Telugu Global
National

కేంద్రమంత్రికి అర్ధ‌రాత్రి ఫోన్‌, టీచర్‌పై వేటు

రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలంటూ కేంద్రమంత్రికి ఫోన్‌ చేసి డిమాండ్ చేసిన టీచర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం. కర్నాటక బీదర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుశాల పాటిల్‌ ఈనెల 10న రాత్రి సమయంలో కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి భగవంత్ ఖూబాకు ఫోన్ చేశారు. కేంద్రమంత్రి కూడా ఈ జిల్లాకు చెందిన వారే. చాలా చోట్ల ఎరువులు అందుబాటులో లేవని, రైతులు ఇబ్బంది పడుతున్నారని.. కాబట్టి కొరత లేకుండా చూడాలని […]

Karnataka-govt-suspends-teacher11
X

రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలంటూ కేంద్రమంత్రికి ఫోన్‌ చేసి డిమాండ్ చేసిన టీచర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం. కర్నాటక బీదర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుశాల పాటిల్‌ ఈనెల 10న రాత్రి సమయంలో కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి భగవంత్ ఖూబాకు ఫోన్ చేశారు. కేంద్రమంత్రి కూడా ఈ జిల్లాకు చెందిన వారే.

చాలా చోట్ల ఎరువులు అందుబాటులో లేవని, రైతులు ఇబ్బంది పడుతున్నారని.. కాబట్టి కొరత లేకుండా చూడాలని కోరారు. అయితే కేంద్రమంత్రితో తాను మాట్లాడిన ఆడియో టేపును ఉపాధ్యాయుడు పాటిల్‌ బయటకు విడుదల చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది. దీన్ని కేంద్రమంత్రి, బీజేపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

ఆడియో టేపులో కేంద్రమంత్రి భగవంత ఖూబాకు, టీచర్ పాటిల్ కు మధ్య కొద్దిగా వాగ్వాదమే జరిగింది. కేంద్రమంత్రిని ప్రభుత్వం టీచర్ ఏకవచనంతో మాట్లాడారు. ఎరువుల కొరత ఉంటే స్థానిక అధికారులను సంప్రదించాల్సిందిగా కేంద్రమంత్రి కాస్త గట్టిగా మాట్లాడారు. అందుకు స్పందించిన టీచర్ పాటిల్ ఈసారి మా ఊరికి వచ్చి ఓట్లు అడగండి.. వచ్చే ఎన్నికల్లో గెలవండి చూద్దాం అంటూ సవాల్ చేశారు.

కేంద్రమంత్రికి అర్థరాత్రి ఫోన్ చేయడం, ఏకవచనంతో అవమానించేలా మాట్లాడడం, ఆడియో టేపును వైరల్‌ చేయడం వంటి అంశాల ఆధారంగా పాటిల్‌పై కర్నాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అతడిని సస్పెండ్ చేసింది.

ఈ ఘటనపై స్పందించిన ఉపాధ్యాయుడు పాటిల్..” నేను స్కూల్ టీచర్‌ను అయి ఉండవచ్చు. కానీ అంతకంటే ముందు నేను రైతు కుటుంబానికి చెందిన వాడిని. కేంద్రమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ఎరువుల కొరత లేదు అని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎరువులు అందుబాటులో లేవు. ఒక డీఏపీ బస్తా కోసం ఒక చోట నుంచి మరొక చోటికి పరుగులు తీయాల్సిన పరిస్థితి. గతేడాది అక్టోబర్‌లో పక్కనున్న తెలంగాణకు వెళ్లి ఎరువులు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడూ దాదాపు పరిస్థితి అలాగే ఉంది. ఖుబాకు ఇక్కడి ప్రజలు ఓటేశారు. ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన్ను సంప్రదించే హక్కు మాకు ఉంది” అంటూ మాట్లాడారు.

కేంద్ర మంత్రి తనను సస్పెండ్ చేయించడాన్ని పాటిల్ తప్పుపట్టారు. దీనిపై తాను నిరసన తెలుపుతానని, న్యాయ పోరాటం చేస్తానని, ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడుతున్నానని పాటివ్ వివరించారు.

First Published:  23 Jun 2022 9:37 PM GMT
Next Story