Telugu Global
NEWS

వైసీపీ ప్లీనరీకి విజయమ్మ హాజరు..!

షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ అనే పార్టీ పెట్టిన తర్వాత విజయమ్మ దాదాపుగా కుమార్తెతోపాటే ఉంటున్నారు. జగన్ తో విభేదాలున్నాయనే పుకార్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ నాయకులు ఎప్పటికప్పుడు వాటిని కొట్టిపారేస్తున్నా.. ఇటీవల కాలంలో జగన్, విజయమ్మ కలసి కనిపించిన సందర్భాలు అరుదు. అయితే ఈ అపోహలకు చెక్ పెడుతూ ఇప్పుడు విజయమ్మ వైసీపీ ప్లీనరీ సమావేశానికి హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలో జరిగే వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ […]

వైసీపీ ప్లీనరీకి విజయమ్మ హాజరు..!
X

షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ అనే పార్టీ పెట్టిన తర్వాత విజయమ్మ దాదాపుగా కుమార్తెతోపాటే ఉంటున్నారు. జగన్ తో విభేదాలున్నాయనే పుకార్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ నాయకులు ఎప్పటికప్పుడు వాటిని కొట్టిపారేస్తున్నా.. ఇటీవల కాలంలో జగన్, విజయమ్మ కలసి కనిపించిన సందర్భాలు అరుదు.

అయితే ఈ అపోహలకు చెక్ పెడుతూ ఇప్పుడు విజయమ్మ వైసీపీ ప్లీనరీ సమావేశానికి హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలో జరిగే వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశానికి ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో విజయమ్మ హాజరవుతారని అంటున్నారు. ఇది ఊహాగానం కాదు.. వైసీపీ సీనియర్ నేత, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పిన మాట. ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆయన.. ఈ కార్యక్రమానికి విజయమ్మ కూడా హాజరవుతారని చెప్పారు.

శాశ్వత అధ్యక్షుడిగా జగన్..
ఈ ప్లీనరీలో సీఎం జగన్ ను వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. పార్టీ నియమావళిలో ఆమేరకు మార్పు చేస్తే విజయమ్మకు శాశ్వత గౌరవ అధ్యక్షురాలు అనే హోదా ఇస్తారట. అయితే ఈ శాశ్వత పదవుల విషయంపై సీఎం జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. ఈ ప్లీనరీలో 15 తీర్మానాలపై చర్చ జరుగుతుంది.

గత మూడేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో ఎక్కడైనా అసంతృప్తి ఉందా, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఏ కాస్త గ్యాప్ అయినా ఉందా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుందని చెప్పారు ఉమ్మారెడ్డి. భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు సంబంధించి ప్లీనరీలో తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నట్టు చెప్పారాయన.

కిక్ బాబు ఔట్.. అండ్ సర్వ్ ద పీపుల్..
కిక్ బాబు ఔట్.. అండ్ సర్వ్ ద పీపుల్.. అనే నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్లపోతున్నామని చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆయన.. చివరిసారిగా 2017లో ప్లీనరీ నిర్వహించామని, అధికారంలోకి వచ్చాక కరోనా వల్ల జరుపుకోలేకపోయామని, ఈసారి ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.

ఈ ప్లీనరీలో వైసీపీ భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరిస్తుందని చెప్పారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది కేవలం పార్టీకి సంబంధించిన ప్లీనరీ మాత్రమే కాదని, ప్రజల ఎజెండాతో ముందుకెళ్లే అంశంపై సమగ్ర చర్చ ఉంటుందని తెలియజేశారాయన. వార్డు స్థాయిలో పోటీ చేసిన వ్యక్తికి సైతం సీఎం జగన్ స్వయంగా చేసిన సంతకంతో ఆహ్వాన లేఖను అందిస్తున్నామని సజ్జల చెప్పారు.

First Published:  29 Jun 2022 3:50 AM GMT
Next Story