Telugu Global
International

జీతం రూ. 50 వేలైతే.. అకౌంట్‌లో రూ. 1.42 కోట్లు జమ.. ఆ తర్వాత ఆ ఉద్యోగి ఏం చేశాడంటే

బ్యాంకింగ్ పొరపాట్లు అనేవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఖాతాదారుడు అకౌంట్ నెంబర్ తప్పుగా రాయడమో.. బ్యాంకు ఉద్యోగి నిర్లక్యం కారణంగానో వేరే ఖాతాల్లోకి సొమ్ములు జమ అవుతుంటాయి. ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారుల అకౌంట్లలో రూ. 10 నుంచి రూ. 15 లక్షల వరకు జమ అయ్యాయి. సాఫ్ట్‌వేర్ ప్రాబ్లెం వల్ల అలా జరిగింది. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటనలో మాత్రం తప్పంతా ఒక కంపెనీది. దక్షిణ అమెరికా దేశమైన చిలీలో కన్సార్సియో ఇండస్ట్రియల్ డే అలిమెంటోస్ అనే […]

Employee
X

బ్యాంకింగ్ పొరపాట్లు అనేవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఖాతాదారుడు అకౌంట్ నెంబర్ తప్పుగా రాయడమో.. బ్యాంకు ఉద్యోగి నిర్లక్యం కారణంగానో వేరే ఖాతాల్లోకి సొమ్ములు జమ అవుతుంటాయి. ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారుల అకౌంట్లలో రూ. 10 నుంచి రూ. 15 లక్షల వరకు జమ అయ్యాయి. సాఫ్ట్‌వేర్ ప్రాబ్లెం వల్ల అలా జరిగింది. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటనలో మాత్రం తప్పంతా ఒక కంపెనీది.

దక్షిణ అమెరికా దేశమైన చిలీలో కన్సార్సియో ఇండస్ట్రియల్ డే అలిమెంటోస్ అనే మైనింగ్ సంస్థ ఉంది. ఈ కంపెనీలో వేలాది మంది కార్మికులతో పాటు, వందల మంది అడ్మినిస్ట్రేటీవ్, సూపర్‌వైజింగ్ స్టాఫ్ కూడా పని చేస్తున్నారు. ప్రతీ నెల వీరికి అకౌంట్స్ విభాగం ఠంచనుగా జీతాలు అకౌంట్లో వేస్తుంటుంది.

ఇటీవల వేతనాలు చెల్లించే క్రమంలో ఒక ఉద్యోగికి అదనపు వేతనం వేసింది. ఆ ఉద్యోగి జీతం 5 లక్షల పెసోలు (రూ. 50 వేలు) అయితే.. ఏకంగా 16,53,98,851 పెసోలు ( రూ. 1.42 కోట్లు) అకౌంట్లో జమ అయ్యాయి. తనకు అదనపు జీతం పడిన విషయాన్ని కంపెనీ అకౌంట్స్ విభాగానికి తెలియజేశాడు. రికార్డులు పరిశీలించి.. అది నిజమేనని అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ కూడా చెప్పింది. అదనంగా పడిన జీతాన్ని వెంటనే కంపెనీ ఖాతాకు బదిలీ చేయాలని కోరింది.

అసలు కథ మొదలు..

అదనపు జీతం పడిన వెంటనే కంపెనీకి తెలియజేయడంతో అకౌంట్స్ విభాగం వాళ్లు అతడి నిజాయితికి మెచ్చుకున్నారు. ఆ డబ్బును కంపెనీకి ఇచ్చేయాలని కోరారు. అప్పటికి సరే అని సదరు ఉద్యోగి చెప్పాడు. అయితే తర్వాత రోజు కంపెనీ అధికారులు ఉద్యోగికి ఫోన్ చేశారు. డబ్బు జమ చేశాడా లేదా అని ఆరా తీశారు. అయితే తాను ఇంకా నిద్ర లేవలేదని.. కాసేపట్లో బ్యాంకుకు వెళ్లి జమ చేస్తానని వారికి చెప్పాడు. కానీ ఆ రోజు బ్యాంకుకు వెళ్లకుండా.. నేరుగా కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లి రాజీనామా లేఖ ఇచ్చాడు. అతడికి అదనపు జీతం పడినట్లు హెచ్ఆర్ వాళ్లకు తెలియక పోవడంతో దాన్ని యాక్సెప్ట్ చేశారు.

రెండు రోజులైనా ఉద్యోగి జాడ పత్తాలేకపోవడంతో అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ అతడికి ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. అధికారులు చేసిన కాల్స్, మెసేజెస్‌కు అతడు స్పందించలేదు. దీంతో అతడి ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. అదే సమయంలో అతడు కంపెనీకి రిజైన్ చేసినట్లు తెలిసి అవాక్కయ్యారు. అప్పనంగా వచ్చిపడిన సొమ్ముతో ఊరొదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయినట్లు నిర్దారించుకున్నారు.

జీతాలు వేసే సమయంలో పొరపాటు చేయడమే కాకుండా.. ఆ తర్వాత సొమ్ము రికవరీ చేయడంలో అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ నిర్లక్ష్యం వహించడంతో కంపెనీకి రూ. 1.42 కోట్లు నష్టం ఏర్పడింది. దీంతో సదరు ఉద్యోగులపై చర్యలకు దిగడమే కాకుండా.. పరారైన ఉద్యోగిపై పోలీసు కేసు పెట్టింది సదరు సంస్థ.

First Published:  29 Jun 2022 6:50 AM GMT
Next Story