Telugu Global
NEWS

ఏబీ వెంకటేశ్వరరావుపై మళ్లీ వేటు

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం మరోసారి కొరడా ఝులిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే ఆయనను ప్రింటింగ్ స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఇలా నియమించిన 15 రోజులకే ఆయన్ను మరోసారి సర్వీస్ నుంచి సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో అనుమతి లేకుండా విజయవాడ విడిచివెళ్లవద్దని ప్రభుత్వం ఆదేశించింది. తన ప్రస్తుత హోదా ద్వారా […]

ఏబీ వెంకటేశ్వరరావుపై మళ్లీ వేటు
X

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం మరోసారి కొరడా ఝులిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే ఆయనను ప్రింటింగ్ స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.

ఇలా నియమించిన 15 రోజులకే ఆయన్ను మరోసారి సర్వీస్ నుంచి సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో అనుమతి లేకుండా విజయవాడ విడిచివెళ్లవద్దని ప్రభుత్వం ఆదేశించింది.

తన ప్రస్తుత హోదా ద్వారా నిఘా పరికరాల కొనుగోలు అక్రమాల కేసును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేశారన్న అభియోగంతో తాజాగా ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం వేటు వేసింది. కేసుల్లోని సాక్షులను ప్రభావితం చేయడం అఖిల భారత సర్వీస్‌ నిబంధనలకు విరుద్దమని అలా చేసే అధికారిపై చర్యలు తీసుకునే అధికారం తమకుందని ప్రభుత్వం చెబుతోంది.

సీఎస్ జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో మరికొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఇప్పటికే ఏబీని సర్వీస్ నుంచి పూర్తిగా డిస్మిస్ చేయడానికి సిఫార్సు చేశామని వివరించారు. అఖిల భారత సర్వీసు అధికారులపై ఉండే క్రిమినల్ అభియోగాలన్నీ పూర్తిగా తొలగిపోయే వరకు సస్పెన్షన్‌లో ఉంచే విచక్షాణాధికారం ప్రభుత్వానికి ఉంటుందని సీఎస్ వెల్లడించారు.

తొలుత 2020 ఫిబ్రవరి 8న ఏపీ ప్రభుత్వం ఏబీని సస్పెండ్ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. ఈ ఏడాది మే 18న ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూన్‌ 14న పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి వేటు వేసింది ప్రభుత్వం.

First Published:  28 Jun 2022 8:43 PM GMT
Next Story