Telugu Global
Health & Life Style

ఇలా కూడా గుండె జబ్బులు రావొచ్చు..

గుండె వ్యాధులు రావడానికి ప్రధానమైన కారణాలు సరైన ఆహారం తీసుకోకపోవటం, వ్యాయామం లేకపోవటం, మానసిక ఒత్తిడి. అయితే ఇవే కాకుండా మనం ఊహించలేని కారణాలు మరికొన్ని గుండె జబ్బులను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అలాంటివాటిలో నోరు, దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా ఒకటి. నోరు శుభ్రంగా లేకపోతే చిగుళ్ల నుంచి రక్తంలోకి చేరిన బ్యాక్టీరియా రక్తనాళాలను అనారోగ్యానికి గురిచేస్తాయి. అలాగే దీనివలన ఇతర గుండె సమస్యలు సైతం రావచ్చు. కనుక దంతాలు చిగుళ్లకు సంబంధించిన సమస్యలుంటే వెంటనే […]

ఇలా కూడా గుండె జబ్బులు రావొచ్చు..
X

గుండె వ్యాధులు రావడానికి ప్రధానమైన కారణాలు సరైన ఆహారం తీసుకోకపోవటం, వ్యాయామం లేకపోవటం, మానసిక ఒత్తిడి. అయితే ఇవే కాకుండా మనం ఊహించలేని కారణాలు మరికొన్ని గుండె జబ్బులను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అలాంటివాటిలో నోరు, దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా ఒకటి.

నోరు శుభ్రంగా లేకపోతే చిగుళ్ల నుంచి రక్తంలోకి చేరిన బ్యాక్టీరియా రక్తనాళాలను అనారోగ్యానికి గురిచేస్తాయి. అలాగే దీనివలన ఇతర గుండె సమస్యలు సైతం రావచ్చు. కనుక దంతాలు చిగుళ్లకు సంబంధించిన సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

రాత్రులు పనిచేసేవారిలో, అలాగే క్రమబద్ధమైన పనివేళలు లేని వారిలో కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని కెనడాలోని వెస్ట్రన్ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. ఒకవేళ అలాంటి పనివేళలు తప్పనిసరి అయితే మంచి ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవటం లాంటి జాగ్రత్తలతో గుండె జబ్బులను నివారించుకోవచ్చు.

ట్రాఫిక్ లో ఎక్కువ సమయం ఉండాల్సిరావటం వలన కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజు ఎక్కువ శబ్దాలతో కూడిన ట్రాఫిక్ లో ఉండటం వలన హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఒకవేళ తప్పనిసరై ట్రాఫిక్ లో తిరగాల్సి వస్తే రిలాక్స్ నిచ్చే సంగీతం వినటం, ఇరువురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణించడం లాంటివి చేయటం వలన ఒత్తిడి తగ్గుతుంది.

ఇంకా.. మహిళలు 46 ఏళ్లకంటే ముందుగానే మెనోపాజ్ కి చేరటం, నిద్రలో బాగా గురకపెట్టటం, లివర్ ఇన్ ఫెక్షన్ కి గురై ఉండటం, సరైన నిద్రలేకపోవటం, వైవాహిక జీవితంలో సమస్యలు, ఏకాంతంగా ఉండాల్సిరావటం, పొట్టలో పేరుకుపోయిన కొవ్వు.. ఇవన్నీ గుండెవ్యాధులను తెచ్చిపెట్టే అంశాలే.

గుండె వ్యాధులకు ఇవన్నీ కూడా కారణమవుతాయంటే ఆశ్చర్యంగానే అనిపిస్తుంది కదా. ఒంటరితనం వలన కలిగే ఒత్తిడితో చాలామంది గుండెజబ్బులకు గురవుతుంటారు. అలాగే పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు చాలా ప్రమాదకరమైనది. దీనివలన శరీరంలో రక్తపోటుని పెంచే హార్మోన్లు, రసాయనాలు తయారవుతాయి. ఇవి రక్తనాళాలకు కూడా హాని చేస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. మహిళల నడుముకొలత 35 అంగుళాలకు, మగవారి నడుము చుట్టుకొలత 40 అంగుళాలకు మించి ఉండకూడదు. రోజుకి ఆరుగంటల కంటే తక్కువ నిద్రపోయేవారిలో కొలెస్ట్రాల్, రక్తపోటు పెరిగే అవకాశం ఉంది.

అయితే మరీ ఎక్కువ సమయం కూడా నిద్రపోకూడదు. రోజుకి తొమ్మిది గంటలకంటే ఎక్కువ సమయం నిద్రపోయేవారు మధుమేహం, స్ట్రోక్ కి గురికావచ్చు. ఇవి కూడా గుండెజబ్బులకు దారితీసే ప్రమాదం ఉంది. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తే చాలదు. పైన చెప్పుకున్న అంశాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

First Published:  27 Jun 2022 11:00 AM GMT
Next Story