Telugu Global
National

ఇది మోడీకే సాధ్యం

రెండు నాల్కలు….రెండు ముఖాలు…. ఇటువంటి మనుషులను మనం చాలా మందినే చూస్తూ ఉంటాం. అందులో రాజకీయ నాయకులు ఎక్కువగా ఉ‍ండటం సహజాతి సహజం. ఇప్పుడు ప్రభుత్వాలే ఆ పాత్ర పోషిస్తున్నాయి. అభ్యంతరకర ట్వీట్ చేశాడనే ఆరోపణపై ఆల్ట్ న్యూస్ సహ వ్యవ‌స్థాపకుడు, సీనియర్ జర్నలిస్టు జుబైర్ ను పోలీసులు అరెస్టు చేసిన రోజే వాక్ స్వాతంత్య్రం అవసరం గురించి ఓ అంతర్జాతీయ ప్రకటనపై మన ప్రధాని మోడీ సంతకం చేశారు. ఇవి రెండు సంఘటనలు ఒకే రోజు […]

ఇది మోడీకే సాధ్యం
X

రెండు నాల్కలు….రెండు ముఖాలు…. ఇటువంటి మనుషులను మనం చాలా మందినే చూస్తూ ఉంటాం. అందులో రాజకీయ నాయకులు ఎక్కువగా ఉ‍ండటం సహజాతి సహజం. ఇప్పుడు ప్రభుత్వాలే ఆ పాత్ర పోషిస్తున్నాయి.

అభ్యంతరకర ట్వీట్ చేశాడనే ఆరోపణపై ఆల్ట్ న్యూస్ సహ వ్యవ‌స్థాపకుడు, సీనియర్ జర్నలిస్టు జుబైర్ ను పోలీసులు అరెస్టు చేసిన రోజే వాక్ స్వాతంత్య్రం అవసరం గురించి ఓ అంతర్జాతీయ ప్రకటనపై మన ప్రధాని మోడీ సంతకం చేశారు. ఇవి రెండు సంఘటనలు ఒకే రోజు జరగడం యాదృచ్చికమే కావచ్చు కానీ సంఘటనలు యాదృచ్చికం కాదు.

జర్మనీలో జరుగుతున్న జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఆ సందర్భంగా భారతదేశం, G7 దేశాలు, మరో నాలుగు దేశాలు కలిసి సోమవారం ఆ ప్రకటనపై సంతకం చేశాయి,

ఆ ప్రకటన “పౌర సమాజం యొక్క‌ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, వైవిధ్యాన్ని కాపాడాలి” “ఆన్‌లైన్లో, ఆఫ్‌లైన్‌లో భావవ్యక్తీకరణ, అభిప్రాయ స్వేచ్ఛను రక్షించాలి” అని పిలుపునిచ్చింది.

“అణచివేతకు, హింసకు వ్యతిరేకంగా నిలబడే ప్రజాస్వామికవాదులందరినీ మేము అభినందిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సమాజాల స్థితిని మెరుగుపరచడానికి అంతర్జాతీయ సహకారాన్ని పెంచుతాము” అని ప్రకటనలో పేర్కొన్నారు.

“2022 రెసిలెంట్ డెమోక్రసీస్ స్టేట్‌మెంట్” అనే పేరుతో విడుదల చేసిన ఈ ప్రకటనపై భారత్‌తో పాటు, జర్మనీ, అర్జెంటీనా, కెనడా, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, సెనెగల్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు సంతకం చేశాయి.

12 దేశాలు పౌర ప్రజాస్వామిక హక్కులను, వాక్ సభా స్వాతంత్య్రాలను ప్రోత్సహించడానికి, వాటిపై బహిరంగ చర్చలను సాగించడానికి అవస‌రమైన చర్యలు చేపట్టడానికి మోడీ ఈ ప్రకటనపై సంతకం చేసిన రోజే మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా 2018 మార్చిలో జర్నలిస్టు మహ్మద్ జుబైర్ ట్వీట్ చేశాడని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.

జుబైర్ అరెస్టుపై ఎడిటర్స్ గిల్డ్ తో సహా అనేక‌ మీడియా సంస్థలు, సీనియర్ జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులు మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు, ఈ చర్య భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు మరో దెబ్బ‌ అని వర్ణించారు.

మీడియా వాచ్‌డాగ్, రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రచురించిన ఈ ఏడాది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో 180 దేశాలలో భారతదేశం ర్యాంక్ ఎనిమిది స్థానాలు దిగజారి 150కి పడిపోయింది.

నిజానికి జుబైర్ సహ వ్యవస్థాపకుడైన ఆల్ట్ న్యూస్ ఫాక్ట్స్ చెక్ చేసే వెబ్ సైట్. ప్రచారమయ్యే వార్తల్లో నిజమేది , అసత్యమేది అనేది రుజువులతో సహా వివరించే వెబ్ సైట్. అనేక సార్లు కాషాయ దళాలు చేసే అసత్యాలను రుజువులతో సహా జుబైర్ బైటపెట్టాడు. అందుకే ప్రభుత్వం అతన్ని లక్ష్యంగా చేసుకుందని జుబైర్ సహ జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. అంతే కాక మహ్మద్ ప్రవక్త పై బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జుబైర్ తీవ్ర విమర్షలు చేశాడని అది కూడా బీజేపీ ఆయనను టార్గెట్ చేయడానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు.

ఒక్క జుబైర్ అంశమే కాదు. మోడీ ఈ 8 ఏళ్ళ పాలనలో మేధావులపై, ప్రజాస్వామిక వాదులపై, యాక్టివిస్టులపై, విద్యార్థులపై అక్రమ కేసులు, జైళ్ళూ మామూలయిపోయాయి.

ప్రతిపక్ష నాయకులపై ఈడీలు, సీబీఐల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నగాక మొన్న శనివారంనాడు , గుజరాత్ మత కలహాల మీద ధీర్ఘకాలంగా పోరాడుతున్న మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ ను అరెస్టు చేశారు. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో ఫోర్జరీ , కల్పిత సాక్ష్యాలను రూపొందించారని ఆరోపణలు చేసి ఆమెను, ఆమెతోపాటు మాజీ గుజరాత్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ S.B. శ్రీకుమార్ ను అరెస్టు చేశారు.

సెతల్వాద్‌ను నిర్బంధించిన ఒక రోజు తర్వాత, పోలీసుల చర్య తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పరిరక్షకుల ప్రత్యేక ప్రతినిధి మేరీ లాలర్ అన్నారు.

భారత్ పరిస్థితులు ఇంత అప్రజాస్వామికంగా ఉండగా వాటిని అప్రతిహతంగా కొనసాగిస్తున్న ప్రధాని మోడీ ఇప్పుడు స్వేచ్చా స్వాతత్య్రాల గురించి, వాక్ సభా స్వేచ్చల గురించి ప్రపంచానికి క్లాస్ లిస్తూ ప్రకటనలు చేయడాన్ని ఏమనాలి ?

First Published:  28 Jun 2022 5:59 AM GMT
Next Story