Telugu Global
National

నుపుర్‌కు మద్దతు.. తల నరికివేత, రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్

రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో దర్జీ హత్యతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమూ మొదలుపెట్టాయి. ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్‌ కన్హయ్య.. ఇటీవల ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్‌ శర్మకు సోషల్ మీడియాతో మద్దతు తెలిపారు. ఆమె వ్యాఖ్యలను సమర్ధించడమే కాకుండా కన్హయ్య కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పలు సంస్థల నుంచి అతడికి బెదిరింపులు వచ్చాయి. స్థానిక పోలీసులు కన్హయ్యపై కేసు పెట్టి అరెస్ట్ కూడా చేశారు. […]

నుపుర్‌కు మద్దతు.. తల నరికివేత, రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్
X

రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో దర్జీ హత్యతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమూ మొదలుపెట్టాయి. ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్‌ కన్హయ్య.. ఇటీవల ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్‌ శర్మకు సోషల్ మీడియాతో మద్దతు తెలిపారు. ఆమె వ్యాఖ్యలను సమర్ధించడమే కాకుండా కన్హయ్య కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆ తర్వాత పలు సంస్థల నుంచి అతడికి బెదిరింపులు వచ్చాయి. స్థానిక పోలీసులు కన్హయ్యపై కేసు పెట్టి అరెస్ట్ కూడా చేశారు. ఇటీవలే బెయిల్‌పై వచ్చిన కన్హయ్య ఎప్పటిలాగే తన షాపులో పనిచేసుకుంటుండగా రియాజ్ అఖ్తారీ, గౌస్ మహ్మద్‌ వచ్చారు. బట్టలు కుట్టించుకునే వారిలా నమ్మించారు. దాంతో కొలతలు తీసుకునేందుకు కన్హయ్య ప్రయత్నిస్తున్న సమయంలో రియాజ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో కన్హయ్య మెడపై నరికాడు. అతడు కింద పడి విలవిలలాడుతున్న సమయంలోనే.. శరీరం నుంచి తలను పూర్తిగా వేరు చేశాడు. ఈ దారుణాన్ని గౌస్ మహ్మద్‌ మొబైల్‌లో రికార్డు చేశాడు.

అక్కడి నుంచి పారిపోయిన ఇద్దరు హంతకులు ఆ తర్వాత హత్యకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మొత్తం మూడు వీడియోలను విడుదల చేశారు. అందులోని ఒక వీడియోలో నరేంద్రమోడీని ఉద్దేశించి వీరిద్దరు హెచ్చరికలు చేశారు. ”ఉదయ్‌ పూర్‌లో ఒకడి తల నరికేశాం. రేయ్ నరేంద్రమోడీ విను.. నీవు నిప్పు రాజేశావు. మేము ఆర్పేస్తాం. ఈ కత్తి నీ మెడ దాకా కూడా వస్తుంది” అంటూ మాట్లాడారు.

వీడియో వైరల్‌ అవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఉదయ్‌పూర్‌లో షాపులన్నీ బంద్ అయ్యాయి. ఒక వర్గం వారు ర్యాలీ చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఒక మసీదుపై రాళ్ల దాడి చేశారు. ఉదయ్‌పూర్‌లో అదనపు బలగాలను మోహరించారు. 144 సెక్షన్ విధించారు. రాజస్థాన్‌ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఉదయ్‌పూర్‌లో ఇంటర్‌ నెట్ సేవలను బంద్‌ చేశారు.

హత్య అనంతరం బైక్‌లో పారిపోతున్న గౌస్, రియాజ్‌లను రాజ్‌సమంద్‌ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పాక్‌ ప్రేరిపిత ఉగ్రవాద చర్య అంటూ ఈ కేసు దర్యాప్తుకు ఎన్‌ఐఏను కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఎన్‌ఐఏ బృందం ఒకటి ఇప్పటికే ఉదయ్ పూర్‌ చేరుకుని దర్యాప్తు చేస్తోంది.

ఈ ఘటనను ఖండించిన రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్ .. ప్రధాని నరేంద్రమోడీ కూడా స్పందించాలని, ఆయన స్పందిస్తే ఫలితం ప్రభావవంతంగా ఉంటుందన్నారు. అలా స్పందించడానికి ప్రధానికి వచ్చిన ఇబ్బంది ఏంటని సీఎం ప్రశ్నించారు.

ఈ హత్యను ముస్లిం సంస్థ జమైత్‌ ఉలేమా- ఎ- హింద్‌ ఖండించింది. ఇలాంటి కూర్రమైన చర్యలు ఇస్లాంకు వ్యతిరేకమని ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని సమర్ధించే ప్రసక్తే లేదని ప్రకటించింది. హత్యను ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ఏలుబడిలో రాజస్థాన్‌ తాలిజన్ల రాజ్యంగా మారిందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆరోపించారు.

First Published:  28 Jun 2022 9:03 PM GMT
Next Story