Telugu Global
NEWS

మినీ మహానాడు వాయిదా వేయడానికి టీడీపీ అంతర్గత గొడవలే కారణమా..?

తెలుగుదేశం పార్టీ ఇటీవలే ఒంగోలులో మహానాడును భారీ ఎత్తున నిర్వహించింది. అధికార వైసీపీపై మరింత దూకుడుగా వెళ్లాలని అధినేత చంద్రబాబు ఆ సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కానీ, మహానాడు పూర్తయిన తర్వాత కొంత మంది టీడీపీ నేతలు గడప కూడా దాటలేదు. మరోవైపు ‘గడప గడపకు’ పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేరువ అవుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపి తిరిగి పుంజుకోలేక పోతుంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు దూకుడుగా […]

మినీ మహానాడు వాయిదా వేయడానికి టీడీపీ అంతర్గత గొడవలే కారణమా..?
X

తెలుగుదేశం పార్టీ ఇటీవలే ఒంగోలులో మహానాడును భారీ ఎత్తున నిర్వహించింది. అధికార వైసీపీపై మరింత దూకుడుగా వెళ్లాలని అధినేత చంద్రబాబు ఆ సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కానీ, మహానాడు పూర్తయిన తర్వాత కొంత మంది టీడీపీ నేతలు గడప కూడా దాటలేదు. మరోవైపు ‘గడప గడపకు’ పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేరువ అవుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపి తిరిగి పుంజుకోలేక పోతుంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు దూకుడుగా వెళ్తున్నారు.

ఈ నేపథ్యంలో గుడివాడలో ‘మిని మహానాడు’ నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. జూన్ 29న ఈ కార్యక్రమం నిర్వహించి.. కొడాలి నాని, పేర్ని నాని వంటి సీనియర్ వైసీపీ ఎమ్మెల్యేలకు గట్టి షాక్ ఇవ్వాలని భావించింది. మినీ మహానాడు షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుంచి వైసీసీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్రమైన మాటల యుద్దం నడిచింది. మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని టార్గెట్ చేసుకుందామని టీడీపీ అధినాయకత్వం భావించింది. కృష్ణా జిల్లాలో కొడాలి నాని దూకుడును తగ్గించాలని అనుకున్నది. కానీ, చంద్రబాబు ప్లాన్స్‌ను స్వయంగా తెలుగు తమ్ముళ్లే చెడగొట్టినట్లయ్యింది.

బుధవారం నిర్వహించాల్సిన మినీ మహానాడును వాయిదా వేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. వర్షాల కారణంగా.. మినీ మహానాడు ప్రాంగణం బురదమయం అవడం వల్లే కార్యక్రమం వాయిదా వేసినట్లు వివరణ ఇచ్చింది. కానీ, అసలు కారణం వేరే ఉన్నట్లు తెలుస్తున్నది. గుడివాడ టీడీపీలో వర్గపోరు ఎక్కువ అవడం వల్లే మహానాడు వాయిదా వేశారని సమాచారం.

మహానాడు సందర్భంగా గుడివాడ అంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు, కొత్తగా పార్టీలో చేరిన శిష్టా లోహిత్ మధ్య ఈ ఫ్లెక్సీ పంచాయితి ముదిరింది. ముఖ్యమైన కూడళ్లలో.. స్వాగత ద్వారాల వద్ద తమ ఫ్లెక్సీలు ఉంటాలంటే.. తమవి ఉండాలంటూ ఇరు నాయకులు రచ్చకెక్కారు. వీరి అనుచరుల మధ్య కూడా ఫ్లెక్సీల కారణంగా గొడవలు జరిగాయి. ఈ విషయం చంద్రబాబు వరకు వెళ్లింది.

వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలు ఎండగట్టాలని బాబు భావిస్తే.. గుడివాడ తమ్ముళ్లు తమ విభేదాలను బయటపెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో మినీ మహానాడు నిర్వహిస్తే కష్టమేనని భావించి వాయిదా వేసినట్లు సమాచారం. అయితే బయటకు మాత్రం వర్షాల కారణంగా మహానాడు వాయిదా వేస్తున్నట్లు మీడియాకు సమాచారం ఇచ్చారని తెలుస్తున్నది.

First Published:  28 Jun 2022 9:49 PM GMT
Next Story