప్రతిపక్షాల బహిష్కరణ పిలుపు గురించి అడిగినప్పుడు, ఆమె బదులిస్తూ “ఇది సరికాదు. సభ లోపల కూడా వారు సృష్టించిన రచ్చను మేము ఆమోదించము. అగ్నిపథ్‌పై మా పార్టీ వైఖరిని ఎప్పుడో స్పష్టం చేశాము. ఈ విషయం అసెంబ్లీలో చర్చించడం అనవసరమని మా అభిప్రాయం.” అని లేషి సింగ్ చెప్పారు.

అయితే కొంత కాలంగా మిత్రపక్షాలుగా అధికారాన్ని పంచుకుంటున్న జేడీయూ, బీజేపీ మధ్య వైరుద్యాలు తీవ్రమయ్యాయి. ఇరు వర్గాల మధ్య మాటల యుద్దం కూడా నడుస్తోంది. అగ్నిపథ్ కు నిరసనగా బీహార్ లో జరిగిన హింస విషయంలో ఇరు పార్టీల నడుమ వైరుద్యాలు మరింత తీవ్రమయ్యాయి.

కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన వెంటనే బీహార్‌లో హింసాత్మక నిరసనలు జరిగాయి. అనేక బిజెపి కార్యాలయాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. అనేక మంది బీజేపీ నాయకుల ఇళ్ళు,కార్లు ధ్వంసం చేశారు. అయితే ఇదంతా ప్రతిపక్షం ఆర్జేడీ పన్నిన కుట్రగా ప్రచారం చేయాలని బీజేపీ ప్రయత్నించింది. ఆర్జేడీపై దుమ్మెత్తి పోసింది. అయితే జేడీయూ మాత్రం అందుకు భిన్నంగా స్పందించడంతో బీజేపీకి ఎటూ పాలుపోని స్థితి ఏర్పడింది. ఆ నిరసనలు, హింస ఆకస్మికంగా జరిగిందని, ఇందులో ఎలాంటి కుట్ర లేదని JD(U) వాదించింది.

ఈ నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీలో పరిణామాలు చూస్తే కొద్దివ రోజుల్లోనే బీహార్ లో రాజకీయ సంక్షోభం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జేడీయూ బీజేపీ తో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీతో జట్టుకట్టే అవకాశం ఉందని బీజేపీ నాయకులు అనుమానిస్తున్నారు.

First Published:  28 Jun 2022 7:58 PM GMT
Next Story