Telugu Global
National

అర్ధరాత్రి ఫడ్నవీస్, హోం మంత్రి అమిత్ షాలతో ఏక్ నాథ్ షిండే భేటీ

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ ని మించి శరవేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెబెల్ శివసేన నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే శనివారం అర్ధరాత్రి గుజరాత్ వడోదరలో బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశమయ్యారు. హోం మంత్రి అమిత్ షా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. వీరి చర్చల సారాంశం తెలియదు గానీ మహారాష్ట్రలో బీజేపీతోడ్పాటుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశాలున్నాయా అన్న విషయమై వీరు చర్చించినట్టు […]

అర్ధరాత్రి ఫడ్నవీస్, హోం మంత్రి అమిత్ షాలతో ఏక్ నాథ్ షిండే భేటీ
X

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ ని మించి శరవేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెబెల్ శివసేన నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే శనివారం అర్ధరాత్రి గుజరాత్ వడోదరలో బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశమయ్యారు. హోం మంత్రి అమిత్ షా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

వీరి చర్చల సారాంశం తెలియదు గానీ మహారాష్ట్రలో బీజేపీతోడ్పాటుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశాలున్నాయా అన్న విషయమై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే బీజేపీ సైతం రంగంలోకి దూకేందుకు పావులు కదుపుతోంది.

ఈ నేపథ్యంలో షిండే వర్గం ఇప్పట్లో ముంబైకి రాకుండా మరో రెండు, మూడు రోజులు గౌహతిలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి మేము రాబోమని వారు తేల్చి చెప్పారట. కాగా .. చీలిన వర్గం అధికారప్రతినిధిగా దీపక్ కేసర్కర్ వ్యవహరిస్తారని షిండే ప్రకటించారు. లెజిస్లేచర్ పార్టీలో తమకు మూడింట రెండువంతుల మెజారిటీ ఉందని, తాము శివసేనను వీడలేదని, తమ గ్రూపును శివసేన (బాలాసాహెబ్) గా పేరు పెట్టుకున్నామని కేసర్కర్ చెప్పారు. అసెంబ్లీలో ఈ గ్రూపు వేరుగా కూర్చోవచ్చునని తెలుస్తోంది.

శివసేన లెజిస్లేచర్ పార్టీ నేతగా షిండేని తొలగించి ఆయన స్థానే మరొకరిని (అజయ్ చౌదరి) డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ నియమించడాన్ని కోర్టులో సవాల్ చేస్తామని కేసర్కర్ తెలిపారు. మహావికాస్ అఘాడీ కబంధ హస్తాల నుంచి బయటపడాలని షిండే..గతరాత్రి పొద్దుపోయాక శివసైనికులనుద్దేశించి ట్వీట్ చేశారు. షిండేతో బాటు 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేయడంతోను, సేన నేత సంజయ్ రౌత్ రెచ్చగొట్టేట్టుగా ప్రకటనలు చేయడంతోను పరిస్థితి మరింత హీటెక్కింది.

గౌహతిలో మీరెన్ని రోజులు దాక్కుంటారో చూస్తామని, మీరు ముంబైకి రావలసిందేనని సంజయ్ రౌత్..షిండేని ఆయన వర్గాన్ని ఉద్దేశించి హెచ్చరించారు. తిరుగుబాటు మంత్రులు 24 గంటల్లోగా తమ పదవులు కోల్పోతారని కూడా వార్నింగ్ ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ నుంచి అనర్హత నోటీసులు అందుకున్నషిండే, ఇతర రెబెల్ ఎమ్మెల్యేలు రేపు సాయంత్రం 5 గంటల్లోగా తమ వివరణను ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో సభ్యత్వానికి వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది.

అయితే తమవర్గంలో సుమారు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, మూడింట రెండువంతుల మంది సభ్యులున్న కారణంగా తమకు ఫిరాయింపుల నిషేధ చట్టం వర్తించదని షిండే వర్గం ధీమాగా ఉంది.

ఇక నిన్న ముంబైలో సేన జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశాన్ని నిర్వహించిన సీఎం ఉద్ధవ్ థాక్రే.. వరుసగా కొన్ని తీర్మానాలను ఆమోదింపజేశారు. ఏ రాజకీయ పార్టీ గానీ లేదా వర్గం గానీ శివసేన పేరును, దివంగత బాలాసాహెబ్ థాక్రే పేరును వినియోగించుకోకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరాలని ఓ తీర్మానంలో ప్రతిపాదించారు.

అటు కొంతమంది రెబెల్ ఎమ్మెల్యేల ఇళ్ళు, నివాసాలపై శివసేన కార్యకర్తలు దాడులు చేయడంతో ముంబై పోలీసులు జులై 10 వరకు 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. 5 గురికి మించి ఎవరూ గుమికూడదని ప్రకటించారు.

Next Story