Telugu Global
National

నిజాంకు చెందిన 12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడ? మళ్లీ అన్వేషణ ప్రారంభించిన సీబీఐ

ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ కాయిన్ అది. దాదాపు 12 కేజీల బరువు ఉండే ఆ కాయిన్ చివరిగా నిజాం నవాబుల దగ్గర ఉండేది. 35 ఏళ్ల క్రితం కనపడకుండా పోయిన ఆ భారీ గోల్డ్ కాయిన్ కోసం సీబీఐ మళ్లీ అన్వేషణ ప్రారంభించింది. అయితే దీని వెనక స్టోరీ చాలా ఆసక్తికరం.. అదేంటంటే.. మొఘల్ చక్రవర్తి జహంగీర్ 17వ శతాబ్దంలో రెండు భారీ గోల్డ్ కాయిన్స్ చేయించారు. అందులో ఒక కాయిన్ ఇరాన్ రాజు అంబాసిడర్ […]

నిజాంకు చెందిన 12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడ? మళ్లీ అన్వేషణ ప్రారంభించిన సీబీఐ
X

ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ కాయిన్ అది. దాదాపు 12 కేజీల బరువు ఉండే ఆ కాయిన్ చివరిగా నిజాం నవాబుల దగ్గర ఉండేది. 35 ఏళ్ల క్రితం కనపడకుండా పోయిన ఆ భారీ గోల్డ్ కాయిన్ కోసం సీబీఐ మళ్లీ అన్వేషణ ప్రారంభించింది. అయితే దీని వెనక స్టోరీ చాలా ఆసక్తికరం.. అదేంటంటే..

మొఘల్ చక్రవర్తి జహంగీర్ 17వ శతాబ్దంలో రెండు భారీ గోల్డ్ కాయిన్స్ చేయించారు. అందులో ఒక కాయిన్ ఇరాన్ రాజు అంబాసిడర్ యాద్గర్ అలీకి ఇవ్వగా.. ఇంకొకటి నిజాం నవాబులకు ఇచ్చాడు. ఈ కాయిన్ బరువు 11,935.8 గ్రాములు ఉండేది.

ఈ 12 కేజీల బరువైన బంగారు నాణేన్ని చివరి నిజాం నవాబ్ మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన మనుమడైన ముఖర్రం ఝాకు ఇచ్చాడు. నిజాం సుల్తానుల ప్రస్తుత వారసుడైన ముఖర్రంకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. నిజాం రాజ్యం ఇండియాలో విలీనం అయిన తర్వాత కరేబియన్ దీవుల్లో గొర్రెల పెంపక వ్యాపారం చేపట్టాడు. కరేబియన్ దీవుల్లో ఆయనకు క్రిస్టలర్ సర్వీసెస్, టామరిండ్ కార్పొరేషన్ పేరుతో గొర్రెల పెంపక వ్యాపారం ఉంది.

ఈ రెండు కంపెనీల డబ్బు అవసరాల కోసం ముఖర్రం 1987లో స్విస్ బ్యాంకులో 12 కేజీల గోల్డ్ కాయిన్‌ను వేలం వేయడానికి ప్రయత్నించాడు. 1987 నవంబర్ 9న పారీస్‌ కేంద్రంగా నడిచే ఇండోస్విస్ బ్యాంక్, జెనీవా బ్రాంచ్‌లో అప్పట్లోనే 9 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈ 12 కేజీల గోల్డ్ కాయిన్‌తో పాటు మరో బంగారు నాణేన్ని కూడా బ్యాంకుకు ఇచ్చాడు. ఈ క్రమంలో బ్యాంకు ఈ రెండు కాయిన్స్‌ను వేలం వేయడానికి సమయాన్ని నిర్ణయించింది. కాగా, విలువ కట్టలేని ఈ కాయిన్ జాతీయ సంపద కావడంతో ఉప్పందుకున్న అప్పటి సీబీఐ అప్పటికప్పుడు పారీస్ వెళ్లి కాయిన్‌ను స్వాధీనం చేసుకోవాలనుకుంది. కానీ వారికి అక్కడ ఆ కాయిన్ దొరకలేదు.

మౌలానా ఆజాద్ హిందూ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ హిస్టోరియన్ ప్రొఫెసర్ సల్మా అహ్మద్ ఈ భారీ కాయిన్ గురించి అనేక పరిశోధనలు చేశారు. దాని చరిత్ర, వారసత్వంపై లోతుగా పరిశోధన చేశారు. జెనీవాలోని హోటల్ మొగలో ఆక్షనీర్ హబ్స్‌బరో ఫెల్డ్‌మాన్ ఈ గోల్డ్ కాయిన్‌ను బ్యాంకు తరపున వేలం వేయడానికి ప్రయత్నించినట్లు ఆమె కనుగొన్నారు. అయితే సీబీఐ వస్తుందని తెలుసుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు ఆమె చెప్తున్నారు.

కాగా, ఆ తర్వాత సీబీఐ అధికారులే చరిత్రకారుల అవతారం ఎత్తారు. విలువ కట్టలేని ఆ అరుదైన నాణెం కోసం అన్వేషణ మొదలు పెట్టారు. అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ శాంతను సేస్ తాను రాసిన పుస్తకంలో చక్రవర్తి జహంగీర్ తయారు చేసిన రెండు భారీ బంగారు నాణేల గురించి ప్రస్తావించారు. అది ఎలా నిజాం నవాబుల వద్దకు చేరి.. ఆ తర్వాత కాలంలో మాయమైపోయిందో రాసుకొచ్చారు.

సీబీఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలోని సూపరింటెండెంట్ ర్యాంకు అధికారి 1987లోనే నాణాన్ని వేలం వేయడానికి ప్రయత్నించిన ఘటనపై యాంటీక్ అండ్ ఆర్ట్ ట్రెజరర్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. స్విస్ బ్యాంకు వేలానికి ముఖర్రం స్వయంగా ఆ కాయిన్స్ ఇచ్చినట్లు కనుగొన్నారు.

అప్పట్లోనే ఆ కాయిన్ విలువ 16 మిలియన్ డాలర్లుగా తేల్చారు. వేలాన్ని ఆపగలిగారు కానీ, కాయిన్‌ని మాత్రం కనుగొనలేకపోయారు. అప్పట్లో సీబీఐలో పని చేసిన అధికారులందరూ రిటైర్ అయిపోయారు.

కాగా, 35 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మళ్లీ ఆ కాయిన్ గుర్తొచ్చింది. అది ఎక్కడ ఉందో కనుగొనాలని సీబీఐని పురమాయించింది. ఇప్పుడు సీబీఐ మళ్లీ ఆ కాయిన్‌ను అన్వేషించే పనిలో పడింది.

First Published:  27 Jun 2022 11:00 AM GMT
Next Story