Telugu Global
National

పౌర స‌మాజం క‌ళ్లు తెరిపించిన తీర్పు..

గుజరాత్ అల్లర్ల కేసు, ముగిసిన ‘అపరాధ’పరిశోధన, సిట్ నివేదిక, మోడీకి క్లీన్ చిట్, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు పౌర సమాజం కళ్ళు తెరిపించాయి. ముఖ్యంగా హక్కుల కార్యకర్తలు, సమాజంలోని పెడ ధోరణులు, రాజకీయ అవినీతి, దోపిడీ, దుర్మార్గాలపై తరచూ ఆందోళన చెందే ‘బుద్ధిజీవులు’ ఇక ఎలా మసులుకోవాలో, ఎలా మసులుకోకూడదో తేట తెల్లమయ్యింది. అమిత్ షా పరిభాషలో ‘గరళ కంఠుడు’ అయిన మోడీ అగ్ని పునీతుడయ్యారు. ఆయన నిర్దోషి అని తేలిపోయింది. ‘గొంతులో విషం పెట్టుకొని 19 సంవత్సరాలుగా […]

పౌర స‌మాజం క‌ళ్లు తెరిపించిన తీర్పు..
X

గుజరాత్ అల్లర్ల కేసు, ముగిసిన ‘అపరాధ’పరిశోధన, సిట్ నివేదిక, మోడీకి క్లీన్ చిట్, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు పౌర సమాజం కళ్ళు తెరిపించాయి. ముఖ్యంగా హక్కుల కార్యకర్తలు, సమాజంలోని పెడ ధోరణులు, రాజకీయ అవినీతి, దోపిడీ, దుర్మార్గాలపై తరచూ ఆందోళన చెందే ‘బుద్ధిజీవులు’ ఇక ఎలా మసులుకోవాలో, ఎలా మసులుకోకూడదో తేట తెల్లమయ్యింది.

అమిత్ షా పరిభాషలో ‘గరళ కంఠుడు’ అయిన మోడీ అగ్ని పునీతుడయ్యారు. ఆయన నిర్దోషి అని తేలిపోయింది. ‘గొంతులో విషం పెట్టుకొని 19 సంవత్సరాలుగా మోడీ అనుభవించిన వేదనను నేను అతి దగ్గర నుంచి చూశా. ఈ తప్పుడు కేసు గురించి ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది’ అని అమిత్ షా తన వ్యాఖ్యలకు ‘ఎమోషనల్’ టచ్ ఇచ్చారు.

రెండు దశాబ్దాల క్రితం చంద్రబాబు హైదరాబాద్ వేదికగా మోడీకి వ్యతిరేకంగా చేసిన గర్జనను ఇక వాపసు తీసుకోవలసి ఉంది. అప్పుడాయన వాజ్ పేయి ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతు ఇస్తున్నారు. గుజరాత్ లో అల్లర్లకు కారకుడయిన నరేంద్ర మోడీ గద్దె దిగాలని తాను చేసిన డిమాండ్ అనాలోచితంగా చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించక తప్పదేమో! మోడీ హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేసి తీరుతామని చేసిన ప్రకటనలపై పశ్చాత్తాపాన్ని ప్రకటించవలసి ఉంటుంది!

అల్లర్లతో అట్టుడుకుతున్న గుజరాత్ గురించి, నాటి ముఖ్యమంత్రి మోడీ గురించి ప్రధానమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలపై చింతించేదుకు, పునఃస‌మీక్షించుకునేందుకు వాజ్ పేయికి అవకాశం లేదు. ఆయన సజీవంగా లేరు. గుజరాత్ లో శాంతి స్థాపనకు గాను వాజ్ పేయి జరిపిన అఖిలపక్ష సమావేశంలో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, సోనియా గాంధి, ములాయం సింగ్ యాదవ్, మాజీ ప్రధానులు గుజ్రాల్, దేవెగౌడ, వి.పి.సింగ్ తదితరులు పాల్గొన్నారు.

