Telugu Global

మంత్రి కొప్పులకు కష్టాలు.. తన ఎన్నిక చెల్లదన్న పిటిషన్ కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టులో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో గెలిచిన ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది. జగిత్యాల జిల్లా ధర్మపురి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ పార్టీ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీ చేశారు. కౌంటింగ్ సమయంలో వీవీ ప్యాట్స్ లెక్కపెట్టకుండానే ఎన్నికల ఫలితం […]

మంత్రి కొప్పులకు కష్టాలు.. తన ఎన్నిక చెల్లదన్న పిటిషన్ కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ
X

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టులో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో గెలిచిన ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది. జగిత్యాల జిల్లా ధర్మపురి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ పార్టీ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీ చేశారు. కౌంటింగ్ సమయంలో వీవీ ప్యాట్స్ లెక్కపెట్టకుండానే ఎన్నికల ఫలితం ప్రకటించారని లక్ష్మణ్ ఆరోపించారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకంగా ఈ ఫలితాన్ని వెల్లడించారని, కొప్పుల ఎన్నిక చెల్లదని లక్ష్మణ్ అంటున్నారు. తానే గెలిచినట్లు ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, తనపై దురుద్దేశంతోనే లక్ష్మణ్ ఈ పిటిషన్ వేశారని, దీన్ని కొట్టివేయాలని హైకోర్టుకు కొప్పుల విన్నవించారు. అయితే కొప్పుల వేసిన ఇంటర్‌లాకెట్రీ అప్లికేషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. దీంతో లక్ష్మణ్ వేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగనున్నది.

2018 ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌పై 441 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వీవీ ప్యాట్స్ లెక్కించకుండా ఫలితం ప్రకటించారని, వాస్తవానికి ఈశ్వర్ ఓడిపోయినా.. తప్పుడు ఫలితం కారణంగానే ఎన్నికయ్యారని లక్ష్మణ్ ఆరోపించారు. 2009 నుంచి ధర్మపురిలో వీరిద్దరి మధ్యనే పోటీ జరుగుతోంది. 2009 ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థి ఓట్లను చీల్చినప్పటికీ కొప్పుల ఈశ్వర్ 2 శాతం ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో కొప్పులకు 13 వేలకు పైగా మెజార్టీ వచ్చింది.

ఇక గత ఎన్నికల్లో ఈశ్వర్ 0.3 శాతం, అంటే 441 ఓట్ల తేడాతోనే గట్టెక్కారు. ఈ విషయంపైనే లక్ష్మణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, మరో ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీకి మరో సారి ఎన్నికలు జరుగనున్నాయి. మరి అప్పటిలోగా ఈ కేసు అడ్లూరికి అనుకూలంగా ఫలితం వచ్చినా పెద్దగా లాభం ఉండదు. అయితే, తాను చేసిన ఆరోపణలు నిజమైతే.. వచ్చే ఎన్నికల్లో సానుభూతి పనిచేస్తుందని లక్ష్మణ్ భావిస్తున్నారు. అందుకే ఈ పిటిషన్‌పై చాలా బలంగా పోరాడుతున్నట్లు తెలుస్తున్నది.

First Published:  28 Jun 2022 8:30 PM GMT
Next Story