Telugu Global
National

కోవిడ్ అనంతర రుగ్మతల్లో పావురాల ‘పాత్ర’ ! ఊపిరితిత్తులను దెబ్బ తీస్తాయా ?

నటి మీనా భర్త విద్యాసాగర్ కోవిడ్ నుంచి కోలుకుని కూడా ఆ తరువాత ఇతర రుగ్మతలకు గురై.. ముఖ్యంగా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా మరణించారని డాక్టర్ల రిపోర్టులు చెబుతున్నాయి. చెన్నైలోని వీరి ఇంటి వద్దే పెద్ద పావురాల షెడ్డు వంటిది ఉండేదని, వాటి రెట్టలతో కూడిన గాలిని పీల్చడం వల్ల ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిందని తెలుస్తోంది. గత జనవరిలో కూడా మీనా కుటుంబం కోవిడ్ కి గురై.. కోలుకున్నప్పటికీ, విద్యాసాగర్ ఆరోగ్యం మాత్రం ఈ […]

కోవిడ్ అనంతర రుగ్మతల్లో పావురాల ‘పాత్ర’ ! ఊపిరితిత్తులను దెబ్బ తీస్తాయా ?
X

నటి మీనా భర్త విద్యాసాగర్ కోవిడ్ నుంచి కోలుకుని కూడా ఆ తరువాత ఇతర రుగ్మతలకు గురై.. ముఖ్యంగా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా మరణించారని డాక్టర్ల రిపోర్టులు చెబుతున్నాయి. చెన్నైలోని వీరి ఇంటి వద్దే పెద్ద పావురాల షెడ్డు వంటిది ఉండేదని, వాటి రెట్టలతో కూడిన గాలిని పీల్చడం వల్ల ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిందని తెలుస్తోంది.

గత జనవరిలో కూడా మీనా కుటుంబం కోవిడ్ కి గురై.. కోలుకున్నప్పటికీ, విద్యాసాగర్ ఆరోగ్యం మాత్రం ఈ ‘విషపూరిత’ గాలి కారణంగా విషమిస్తూ వచ్చిందని తెలిసింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 48 ఏళ్లకే ఆయన కన్ను మూశారు. ఇంతకీ సాధారణంగా మనుషులకు స్నేహపూరితంగా ఉంటాయని భావిస్తున్న పావురాలు ఇలా వారి ఊపిరితిత్తులను దెబ్బ తీస్తాయంటే నమ్మశక్యం కాని నిజం ! పావురాల మూత్రం కూడా హానికరమేనట.

విద్యాసాగర్ లివర్ కి కూడా ఇన్ఫెక్షన్ సోకిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకుందామనుకున్న ఆయన ఆశ కూడా నెరవేరలేదు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి లంగ్స్ ని తీసి ఆయనకు ట్రాన్స్ ప్లాంట్ చేద్దామనుకున్న డాక్టర్లకు అలాంటి రోగి ఎవరూ లభ్యం కాలేదు.

అసలు ఎలుకలు ఎలా మనుషుల ఆరోగ్యానికి హాని కలుగజేస్తాయో అలాగే పావురాల నుంచి కూడా మనకు ముప్పు పొంచి ఉందని సీనియర్ పల్మనాలజిస్ట్ డా. ప్రహ్లాద్ ప్రభుదేశాయ్ అంటున్నారు. ఇండియాలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో వీటి సంఖ్య పెరిగిపోయిందని, వీటితో బాటు అనేక పక్షులు 50 రకాల వ్యాధులకు కారణమవుతాయని ఆయన ఓ అధ్యయనంలో పేర్కొన్నారు.

వీటితో నేరుగా కాంటాక్ట్ లోకి రావడం వల్ల గానీ, ఇవి వదిలిన వ్యర్థాలతో కూడిన గాలిని పీల్చడం, లేదా నీరు, ఆహార వనరుల ద్వారా సైతం మనుషులు రోగాల బారిన పడతారని ఆయన వివరించారు. గాలి ద్వారా ఇది సులభంగా మనుషులకు సోకడమే కాక.. ఫంగస్ యాస్పర్జిలోసిస్ వంటి ఇన్ఫెక్షన్లకు పావురాలు కారణమవుతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా డయాబెటిస్, హైపవర్ సెన్సిటివ్ ఇమ్యూన్ సిస్టం ఉన్నవారు మరింత త్వరగా ఈ ఇన్ఫెక్షన్లకు గురి అవుతారట.

పావురాలు వదిలే రెట్టల్లో ఎసిడిక్ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి.. వాతావరణంలో ఇది వేగంగా కలిసిపోయి ముఖ్యంగా ఆస్తమా రోగులకు ప్రాణాంతకంగా మారుతాయి.. ఇంకా సల్మోనెల్లా వంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా హానికరమే అని ప్రహ్లాద్ ప్రభుదేశాయ్ తెలిపారు. దీనివల్ల ఎలెర్జీలు సైతం వస్తాయని, కొన్ని సందర్భాల్లో పావురాల రెక్కల్లో ‘ఎవియన్ ప్రోటీన్స్’ వంటివి కూడా ప్రమాదకరమేనని ఆయన తేల్చారు.

పావురాలకు ఆహారం వేయడం మంచిదే కానీ, ఇవి ఎక్కువ సంఖ్యలో ఉన్నప్రాంతాల్లోని జనాలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఊపిరితిత్తుల జబ్బులున్నవారు వీటికి దూరంగా ఉండడమే మంచిదని ఆయన సూచిస్తున్నారు. అసలు పావురాల పెంపకం తదితరాలపై ప్రజల్లో అవగాహన పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు.

First Published:  29 Jun 2022 5:27 AM GMT
Next Story