Telugu Global
MOVIE REVIEWS

సమ్మతమే మూవీ రివ్యూ

నటీ నటులు : కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, గోపరాజు రమణ , శివన్నారాయణ, అన్నపూర్ణమ్మ, సితార, సప్తగిరి , రాజేంద్ర తదితరులు. సంగీతం: శేఖర్ చంద్ర కెమెరా : సతీష్ రెడ్డి మాసం ఎడిటింగ్ : విల్పవ్ నిర్మాణం : యూజీ ప్రొడక్షన్స్ నిర్మాత: కంకణాల ప్రవీణ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి రేటింగ్ : 2.5/5 హీరో కిరణ్ అబ్బవరం మంచి కథలు ఎంచుకుంటున్నాడు. కానీ వాటికి తగ్గ దర్శకుల్ని ఎంపిక […]

సమ్మతమే మూవీ రివ్యూ
X

నటీ నటులు : కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, గోపరాజు రమణ , శివన్నారాయణ, అన్నపూర్ణమ్మ, సితార, సప్తగిరి , రాజేంద్ర తదితరులు.
సంగీతం: శేఖర్ చంద్ర
కెమెరా : సతీష్ రెడ్డి మాసం
ఎడిటింగ్ : విల్పవ్
నిర్మాణం : యూజీ ప్రొడక్షన్స్
నిర్మాత: కంకణాల ప్రవీణ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి
రేటింగ్ : 2.5/5

హీరో కిరణ్ అబ్బవరం మంచి కథలు ఎంచుకుంటున్నాడు. కానీ వాటికి తగ్గ దర్శకుల్ని ఎంపిక చేసుకోలేకపోతున్నాడు. పైగా ఆ కథల్లో హీరో పాత్రల్ని మాత్రమే అతడు చూస్తున్నట్టున్నాడు. మిగతా పాత్రల ఛాయలు, వాటికి ఎన్నుకునే నటీనటుల విషయంలో కిరణ్ పెద్దగా దృష్టిపెడుతున్నట్టు లేదు. ఈరోజు రిలీజైన సమ్మతమే సినిమాలో ఈ లోపాలు ప్రధానంగా కనిపించాయి. చిన్న పాయింట్ ను 2 గంటల సినిమాగా చెప్పే సాహసం చేశారు. కానీ ఈ క్రమంలో ఎన్నో చోట్ల తడబడ్డారు. దీంతో ఈ సినిమా సగమే సమ్మతం అనిపించుకుంటుంది.

చిన్నతనంలోనే అమ్మ ప్రేమకి దూరమైన కృష్ణ (కిరణ్ అబ్బవరం) అలాంటి ప్రేమ మళ్ళీ తన భార్య రూపంలో పొందాలనుకుంటాడు. అందుకే ఎవ్వరినీ ప్రేమించకుండా పెళ్ళయ్యాక తన భార్యని మాత్రమే ప్రేమించాలని డిసైడ్ అవుతాడు. తనకి నచ్చిన అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న సమయంలో శాన్వి (చాందిని చౌదరి) ని తొలి చూపులోనే చూసి ప్రేమలో పడతాడు.కట్ చేస్తే ప్రేమలో పడిన శాన్వితోనే కృష్ణ కి నిశ్చితార్థం జరుగుతుంది. దీంతో అతడి ఆనందం రెట్టింపు అవుతుంది. అసలు కృష్ణ కోరుకునే లక్షణాలు శాన్విలో ఉన్నాయా లేదా? ఆమె ఇష్టాలను గౌరవించి కృష్ణ చివరికి 'సమ్మతమే' అన్నాడా లేదా అనేది సినిమా కథ.

