Telugu Global
CRIME

హైదరాబాదీలను కొల్లగొడుతున్న ఫేక్ క్రిప్టో వైబ్‌సైట్లు

ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అంటే క్రిప్టో కరెన్సీనే అనేలా ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు వడ్డీ కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఫిక్స్‌డ్ చేయడానికి చాలా మంది ఉత్సాహం చూపించేవారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. లాభాలు వచ్చిన వారి కంటే నష్టపోయిన వారే అక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఆ తర్వాత రిస్క్ తక్కువగా ఉండే మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపారు. ఇప్పటి వరకు చెప్పిన పెట్టుబడులు అన్నీ.. కనీసం […]

హైదరాబాదీలను కొల్లగొడుతున్న ఫేక్ క్రిప్టో వైబ్‌సైట్లు
X

ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అంటే క్రిప్టో కరెన్సీనే అనేలా ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు వడ్డీ కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఫిక్స్‌డ్ చేయడానికి చాలా మంది ఉత్సాహం చూపించేవారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. లాభాలు వచ్చిన వారి కంటే నష్టపోయిన వారే అక్కడ ఎక్కువ మంది ఉంటారు.

ఆ తర్వాత రిస్క్ తక్కువగా ఉండే మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపారు. ఇప్పటి వరకు చెప్పిన పెట్టుబడులు అన్నీ.. కనీసం మూడు నాలుగేళ్లు ఆగితేనే కానీ ఫలితాలు రావు. అయితే ఇన్‌స్టాంట్ మనీకి అలవాటు పడిన జనరేషన్ అంతకాలం వేచిచూడలేక పోతోంది. ఈ క్రమంలో యువత, ఉద్యోగస్తులను ఎక్కువగా ఆకట్టుకుంది ‘క్రిప్టో కరెన్సీ’.

ఇటీవల కాలేజీ స్టూడెంట్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ ఎక్కువగా క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇన్వెస్ట్ చేసిన నెలా రెండు నెలల్లోనే నాలుగు నుంచి ఐదు రెట్ల లాభాలు వస్తాయని చెప్తుండటంతో చాలా మంది అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఇండియాలో క్రిప్టో కరెన్సీపై సరైన చట్టం ఇంకా లేకపోవడంతో ఎంతో మంది మోసపోతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వేలాది క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి. వాటిలో నాలుగైదు మినహా ఏవీ ఇంత వరకు భారీ లాభాలను తెచ్చిపెట్టిన దాఖలాలు లేవు. అయినా సరే రోజుకో కొత్త కరెన్సీ మార్కెట్లో కి రావడం, జనాలను నిలువునా ముంచి వెళ్లిపోవడం జరుగుతూనే ఉంది.

తాజాగా వెబ్‌సైట్ల ద్వారా ఫేక్ క్రిప్టో కరెన్సీని జనాలకు అంటగట్టి.. రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేస్తున్న ఘటనలు హైదరాబాద్‌లో వెలుగు చూస్తున్నాయి. క్రిప్టో పట్ల ఆసక్తి చూపిస్తున్న యువతనే లక్ష్యంగా చేసుకుంటున్నాయి. బ్లాక్ చెయిన్ మార్కెట్, క్రిప్టో కరెన్సీపై పెద్దగా అవగాహన లేని వారిని టార్గెట్ చేసుకొని రూ. లక్షలు కొల్లగొడుతున్నాయి.

ఇటీవల http://expertcryptotrader.com/ అనే వెబ్‌సైట్ ద్వారా పలువురు మోసపోయారు. ఇన్వెస్టర్ల నుంచి భారీగా సొమ్ములు వసూలు చేసిన ఈ సైట్ ఆ తర్వాత మూసేసుకుంది.

హైటెక్ సిటీలోని ఇజ్జత్ నగర్ ప్రాంతానికి చెందిన కమ్మగోని దీపిక అనే విద్యార్థిని క్రిప్టో పట్ల ఆసక్తి చూపించేది. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. దీన్ని ఆసరాగా తీసుకున్న మోసగాళ్లు ఒక ఐడీ నుంచి రిక్వెస్ట్ పెట్టారు.

దాన్ని దీపిక యాక్సప్ట్ చేయగానే తమ క్రిప్టో కరెన్సీ గురించి వివరించారు. కేవలం రూ. 15,000 ఇన్వెస్ట్ చేస్తే రూ. 5.5 లక్షల లాభాలను తమ కంపెనీ అందిస్తుందని సదరు ఐడీ ద్వారా చెప్పారు. దీంతో దీపిక ఆసక్తి చూపించడంతో ఒక వాట్సప్ నెంబర్ ద్వారా చాటింగ్ మొదలు పెట్టారు.

క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ కోసం వేర్వేరు యూపీఐ ఐడీలకు పలుమార్లు డబ్బులు పంపినట్లు దీపిక చెప్పింది. డబ్బులు పంపిన వెంటనే సదరు నిర్వాహకులు ఒక మెయిల్ పంపారని.. ట్యాక్స్ కోసం 2000 యూఎస్ డాలర్లు చెల్లించాలని పేర్కొన్నట్లు ఆమె చెప్పింది.

తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో వాళ్లు దీపిక నెంబర్ బ్లాక్ చేయడమే కాకుండా.. కాల్స్, మెసేజీలకు స్పందించడం మానేశారు. దీపిక వద్ద నుంచి పలు దఫాలుగా రూ. 1.9 లక్షలు సదరు నేరగాళ్లు దోచేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇలాంటి కేసులు వారానికి కనీసం రెండు మూడైనా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నమోదవుతున్నట్లు పోలీసులు తెలిపారు. క్రిప్టో కరెన్సీ పేరుతో ఇప్పటి వరకు దాదాపు రూ. 30 లక్షల వరకు ఫేక్ వెబ్‌సైట్లు దోచేసినట్లు తెలుస్తుంది.

ముఖ్యంగా హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్, స్టూడెంట్స్ లక్ష్యంగా ఈ మోసాలు జరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Next Story