Telugu Global
NEWS

రతన్ టాటా సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలెందుకు చెప్పారు?

కాలంతో పాటు అన్నీ మారుతాయి అన్నది నానుడి. అది నిజమే. కానీ, గమనించాల్సింది ఏంటంటే, ఏవీ కాలంతో పాటు వాటంతట అవే మారవు. మీరో, నేనో ఎవరో ఒకరు వాటిని మారిస్తేనే అవి మారతాయి. దానికి ఐడియాలు కావాలి.. ఆవిష్కరణలు రావాలి. కొత్త కొత్త ఆవిష్కరణలకు ప్రపంచ గతిని, ప్రజల జీవన విధానాన్ని మార్చే శక్తి ఉంటుంది. అందుకే భవిష్యత్ తరాల గురించి ఆలోచించే ప్రతీ ప్రభుత్వం, ముందుచూపు గల ప్రతీ నాయకుడు ఆవిష్కరణలకు పెద్ద పీట […]

రతన్ టాటా సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలెందుకు చెప్పారు?
X

కాలంతో పాటు అన్నీ మారుతాయి అన్నది నానుడి. అది నిజమే. కానీ, గమనించాల్సింది ఏంటంటే, ఏవీ కాలంతో పాటు వాటంతట అవే మారవు. మీరో, నేనో ఎవరో ఒకరు వాటిని మారిస్తేనే అవి మారతాయి. దానికి ఐడియాలు కావాలి.. ఆవిష్కరణలు రావాలి.

కొత్త కొత్త ఆవిష్కరణలకు ప్రపంచ గతిని, ప్రజల జీవన విధానాన్ని మార్చే శక్తి ఉంటుంది. అందుకే భవిష్యత్ తరాల గురించి ఆలోచించే ప్రతీ ప్రభుత్వం, ముందుచూపు గల ప్రతీ నాయకుడు ఆవిష్కరణలకు పెద్ద పీట వేస్తారు. అదేపని చేసింది తెలంగాణ నాయకత్వం.

ఒక ఐడియా జీవితాన్ని మార్చాలి అంటే ఆ ఐడియా ముందు ఆచరణరూపం లోకి రావాలి. ఆ ఆచరణకు అండగా నిలిచే ఒక వాతావరణం ఉంటేనే ఇన్నోవేషన్ సాధ్యం అవుతుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఏర్పడ్డ మొదటి రోజుల్లోనే గ్రహించిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మదిలో పుట్టిన ఆలోచనే టీ హబ్.

ప్రత్యేకంగా ఇన్నోవేషన్ పాలసీని రూపొందించిన అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అంకుర సంస్థలకు ఊతమిచ్చేలా, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, ఆవిష్కరణలకు అత్యుత్తమ వేదికగా హైదరాబాద్ లో నవంబర్ 2015 లో టీ – హబ్ ను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.

ఒక స్టార్టప్ ఇంక్యుబేటర్ గా మొదలైన టీ హబ్ కొద్ది కాలం లోనే దేశం లోనే అతి పెద్ద స్టార్టప్ ఇంజన్ గా మారింది. హైదరాబాద్ ను భారత దేశపు స్టార్టప్ రాజధానిగా నిలిపింది. టీ హబ్ లో చేరేందుకు దేశ, విదేశీ స్టార్టప్ ల పోటీ పడ్డాయి.

వేలాది స్టార్టప్ లకు ప్రోత్సాహం ఇచ్చిన టీ హబ్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఆవిష్కరణలకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు వచ్చింది. టీ హబ్ సూపర్ సక్సెస్ అయ్యింది.

టీ హబ్ విజయం ఇచ్చిన స్పూర్తితో.. రెట్టించిన ఉత్సాహంతో టీ హబ్ 2.0 ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. టీ హబ్‌ 2.0ను రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత విశాలమైన ప్రాంగణంలో, అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించింది. టీ హబ్ 2.0 లో ఒకే సమయంలో దాదాపు 2000 వేల స్టార్టప్ లు కార్యకలాపాలు నిర్వహించుకునే వీలు ఉండటం అన్నది ఈ ప్రాంగణం ఎంత పెద్దదో, ఎన్ని వసతులు ఉన్నాయో తెలియచేస్తుంది.

ప్రపంచం లోనే అతి పెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అయిన టీ హబ్ 2.0 ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 28 న ప్రారంభిస్తారు.

ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసినప్పుడు అభినందనల వెల్లువ మొదలయ్యింది. ప్రముఖ సినిమా నటులు, క్రీడాకారులు, అనేక మంది లబ్ద ప్రతిష్టులు తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను అభినందిస్తూ సందేశాలు పెట్టారు.

తెలంగాణ సాధించిన విజయానికి అందుకున్న అభినందనల తాలూకు ఆనందాన్ని రెట్టింపు చేసిన సందేశం కొంచెం లేట్ గా అయినా లేటెస్ట్ గా వచ్చింది.

ఆ సందేశం పంపించింది రతన్ టాటా!
“భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు గొప్ప ఊతమిచ్చే విధంగా హైదరాబాద్‌లో సరికొత్త టీ-హబ్ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు అభినందనలు.”

చూడ్డానికి, చదవడానికి సింపుల్ గా కనిపిస్తున్న ఈ సందేశం అపురూపం. ఇన్నోవేషన్ గురించి, ఎంట్రప్రెన్యుయర్షిప్ గురించి రతన్ టాటా కు తెలిసినంతగా ఈ భారత దేశంలో ఇంకెవరికీ తెలియదు కాబట్టే ఆయన నుంచి వచ్చిన ఈ మెసేజ్ కొన్ని లక్షల అభినందనల పెట్టు.

సంప్రదాయ ఇనుము & ఉక్కు పరిశ్రమ తో మొదలు పెట్టిన టాటాల వ్యాపారం నేడు ఎన్నో రంగాలకు విస్తరించడం, ఎన్నో స్టార్టప్ లకు టాటాలు అండగా నిలవడం వెనుక‌ ఎంతో ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యుయర్షిప్ స్పిరిట్ దాగి వుంది.

ఆ విషయం తెలుసు కాబట్టే, మంత్రి కేటీఆర్ పట్టు పట్టి 2015 నవంబర్ లో టీ హబ్ ప్రారంభోత్సవం రతన్ టాటా చేతుల మీదుగా జరిపించారు. ఆ నాటి తన ప్రసంగంలో రతన్ టాటా గారు ‘ టీ హబ్ తో ఒక కొత్త చరిత్ర మొదలయ్యింది.. నవభారతానికి తెలంగాణ నాంది పలికింది” అన్నారు.

ఆయన ఆ రోజు అన్నట్టుగానే తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలించింది. ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ ఒక నవ శకానికి నాంది పలికింది. ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. దేశానికే ఆదర్శంగా నిలిచింది.

ఇప్పుడు టీ హబ్. 2.0 తో సరికొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతున్న తెలంగాణకు అందరి అభినందనలే ఎనలేని ఆశీస్సులు.

Next Story