Telugu Global
NEWS

త్రీ-ఇన్- వన్ స్టార్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 15 ఏళ్ళ ప్రస్థానం…!

భారత నవతరం క్రికెట్ అసాధారణ ఆటగాళ్లలో విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ తర్వాతే ఎవరైనా. కొద్దిరోజుల క్రితమే విరాట్ కొహ్లీ సాంప్రదాయ టెస్టు క్రికెట్లో 11 సంవత్సరాల కెరియర్ పూర్తి చేసుకొంటే… మూడుఫార్మాట్ల మొనగాడు, భారత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ..తన 15 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేయగలిగాడు. 2007 నుంచి 2022 వరకూ…. రోహిత్ శర్మ ..ముంబైలోని ఆంధ్ర సంతతికి చెందిన అసాధారణ క్రికెటర్. ఈ హిట్ మ్యాన్ క్రికెట్ కెరియర్ లో జూన్ 23 […]

Rohit
X

భారత నవతరం క్రికెట్ అసాధారణ ఆటగాళ్లలో విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ తర్వాతే ఎవరైనా. కొద్దిరోజుల క్రితమే విరాట్ కొహ్లీ సాంప్రదాయ టెస్టు క్రికెట్లో 11 సంవత్సరాల కెరియర్ పూర్తి చేసుకొంటే… మూడుఫార్మాట్ల మొనగాడు, భారత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ..తన 15 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేయగలిగాడు.

2007 నుంచి 2022 వరకూ….

రోహిత్ శర్మ ..ముంబైలోని ఆంధ్ర సంతతికి చెందిన అసాధారణ క్రికెటర్. ఈ హిట్ మ్యాన్ క్రికెట్ కెరియర్ లో జూన్ 23 కు ప్రత్యేకస్థానం ఉంది. ఎందుకంటే..2013లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ధోనీ నాయకత్వంలో భారత్ సంచలన విజయం సాధించి విజేతగా నిలిచిన రోజునే…రోహిత్ శర్మ భారత్ తరపున తొలి అంతర్జాతీయ మ్యాచ్ కోసం బరిలో నిలిచాడు.

ఐర్లాండ్ తో 2007, జూన్‌ 23న బెల్‌ఫాస్ట్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ ద్వారా రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం చేశాడు. నాటినుంచే నేటి వరకూ ( 2022 జూన్ 23 వరకూ ) అంతైఇంతై అంతింతే అన్నట్లుగా ఎదిగిన రోహిత్ 15 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌ పూర్తి చేసున్నాడు. ఈ సందర్భంగా భావోద్వేగమైన ఓ సందేశాన్నిట్విట్టర్‌ ద్వారా తన శ్రేయోభిలాషులతో పంచుకొన్నాడు.

”ఈ రోజుతో 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ను పూర్తి చేసుకున్నా. ఇన్నేళ్ల నా ప్రయాణంలో ఎన్నో మధురానుభూతులు.. పరీక్షలు, కష్టాలు, సుఖాలు ఉన్నాయి. కానీ వాటిన్నింటిని తట్టుకొని ఈస్థాయికి చేరడం వెనుక మీ అందరి ఆదరణ, ప్రోత్సాహం, అభిమానాలే కారణం. అందుకే నా ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ, ప్రధానంగా విమర్శలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.” అంటూ తన సందేశాన్ని పంచుకొన్నాడు.

కళ్లు చెదిరే రికార్డుల రోహిత్…

భారత క్రికెట్‌లో, ప్రధానంగా వైట్ బాల్ క్రికెట్లో రోహిత్‌ శర్మ ప్రస్థానం గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. కెరీర్‌ తొలిరోజుల్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ కు దిగుతూ వచ్చిన వచ్చిన రోహిత్‌ నిలకడగా రాణించలేక జట్టులోకి వస్తూ పోతూ ఉండేవాడు. బాస్టర్ సెహ్వాగ్‌, మాస్టర్ సచిన్‌ల రిటైర్మెంట్‌ తర్వాత.. ఓపెనర్‌గా ప్రమోషన్‌ పొందిన రోహిత్‌ శర్మకు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది.

వన్డేల్లో భారీ స్కోర్లకు చిరునామాగా రోహిత్‌ నిలిచాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో మూడు ద్విశతకాలు బాదిన ఏకైక బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ మాత్రమే. అంతేకాదు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మొనగాడి రికార్డు సైతం రోహిత్ పేరుతోనే ఉంది.

మూడు ఫార్మాట్లలోనూ శతకాలు…

2014, నవంబర్‌ 13న కోల్ కతా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 264 పరుగుల భారీస్కోరుతో తన కెరియర్ లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు నెలకొల్పాడు. 2019 అక్టోబర్‌ 5న సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే అరుదైన ఘనత సాధించిన ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. ఇక కోహ్లి అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా వైదొలగడంతో సారధ్య బాధ్యతలు అందుకొన్న రోహిత్‌కు ఇంగ్లండ్‌ పర్యటన అసలుసిసలు పరీక్షకానుంది..

రెగ్యులర్‌ కెప్టెన్‌ గా రోహిత్‌ శర్మకు విదేశాల్లో ఇదే తొలి సిరీస్‌. రోహిత్ 15 సంవత్సరాల కాలంలో మొత్తం 230 వ‌న్డేలు ఆడాడు. దాంట్లో 48,60 స‌గ‌టుతో 9,283 పరుగులు నమోదు చేశాడు. అత్య‌ధికంగా అత‌ను 264 పరుగుల వ్యక్తిత స్కోరుతో సహా 29 సెంచ‌రీలు, 44 హాఫ్ సెంచ‌రీలు సాధించాడు.

2019లో ఐసీసీ క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు గెలిచాడు. 45 టెస్టుల్లో రోహిత్ 46.13 స‌గ‌టుతో 3137 ర‌న్స్ చేశాడు. టెస్టుల్లో అత‌ను 8 సెంచ‌రీలు, 14 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. ఇక టీ20 ఫార్మాట్‌లో ఇండియా త‌ర‌పున అత‌ను 125 మ్యాచ్‌లు ఆడాడు. వాటిల్లో 3313 ర‌న్స్ చేశాడు. టీ20ల్లో అత్య‌ధికంగా 118 ర‌న్స్ చేశాడు. నాలుగు సెంచ‌రీలు, 26 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ శతకాలు సాధించిన అతికొద్దిమంది భారత బ్యాటర్లలో రోహిత్ ఒకనిగా నిలిచాడు. తనదైన రోజున శివమెత్తినట్లు బ్యాటింగ్ చేస్తూ… పరుగుల మోత మోగించే రోహిత్..ఓపెనర్ గానూ, కెప్టెన్ గానూ జంట బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించాలని కోరుకొందాం…

First Published:  24 Jun 2022 2:28 AM GMT
Next Story