Telugu Global
National

భారత్ లో పెరుగుతున్న పట్నవాసం..

భారత్ లో పట్టణ వాసం పెరుగుతోంది. దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 31.8 శాతం ఉండగా.. 2035 నాటికి 38.6 శాతానికి చేరుకుంటుందని అంచనా. 2050 నాటికి 50శాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తారని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గ్రామాల్లో విద్యా సౌకర్యాలు మెరుగుపడుతుండటంతో చదువుకున్నవారి సంఖ్య పెరుగుతోంది. వారంతా ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్తున్నారు. చదువుకోని వారు కూడా ఉపాధిని వెదుక్కుంటూ పట్టణాలకు చేరుతున్నారు. దీంతో సహజంగానే […]

భారత్ లో పెరుగుతున్న పట్నవాసం..
X

భారత్ లో పట్టణ వాసం పెరుగుతోంది. దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 31.8 శాతం ఉండగా.. 2035 నాటికి 38.6 శాతానికి చేరుకుంటుందని అంచనా. 2050 నాటికి 50శాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తారని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గ్రామాల్లో విద్యా సౌకర్యాలు మెరుగుపడుతుండటంతో చదువుకున్నవారి సంఖ్య పెరుగుతోంది. వారంతా ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్తున్నారు. చదువుకోని వారు కూడా ఉపాధిని వెదుక్కుంటూ పట్టణాలకు చేరుతున్నారు. దీంతో సహజంగానే పట్టణ జనాభా పెరిగిపోతోంది.

ఢిల్లీలో 2035నాటికి వందశాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తారని జాతీయ జనాభా కమిషన్ టెక్నికల్ గ్రూప్ అంచనా వేస్తోంది. ఢిల్లీ తర్వాత వేగంగా పట్టణ జనాభా పెరుగుతున్న రాష్ట్రాల్లో కేరళ రెండో స్థానంలో ఉంది. కేరళలో 2035నాటికి 92.8 శాతం మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తుంటారు. తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర.. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నా.. ఆ స్థాయిలో ఇక్కడ పట్టణ జనాభా పెరగడంలేదు. ఢిల్లీ, కేరళ మినహా ఆ తర్వాత లిస్ట్ లో ఉన్న రాష్ట్రాల్లో 2035 నాటికి పట్టణ జనాభా ఇంచు మించు 55నుంచి 60 శాతం మధ్యలో ఉంటోంది. ఢిల్లీ, కేరళలో మాత్రం పట్నవాసమే ప్రజలకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనపడుతోంది. ఈ లిస్ట్ లో చివర ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ లో అత్యల్పంగా పట్టణ జనాభా పెరుగుతోంది.

విస్తరిస్తున్న పట్టణాలు..
చదువుకొని, నైపుణ్యం కలిగిన వారు ఉద్యోగాలకోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. సాంకేతిక నైపుణ్యాలు లేని వారు ఏదో ఒక పని చేసుకొంటూ పట్టణాలను ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దీంతో ఆ గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరిగి, అతి తక్కువ కాలంలోనే అవి పట్టణాల్లో కలసిపోతున్నాయి. దీంతో పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన బాధ్యత కూడా స్థానిక సంస్థలకు పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్రాలు అమలు చేసే పట్టణాభివృద్ధి, నివాస పథకాలు, పట్టణ జీవనోపాధి మిషన్‌ వంటి కార్యక్రమాలు కూడా పట్టణీకరణ పెరగడానికి దోహదపడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

పేదరికం తగ్గుతోందా..?
భారతదేశంలో పట్టణీకరణ ముఖ్యమైన ప్రక్రియగా మారిందని, ఇది జాతీయ ఆర్థిక వృద్ధితో పాటు తగ్గుతున్న పేదరికానికి ముఖ్యమైన సూచనగా ఉందని జాతీయ జనాభా కమిషన్ టెక్నికల్ గ్రూప్ అంచనా వేస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాలు విస్తరిస్తాయని తెలిపింది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి అజెండా అయిన సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్‌–2030 కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. 2035 నాటికి భారత్ లో 10 లక్షలకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు 53కు చేరుకుంటాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 37.71 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2035 నాటికి ఆ సంఖ్య 60 కోట్లకు చేరుతుందని అంచనా.

First Published:  25 Jun 2022 10:17 PM GMT
Next Story