Telugu Global
International

అమెరికాలో దారుణం.. ట్రక్కులో 46 మృతదేహాలు

తమ దేశాల్లో బతుకు లేక పేద దేశాల్లోని ప్రజలు ధనిక దేశాలకు వలస వెళ్ళడం మామూలై పోయింది. అయితే వలస వెళ్ళే వాళ్ళలో ఎక్కువ మంది అక్రమంగా ఆయా దేశాల్లోకి ప్రవేశించే ప్రయత్నాల్లో మరణించడం ఈ మధ్య పెరిగిపోయింది. సముద్రాల్లో బోట్లు మునిగి… మంచు గడ్డల్లో చలి భరించలేక… ఇలా వందల మంది ప్రతి ఏడూ మరణిస్తూనే ఉన్నారు. అలాంటి హృదయ విదారక ఘటనే ఒకటి అమెరికాలో జరిగింది. అమెరికా,టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియాలో దారుణం జరిగింది. ఒకే […]

అమెరికాలో దారుణం.. ట్రక్కులో 46 మృతదేహాలు
X

తమ దేశాల్లో బతుకు లేక పేద దేశాల్లోని ప్రజలు ధనిక దేశాలకు వలస వెళ్ళడం మామూలై పోయింది. అయితే వలస వెళ్ళే వాళ్ళలో ఎక్కువ మంది అక్రమంగా ఆయా దేశాల్లోకి ప్రవేశించే ప్రయత్నాల్లో మరణించడం ఈ మధ్య పెరిగిపోయింది. సముద్రాల్లో బోట్లు మునిగి… మంచు గడ్డల్లో చలి భరించలేక… ఇలా వందల మంది ప్రతి ఏడూ మరణిస్తూనే ఉన్నారు. అలాంటి హృదయ విదారక ఘటనే ఒకటి అమెరికాలో జరిగింది.

అమెరికా,టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియాలో దారుణం జరిగింది. ఒకే ట్రక్కులో 46 మృతదేహాలు వెలుగు చూడటం కలకలం రేపింది. అమెరికా-మెక్సికో సరిహద్దులో ఈ 46 మృతదేహాలను ఒక ట్రక్కులో గుర్తించినట్లు టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియా పోలీసుల అధికారులు తెలిపారు. చనిపోయిన వారందరూ వలసదారులే అని, ఇది మానవ అక్రమ రవాణాకు సంబంధించిందని అమెరికా అధికారులు చెప్తున్నారు. మానవ అక్రమ రవాణా చరిత్రలోనే అత్యంత దారుణమైన సంఘటనగా అమెరికా అభివర్ణించింది.

శాన్ ఆంటోనియా నగర శివారులో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ ట్రక్కు ట్రైలర్‌ను తనిఖీ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శాన్ ఆంటోనియో ఫైర్ డిపార్ట్‌మెంట్ ఆ ట్రక్కు నుంచి 16 మందిని రక్షించారు. వీరిలో నలుగురు మైనర్లు ఉన్నారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూసిఉన్న ట్రైలర్‌లో ఊరిరాడక, హార్ట్ స్ట్రోక్ కారణంగా చనిపోయినట్లు వైద్యులు చెప్తున్నారు.

గత కొన్ని నెలలుగా మెక్సికో వైపు నుంచి అమెరికాలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. దీంతో జో బైడెన్ వలస విధానాలపై అమెరికాలో విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా, చనిపోయిన వ్యక్తులు ఏ దేశానికి చెందిన వారనే విషయం పూర్తిగా తెలియలేదు. ప్రాథమికంగా వారు మెక్సికన్లే అయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. టెక్సాస్‌లో జరిగినది తీరని విషాదమని మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో ఎబ్రార్డ్ ట్వీట్ చేశారు. సంఘటన జరిగిన ప్రాంతానికి మెక్సికో రాయబార కార్యాలయ అధికారులు వెళ్తున్నట్లు తెలిపారు.

అమెరికా దక్షిణ ప్రాంతంలో ఉన్న శాన్ ఆంటోనియో నగరం మెక్సికో సరిహద్దు నుంచి 250 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతున్నది. దీంతో తీవ్రమైన ఉక్కపోత కారణంగా, ఊపిరి ఆడక వలసదారులు చనిపోయి ఉంటారని అధికారులు చెప్తున్నారు. 2017లో కూడా శాన్ ఆంటోనియో ప్రాంతంలో ట్రాక్టర్ ట్రైలర్‌లో ప్రయాణిస్తున్న 10 మంది మృతి చెందారు. వాల్ మార్ట్ పార్కింగ్‌లో ఈ దుర్ఘటన వెలుగు చూడటంతో ట్రక్ డ్రైవర్ జేమ్స్ మాథ్యూ బ్రాడ్లీ జూనియర్‌కు జీవిత ఖైదు విధించారు. కాగా, తాజా ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు.

Next Story