Telugu Global
National

శివసేన రెబల్ ఎమ్మెల్యేల కొత్త పార్టీ ?

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే ఆద్వర్యంలో నూతన పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. అస్సాం రాజధాని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న శివసేన రెబెల్ ఎమ్మెలేలు కొద్ది సేపటి క్రితం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నూతన పార్టీ పేరును శివసేన (బాలాసాహెబ్ థాకరే) గా నిర్ణయించారు. ఇకపై తమను ‘శివసేన బాలాసాహెబ్’ గ్రూప్ గా పిలవాలని రెబల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ మీడియాకు […]

శివసేన రెబల్ ఎమ్మెల్యేల కొత్త పార్టీ ?
X

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే ఆద్వర్యంలో నూతన పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. అస్సాం రాజధాని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న శివసేన రెబెల్ ఎమ్మెలేలు కొద్ది సేపటి క్రితం సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో నూతన పార్టీ పేరును శివసేన (బాలాసాహెబ్ థాకరే) గా నిర్ణయించారు. ఇకపై తమను ‘శివసేన బాలాసాహెబ్’ గ్రూప్ గా పిలవాలని రెబల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ మీడియాకు చెప్పారు.

ముందుగా శివసేన పార్టీ తమదే అని, మెజార్టీ తమకే ఉందని మాట్లాడిన ఏక్ నాథ్ షిండే… శివసేన రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కమిటీల్లోని మెజారిటీ సభ్యులు ఉద్దవ్ ఠాక్రేకు మద్దతు ఇసుండటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

మరో వైపు తమ కార్యాలయాలపై శివసేన కార్యకర్తల దాడుల పట్ల రెబల్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. తమ కుటుంబ సభ్యుల భద్రత పట్ల కూడా వారిలో ఆందోళ‌న‌ మొదలయ్యిందని గౌహతి నుండి సమాచారం అందుతోంది.

కాగా 38 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల భద్రత కోసం నియమించిన పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించడం దుర్మార్గమైన చర్య అంటూ ఏక్ నాథ్ షిండే ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాశారు.

ఎమ్మెల్యేల నివాసాల‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు కల్పించిన భద్రతను చట్టవిరుద్ధంగా ఉపసంహరించుకున్నారు. అని షిండే తన లేఖలో పేర్కొన్నారు. ”నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్ గూండాలతో కూడిన మహా వికాస్ అఘాడి ప్రభుత్వ డిమాండ్‌లకు మేము లొంగిపోయేందుకు, మా సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయడానికే ఈ దుర్మార్గపు చర్య” అని షిండే ఆరోపించారు.

షిండే ఆరోపణపై మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ స్పందిస్తూ, ఏ ఎమ్మెల్యే భద్రతను ఉపసంహరించుకోలేదని స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఎమ్మెల్యేల‌ కుటుంబాలను సురక్షితంగా ఉంచేందుకు వారి నివాసాల వద్ద భద్రత పెంచాలని హోం శాఖ నిర్ణయించిందని పాటిల్ తెలిపారు.

First Published:  25 Jun 2022 4:35 AM GMT
Next Story