Telugu Global
National

రాజకీయ పార్టీలను రద్దు చేసే అధికారం ఇవ్వండి: కేంద్ర ఎన్నికల కమిషన్

దేశంలో ఎన్నికల సమయంలో ఇష్టారీతిన రాజకీయ పార్టీలు పెట్టి, ఆ తర్వాత చాలా మంది పత్తాలేకుండా పోతున్నారు. ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకొని.. ఆ తర్వాత జాడే లేకుండా పోయిన పార్టీలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) న్యాయ శాఖను కోరింది. ప్రస్తుతం రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయాలంటే ముందుగా న్యాయ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. […]

రాజకీయ పార్టీలను రద్దు చేసే అధికారం ఇవ్వండి: కేంద్ర ఎన్నికల కమిషన్
X

దేశంలో ఎన్నికల సమయంలో ఇష్టారీతిన రాజకీయ పార్టీలు పెట్టి, ఆ తర్వాత చాలా మంది పత్తాలేకుండా పోతున్నారు. ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకొని.. ఆ తర్వాత జాడే లేకుండా పోయిన పార్టీలు కోకొల్లలుగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) న్యాయ శాఖను కోరింది. ప్రస్తుతం రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయాలంటే ముందుగా న్యాయ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు రద్దు చేసే అధికారం నేరుగా తమకే ఇవ్వాలని పట్టుబడుతోంది.

రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేసే అధికారం తమకు ఇస్తే అక్రమాలకు పాల్పడే పార్టీలను నిరోధించే అవకాశం కూడా ఉంటుందని ఈసీఐ చెప్తోంది. చాలా మంది ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందేందుకు రాజకీయ పార్టీలను రిజిస్టర్ చేసుకుంటున్నారని, వాళ్లు అసలు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఈసీఐ వెల్లడించింది. దీని వల్ల దేశంలో క్రియాశీలకంగా లేని పార్టీల సంఖ్య భారీగా పెరిగిపోయిందని చెప్పింది.

ఇకపై ఇలాంటి పార్టీలను రద్దు చేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాలని, ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని న్యాయ శాఖను కోరుతూ లేఖ రాసింది. ఇటీవల న్యాయ శాఖ అనుమతి మేరకు ఈసీఐ 198 గుర్తింపు లేని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇక, ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు,. 50కి పైగా ప్రాంతీయ పార్టీలు ఉన్నట్లు ఈసీఐ చెప్పింది. వీటితో పాటు 2800 పార్టీలు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకున్నాయి.

ఏ పార్టీ అయినా ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకుంటే తప్పని సరిగా పోస్టల్ అడ్రస్ ఇవ్వాలి. అందులో మార్పులు ఉన్నా.. ఎప్పటికప్పుడు తెలియజేయాలి. అయితే ఇటీవల అన్ని పార్టీలకు లేఖలు పంపుతున్న క్రమంలో కొన్ని పార్టీల కార్యాలయాలకు అవి చేయడం లేదని గుర్తించింది. రాజకీయ పార్టీలకు లేఖలు ఎందుకు వెళ్లడం లేదనే విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో విచారణ జరపగా అనేక విషయాలు వెల్లడయ్యాయి.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్, పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన వివరాల మేరకు అసలు ఆ పార్టీలు ఇచ్చిన చిరునామాలో లేవు. అంతే కాకుండా అవి అసలు మనుగడలో కూడా లేనట్లు తెలిసింది. దీంతో సదరు పార్టీలను రద్దు చేస్తున్నట్లు ఈసీఐ ప్రకటించింది.

First Published:  26 Jun 2022 9:50 PM GMT
Next Story