దివంగతులైన గుజ్రాల్, విపి.సింగ్ నుంచి ‘పశ్చాత్తాప’ ప్రకటన సాధ్యం కాదు. ములాయం సింగ్, సోనియాగాంధీ వంటి వారు తమ చర్యలపై ‘మనస్తాపానికి’ గురవుతున్నారా? తమ పార్టీ ముఖ్యమంత్రి అయినా ‘మోడీ వైఫల్యాన్ని తప్పుబట్టిన’ వాజ్ పేయిని లౌకికవాదులు ఆకాశానికి ఎత్తారు. కానీ తాజా పరిణామాలతో సదరు లౌకికవాదులంతా తమ చేష్టలకు తామే సిగ్గుపడుతున్నారేమో! మరి మన ‘నేర పరిశోధన’ సంస్థలు, గౌరవనీయ సుప్రీంకోర్టు అంతటి శక్తివంతమైన నివేదికలు, సమర్థ‌నలు జరిగాక 2002 లో మోడీని తప్పుబట్టిన వారంతా పునరాలోచించవలసి ఉంది. తమ వ్యాఖ్యలను, విమర్శలను వెనక్కి తీసుకోవలసి ఉంది.

”ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు ఉన్నతాధికారులు ఇతరులతో కుమ్మకై కేసును సంచలనం చేయడానికి ప్రయత్నించారు. వారంతా అల్లర్ల విషయంలో సిట్ కు తప్పుడు సమాచారం ఇచ్చారు. కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన అధికారులను జైలులో పెట్టాలి. అలాగే సొంత ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకున్న తీస్తా సెతల్వాడ్ పై దర్యాప్తు చేయండి” అని గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి సిట్ ఇచ్చిన క్లీన్ చిట్ ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

గుజరాత్ అల్లర్ల కేసులో తీస్తా సెతల్వాడ్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘సిట్’ కు తప్పుడు సమాచారాన్ని ఇచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ANI సంస్థ‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్ది గంటల్లోనే తీస్తా సెతల్వాడ్ ను, నాటి గుజరాత్ డీజీపీ శ్రీకుమార్ ను అరెస్టు చేయడం యాదృచ్ఛికం కాదని ఒక అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. గుజరాత్ ‘యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్’ రంగంలోకి దిగడాన్ని బట్టి సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ ‘టెర్రరిస్టు చర్యల’కు పాల్పడినట్టు ప్రజలకు అర్థం చేసుకోవాలి.

2002 లో గుజరాత్ అల్లర్లు జరిగిన నాటి నుంచి సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ పేరు బయటి ప్రపంచానికి ఎక్కువగా తెలిసింది. ఆమె పలు కేసులు, బెదిరింపులు, నిర్బంధాలు ఎదుర్కున్నారు. ఆమె నిర్వహిస్తున్న NGO కార్యకలాపాలపైన నిఘా, దర్యాప్తు సంస్థల దాడులూ చాలా జరిగాయి. ఇప్పుడు ‘సిట్’ నివేదికతో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ ‘కడిగిన ముత్యం’ వలె బయటపడినందున ఆయనకు వ్య‌తిరేకంగా మాట్లాడిన, వివరాలు వెల్లడించిన, సాక్ష్యాలు ప్రదర్శించిన, ప్రచారం చేసిన, ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించిన వారందరూ ఊచలు లెక్కపెట్టక తప్పదేమో!

గోద్రా అల్లర్లకు ఎవరు బాధ్యులు? అనే ప్రశ్నకు ఉనికి లేదు. గోధ్రా అల్లర్లు జరిగాయా లేక కల్పితమా ?అన్న చర్చ జరుగుతుంది. ఇది వ్యంగ్యంతో కూడుకున్నదే అయి ఉండవచ్చు, జరుగుతున్న పరిణామాలేమిటి? ఎటు వైపు న్యాయం నడుస్తోంది? ‘గజం మిథ్య – పలాయనం మిథ్య’ అనే నానుడితో ఈ కేసులో ‘సిట్’ నివేదికను పోల్చవచ్చునా! పైగా భారత సర్వోన్నత న్యాయస్థానం తీస్తా సెతల్వాడ్ సహా ఈ కేసులో నాటి ముఖ్యమంత్రి మోడీపై ‘ఆరోపణలు’ గుప్పించిన వారందరిపైనా చేసిన వ్యాఖ్యలు ‘కటువుగా’ ఉన్నవి.

సిట్ ‘ఎలాంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా, నిస్పాక్షికంగా దర్యాప్తు ‘జరిపిన నివేదికను ఎవరూ తప్పుబట్టడానికీ, ప్రశ్నించడానికీ వీలు లేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను వక్రీకరించడమో, మరేదైనా దోషం అంటగట్టడమో కుదరని పని. అలా ఎవరు చేసినా వారు ‘దేశ ద్రోహులు’గా తమను తాము రుజువు చేసున్నట్టే కాగలదు!!

First Published:  27 Jun 2022 9:33 AM GMT
Next Story