Telugu Global
NEWS

జీహెచ్ఎంసీ ఫ్లైఓవర్ కడతానంటే.. ఆర్మీ పెట్టిన ఆంక్షలు చూస్తే విస్తుపోవాల్సిందే..!

హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో రోజురోజుకూ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌కు తోడు మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చినా.. స్వంత వాహనాలు ఉపయోగించే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా జంట నగరాల్లోని కీలకమైన ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం-జీహెచ్ఎంసీతో కలిసి కేంద్ర ప్రభుత్వం అందించే కొంత సాయంతో ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. కాగా, సికింద్రాబాద్ ప్రాంతంలోని కంటోన్మెంట్ వల్ల అక్కడ ఫ్లైఓవర్లు, ఇతర నిర్మాణాలు చేపట్టడం కష్టంగా మారింది. సికింద్రాబాద్ […]

జీహెచ్ఎంసీ ఫ్లైఓవర్ కడతానంటే.. ఆర్మీ పెట్టిన ఆంక్షలు చూస్తే విస్తుపోవాల్సిందే..!
X

హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో రోజురోజుకూ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌కు తోడు మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చినా.. స్వంత వాహనాలు ఉపయోగించే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.

దీంతో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా జంట నగరాల్లోని కీలకమైన ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం-జీహెచ్ఎంసీతో కలిసి కేంద్ర ప్రభుత్వం అందించే కొంత సాయంతో ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది.

కాగా, సికింద్రాబాద్ ప్రాంతంలోని కంటోన్మెంట్ వల్ల అక్కడ ఫ్లైఓవర్లు, ఇతర నిర్మాణాలు చేపట్టడం కష్టంగా మారింది. సికింద్రాబాద్ మధ్యలో ఉన్న కంటోన్మెంట్ ఆవల కూడా నగరం బాగా విస్తరించింది. ముఖ్యంగా ఈసీఐఎల్, నాగారం, సైనిక్ పురి ప్రాంతాల నుంచి రోజూ నగరంలోకి ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువ.

దీంతో ఇక్కడ రోడ్లు వెడల్పు చేయడం కూడా కష్టమవుతోంది. ముఖ్యంగా ఏవోసీ (AOC) సర్కిల్ చుట్టుపక్కల ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ ప్రయత్నించినా.. అది ఆర్మీకి చెందిన ల్యాండ్ కావడంతో కుదరలేదు. ఐదేళ్ల కిందటే డిఫెన్స్ మినిస్ట్రీకి అక్కడ ఫ్లైఓవర్ నిర్మిస్తామని జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు పంపింది. కాగా, తాజాగా రెండు షరతులతో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఫ్లైఓవర్ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.

నాలుగు లేన్ల ఫైఓవర్ నిర్మాణానికి రక్షణ శాఖ పెట్టిన రెండు షరతులు చూసి జీహెచ్ఎంసీ అధికారులు ఆశ్చర్యపోయారు. ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల డిఫెన్స్ మినిస్ట్రీకి చెందిన 42 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉంది. కోల్పోతున్న ల్యాండ్‌లో 35 ఎకరాలకు సమాన విలువైన స్థలం నగరంలోనే మరో చోట ఇవ్వాలని, అదే విధంగా మిగిలిన 7 ఎకరాలకు గాను ప్రతీ ఏటా రూ. 1.5 కోట్ల రెంట్ చెల్లించాలని రక్షణ శాఖ షరతులు పెట్టింది. వీటికి అంగీకరిస్తేనే ఫ్లై ఓవర్ కట్టుకోవచ్చని స్పష్టం చేసింది.

కాగా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చిన ఈ లేఖను జీహెచ్ఎంసీ అధికారులు తెలంగాణ మున్సిపల్ శాఖకు పంపించారు. కానీ, ఇందుకు సర్కారు ఆమోదం తెలుపుతుందా లేదా అనేది అనుమానంగా ఉందని అధికారులు అంటున్నారు. వెల్లింగ్టన్ రోడ్ నుంచి అలహాబాద్ గేట్, సఫిల్‌గూడ రైల్వే స్టేషన్‌ను కవర్ చేస్తూ ఆర్కే పురం వరకు ఈ ఫ్లై ఓవర్ నిర్మించాల్సి ఉంది.

దాదాపు 10 కిలోమీటర్ల ఎలివేటెడ్ రోడ్ వే కోసం భారీగా ఖర్చు చేయాలి. కాగా, ఐదేళ్ల నుంచి లేఖలు రాస్తుంటే.. రక్షణ శాఖ ఎట్టకేలకు స్పందించిందని, కానీ ఆ షరతులు చూసి షాక్ తిన్నామని జీహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు.

కంటోన్మెంట్‌కు సమీపంలో ఎకరా దాదాపు రూ. 10 కోట్లు పలుకుతుంది. 35 ఎకరాలంటే దాదాపు రూ. 350 నుంచి 400 కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దీనికి రూ. 1.5 కోట్ల అద్దె అదనం. ఇంత ఖర్చు చేసి జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్ కట్టడం అనుమానమే అని సీనియర్ ఎకనామిస్ట్ అన్నారు.

ఒకవేళ ఫ్లై ఓవర్ కట్టడం ప్రారంభమైతే అది పూర్తి కావడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. దీంతో చుట్టు పక్కల ట్రాఫిక్ సమస్య దారుణంగా మారుతుంది. ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తమ పరిధిలోని రోడ్లను రక్షణ కారణాలతో మూసేసింది. ఫ్లై ఓవర్ నిర్మాణం మరింత జఠిలంగా మారనుందని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు అంటున్నారు.

First Published:  27 Jun 2022 6:09 AM GMT
Next Story