Telugu Global
NEWS

వచ్చే ఎన్నికల్లో పవన్ క‌ల్యాణ్ వ్యూహం ఏమిటి?

షెడ్యూల్ ప్ర‌కారం 2024లో జ‌ర‌గ‌నున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం రాజ‌కీయ ప‌క్షాలు ఇప్ప‌ట్నుంచే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి. అధికార వైసీపీ మొత్తం 175 సీట్ల‌ను సాధించాలంటూ ప‌ట్టుద‌ల‌గా ఉంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు ఈ విష‌యాన్ని ఎమ్మెల్యేల‌కు గుర్తుచేస్తూ ప‌నితీరు స‌రిగా లేని వారిని గ్రాఫ్ పెంచుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇక మ‌హానాడు ఇచ్చిన ఊపుతో ఉన్న తెలుగుదేశం పార్టీ వ‌చ్చేఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని గ‌ట్టిగా కృషి చేస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే జిల్లాల్లో […]

వచ్చే ఎన్నికల్లో పవన్ క‌ల్యాణ్ వ్యూహం ఏమిటి?
X

షెడ్యూల్ ప్ర‌కారం 2024లో జ‌ర‌గ‌నున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం రాజ‌కీయ ప‌క్షాలు ఇప్ప‌ట్నుంచే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి. అధికార వైసీపీ మొత్తం 175 సీట్ల‌ను సాధించాలంటూ ప‌ట్టుద‌ల‌గా ఉంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు ఈ విష‌యాన్ని ఎమ్మెల్యేల‌కు గుర్తుచేస్తూ ప‌నితీరు స‌రిగా లేని వారిని గ్రాఫ్ పెంచుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఇక మ‌హానాడు ఇచ్చిన ఊపుతో ఉన్న తెలుగుదేశం పార్టీ వ‌చ్చేఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని గ‌ట్టిగా కృషి చేస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌లు ప్రారంభించారు. అప్ప‌టివ‌ర‌కూ జ‌న‌సేన‌తో పొత్తుకు సిద్ధ‌మంటూ ప్ర‌క‌ట‌న‌లు చేసిన చంద్ర‌బాబు మ‌హానాడు త‌ర్వాత ఆ ఊసును పెద్ద‌గా ప్ర‌స్తావిచండంలేదు.

అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్న అధికార వైసీపీని గ‌ద్దె దించేందుకు తాను ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల‌కుండా చూస్తాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ఇందుకోసం త‌న మిత్ర‌ప‌క్ష‌మైన భార‌తీయ జ‌న‌తా పార్టీని కూడా ఒప్పిస్తాన‌ని ప్ర‌క‌టించారు. టీడీపీ వైఖ‌రి వ‌ల్లో, లేక బీజేపీ వ్య‌తిరేకించ‌డం వ‌ల్లో తెలియ‌దు కానీ రానురాను ప‌వ‌న్ క‌ల్యాణ్ లోమార్పు వ‌చ్చింది. తాము పార్టీ పెట్టిన‌ప్ప‌టినుంచీ ఎన్నో త్యాగాలు చేశామ‌ని.. ఇక వారి వంతు అంటూ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.

సీట్ల స‌ర్దుబాటు వ‌ర‌కూ అయితే ప‌ర్వాలేదు కానీ తాను ముఖ్య‌మంత్రి రేసులో ఉండాల‌నే ఉద్దేశంతోనే ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని వినిపిస్తోంది. మెరుగైన రాష్ట్రం, మెరుగైన ఆర్థిక వ్యవస్థ కోసం వచ్చే ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. లక్షల ఉద్యోగాలు కూడా క‌ల్పిస్తామ‌ని కూడా వాగ్దానం చేశాడు. వీటన్నింటిని బట్టి చూస్తే జనసేన అధినేత పథకంలో అసలు ఏముందో అనే సందేహం కలుగుతోంది.

ఎన్నికల్లో కూటమి గెలిస్తే తాను గెలిచిన సీట్ల ఆధారంగా ఎక్కువ కేబినెట్‌ బెర్త్‌లు పవన్ కల్యాణ్‌ టీడీపీ నుంచి కోరుతున్నారా లేక రొటేషన్‌లో ముఖ్యమంత్రి ప‌ద‌విలో వాటా అడుగుతున్నారా? అనే సందేహాలు కార్య‌క‌ర్త‌ల్లో కూడా వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ కొన్ని సీట్లు, కేబినెట్ బెర్త్‌లు అడుగుతుంటే చంద్రబాబు నాయుడు ఆయన డిమాండ్‌ని పరిశీలించి బేరం కుదుర్చుకున్న తర్వాత ఇవ్వవచ్చు. కానీ, రొటేషన్ ప‌ద్ధ‌తిలో ముఖ్య‌మంత్రి ప‌ద‌విని పంచుకోవ‌డం అంటే చంద్రబాబు నాయుడుతో సాధ్యమ‌య్యేప‌నేనా అతని ఉద్దేశం ఈ రెండు ఆప్షన్‌లలో ఏదైనా అయితే, అతను ఒక్క అవకాశం ఎందుకు అడుగుతున్నాడు, మెరుగైన ప్రభుత్వాన్ని ఇస్తామంటూ ఎందుకు వాగ్దానం చేస్తున్నాడు? అనే సందేహాలతో కార్య‌క‌ర్త‌ల్లో మ‌థ‌నం జ‌రుగుతోంది.

ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్క అవకాశం అడిగిన ఆయన టీడీపీతో సీట్ల పంపకంతో సరిపెట్టుకుంటే ప్రజలు సీరియస్‌గా తీసుకుంటారా? 2014లో బీజేపీ, టీడీపీ నుంచి వామపక్షాలు, 2019లో బీఎస్పీలోకి మారిన ఆయన నాయకత్వంపై ఇప్పటికే ప్రజలు నమ్మకం కోల్పోయారంటున్నారు. ఇన్నాళ్ళుగా రాజ‌కీయాల్లో ఉంటున్నా ప‌వ‌న్ క్లారిటీ లేని మాట‌లు మాట్లాడ‌డం వ‌ల్ల గంద‌ర‌గోళ ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయంటున్నారు. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల‌తో జ‌న‌సేన అధినేత జ‌నంలో ప‌లుచ‌న అవుతున్నార‌ని ఆయ‌న అభిమానులు ఆవేద‌న చెందుతున్నారు.

First Published:  26 Jun 2022 10:09 PM GMT
Next Story