శోభన్ బాబు జమానా నుంచి ఇలాంటి కథలు చూస్తూనే ఉన్నాం. క్లైమాక్స్ లో హీరో లేదా హీరోయిన్ కాంప్రమైజ్ అవ్వడం, ఇద్దరూ తప్పులు తెలుసుకొని ఒకటవ్వడం లాంటి కథల్ని శోభన్ బాబు, నాగేశ్వరరావు చాలా చేశారు. ఇది కూడా దాదాపు అలాంటి కథే. కాకపోతే ఈ తరానికి నప్పేలా సిగరెట్, మందు, పబ్ లాంటి అంశాల్ని జోడించారు. హీరోను కూడా మరీ పల్లెటూరి అబ్బాయిగా కాకుండా, సెమీ-అర్బన్ గా కూడా చూపించి ఈ జనరేషన్ కు కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న మేకర్స్.. నెరేషన్ విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఫస్టాఫ్ అంతా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ వచ్చేసరికి మాత్రం కథ మెలికలు తిరిగిపోతుంది. పాయింట్ చిన్నదే, అది కూడా అందరికీ అప్పటికే తెలిసిపోతుంది. కానీ రన్ టైమ్ పెంచడం కోసం అక్కడక్కడే కథను తిప్పినట్టు అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఈ సినిమా కథ ఫస్టాఫ్ ను ఓ దర్శకుడు, రెండో భాగాన్ని మరో దర్శకుడు డైరక్ట్ చేసినట్టు అనిపిస్తోంది.

ఈ సంగతి పక్కనపెడితే.. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి రాసుకున్న సీన్లు బాగాలేవు. షార్ట్ ఫిలిం తీయాల్సిన లైన్ తో పెద్ద సినిమా చేయాలనే సాహసం చేసిన ఈ దర్శకుడు.. అందుకు తగ్గట్టు హోం వర్క్ చేసుంటే బాగుండేది. కిరణ్ అబ్బవరం లాంటి హీరోను పెట్టుకొని కథలో ఎనర్జీ మిస్ చేయడం దర్శకుడు చేసిన అతి పెద్ద తప్పు. ఎస్ఆర్ కల్యాణమండపం అంత పెద్ద హిట్టయిందంటే దానికి కారణం అందులో కిరణ్ ఎనర్జీ. అది ఈ సినిమాలో మిస్సయింది. కనీసం హీరో అయినా ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే బాగుండేది.

లవ్ స్టోరీలో ఆశించేంత రొమాన్స్ ఇందులో లేదు. సెకండాఫ్ లో కిస్ సీన్ తప్ప యూత్ ని ఎట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ పెద్దగా లేవు. పబ్
లో హీరో-హీరోయిన్ మాట్లాడుకునే సన్నివేశం కొంతలో పరవాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్ లో కామెడీ కోసం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. సప్తగిరి, రాజేంద్రలను బలవంతంగా ఇరికించారు. ఆ కామెడీ ఎబ్బెట్టుగా ఉంది.

ఉన్నంతలో కిరణ్ ఈ సినిమాను మోశాడు. బాయ్ నెక్ట్స్ డోర్ ఇమేజ్ అతడికి బాగా పనికొచ్చింది. కానీ ఇంతకుముందే చెప్పుకున్నట్టు అతడి నుంచి ఆశించే ఎనర్జీ, జోష్ ఇందులో మిస్సయింది. చాందినీ చౌదరి మోడ్రన్ అమ్మాయిగా బాగా కనిపించింది కానీ బాగా నటించలేకపోయింది. హీరో తండ్రిగా గోపరాజు, హీరోయిన్ తండ్రిగా శివన్నారాయణ తమ పాత్రలకు న్యాయం చేశారు. సప్తగిరి, రాజేంద్ర, చమ్మక్ చంద్ర లాంటి బ్యాచ్ మొత్తం నవ్వించలేకపోయారు.

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కాంప్రమైజ్ కాకుండా తీయడంతో క్వాలిటీ కనిపించింది. శేఖర్ చంద్ర అందించిన పాటలు బాగున్నాయి. మరీ ముఖ్యంగా కృష్ణ అండ్ సత్యభామ, బుల్లెట్ లా సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సతీష్ రెడ్డి కెమెరా వర్క్, ఎడిటింగ్ బాగున్నాయి. డైలాగ్స్ అక్కడక్కడ మెప్పిస్తాయి.

ఓవరాల్ గా బలమైన సన్నివేశాలు లేకపోవడం, ఫ్లాట్ నెరేషన్, ఊహించే విధంగా క్లయిమాక్స్ ఉండడం ఈ సినిమాను రొటీన్ గా మార్చేశాయి.

First Published:  24 Jun 2022 5:00 AM GMT
Next Story