Telugu Global
National

600 మొబైల్‌ టవర్లను దొంగలెత్తుకెళ్ళారు

దొంగలు దొంగతనాల్లో కొత్త పోకడలు పోతున్నారు. ఇళ్ళల్లో డబ్బు, బంగారం, ఇతర వస్తువులు ఎత్తుకపోయే స్థాయి నుంచి బ్రిడ్జిలు, సెల్ టవర్లు దొంగతనం చేసే స్థాయికి చేరుకున్నారు. మొన్నీమధ్యనే బీహార్ లో దొంగలు ఓ పెద్ద బ్రిడ్జిని ఎత్తుకెళ్ళిన వార్తను చూసి విస్మయానికి గురయ్యాం. ఇప్పుడు చదవబోయే వార్త అంత కన్నా విస్మయాన్ని కలిగించేది. తమిళనాడులో దొంగలు మొబైల్ టవర్ల‌నే ఎత్తుకెళ్ళారు. ఒకటో రెండో కాదు ఏకంగా 600 మొబైల్ టవర్లను గుట్టుచప్పుడు కాకుండా దొంగతనం చేశారు. […]

600 మొబైల్‌ టవర్లను దొంగలెత్తుకెళ్ళారు
X

దొంగలు దొంగతనాల్లో కొత్త పోకడలు పోతున్నారు. ఇళ్ళల్లో డబ్బు, బంగారం, ఇతర వస్తువులు ఎత్తుకపోయే స్థాయి నుంచి బ్రిడ్జిలు, సెల్ టవర్లు దొంగతనం చేసే స్థాయికి చేరుకున్నారు. మొన్నీమధ్యనే బీహార్ లో దొంగలు ఓ పెద్ద బ్రిడ్జిని ఎత్తుకెళ్ళిన వార్తను చూసి విస్మయానికి గురయ్యాం. ఇప్పుడు చదవబోయే వార్త అంత కన్నా విస్మయాన్ని కలిగించేది.

తమిళనాడులో దొంగలు మొబైల్ టవర్ల‌నే ఎత్తుకెళ్ళారు. ఒకటో రెండో కాదు ఏకంగా 600 మొబైల్ టవర్లను గుట్టుచప్పుడు కాకుండా దొంగతనం చేశారు.

దేశవ్యాప్తంగా మొబైల్ టవర్లను ఏర్పాటు చేసేసంస్థ జీటీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ కంపెనీ. ఈ కంపెనీ తమిళనాడులో 6 వేలకు పైగా మొబైల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేసి వాటి నిర్వహణ కొనసాగిస్తున్నది. అయితే ఆ సంస్థకు ఊహించని విధంగా పెద్ద ఎత్తున‌ నష్టాల రావడం మూలంగా 2018లో తన‌ కార్యకలాపాలను నిలిపివేసింది. తమిళనాడులోని ఈ మొబైల్ టవర్‌లు ఉపయోగంలో లేకుండా పోయాయి. అయితే కరోనా కాలంలో పర్యవేక్షణ , నిర్వహణ సాధ్యం కాలేదు.

ఈమధ్య మళ్ళీ పనిచేయని మొబైల్ ఫోన్ టవర్‌ల స్థితిని తనిఖీ చేయడానికి ఆ కంపెనీ అధికారులు వెళ్ళారు. ముందుగా ఈరోడ్ దగ్గర ఉన్న టవర్ పరిశీలన కోసం వెళ్ళారు. అయితే అక్కడ వాళ్ళకు టవర్ కనిపించలేదు. దాంతో హడావుడిగా సంస్థ ఉద్యోగులు మొత్తం తమిళనాడులోని టవర్లన్నింటినీ పరిశీలించారు. అప్పుడు వాళ్ళకు 600 టవర్లు మాయమైనట్టు తెలిసింది.

వెంటనే కంపెనీ అధికారులు పోలీసుల‌కు పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రస్తుతం కోట్లలో నష్టం వాటిల్లిందని, ఒక్కో మొబైల్‌ ఫోన్‌ టవర్‌ నిర్మాణానికి రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చవుతుందని జీటీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ కంపెనీ స్పష్టం చేసింది.

గతంలో కూడా తమిళనాడులో ఇలాంటి సంఘటనలు జరిగాయి. మధురై జిల్లా జూడల్ పుదూర్ పరిసరాల్లో రూ.28 లక్షలతో ఏర్పాటు చేసిన వొడాఫోన్ సెల్‌ఫోన్ టవర్ ఈ ఏడాది జనవరిలో ఇలాగే మాయమైనట్లు సమాచారం.

Next Story