Telugu Global
NEWS

హిందూపురం వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు.. రాళ్లదాడి..

సరిగ్గా సీఎం జగన్ పర్యటన జరిగిన వారం రోజులకు హిందూపురం వైసీపీలో లుకలుకలు మళ్లీ బయటపడ్డాయి. గొడవ ముదిరి ఏకంగా రాళ్లదాడి వరకు వెళ్లింది. ఇటీవల సత్యసాయి జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం జగన్.. హిందూపురం నేతలిద్దర్నీ పిలిచి సయోధ్యకు ప్రయత్నించారు. ఎమ్మెల్సీ ఇక్బాల్, వైసీపీ సీనియర్ నేత కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. సర్దుకుపోవాలన్నారు. ఆ నియోజకవర్గ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. కట్ చేస్తే.. వారం రోజుల్లో గొడవ పెరిగి […]

హిందూపురం వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు.. రాళ్లదాడి..
X

సరిగ్గా సీఎం జగన్ పర్యటన జరిగిన వారం రోజులకు హిందూపురం వైసీపీలో లుకలుకలు మళ్లీ బయటపడ్డాయి. గొడవ ముదిరి ఏకంగా రాళ్లదాడి వరకు వెళ్లింది. ఇటీవల సత్యసాయి జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం జగన్.. హిందూపురం నేతలిద్దర్నీ పిలిచి సయోధ్యకు ప్రయత్నించారు. ఎమ్మెల్సీ ఇక్బాల్, వైసీపీ సీనియర్ నేత కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. సర్దుకుపోవాలన్నారు. ఆ నియోజకవర్గ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు.

కట్ చేస్తే.. వారం రోజుల్లో గొడవ పెరిగి పెద్దదైంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. హిందూపురం ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గం నిన్న ప్రెస్ మీట్ పెట్టి వైరి వర్గంపై ఆరోపణలు చేసింది. దీనికి ఖండనగా వేణుగోపాల్ రెడ్డి వర్గానికి చెందిన ఎంపీపీ రత్నమ్మ ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధమయ్యారు. వారంతా ప్రెస్ క్లబ్ కి చేరుకోగానే.. ఎమ్మెల్సీ వర్గీయులు అక్కడికి వచ్చారు. ప్రెస్ మీట్ పెట్టొద్దని, ఏదైనా ఉంటే అధిష్టానంతో మాట్లాడుకోవాలని చెప్పారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.

వైసీపీలో అక్కడక్కడా అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలనుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో వైసీపీలో కాస్త ఇబ్బందికర వాతావరణం నెలకొంది. రెండు వర్గాల మధ్య విభేదాలు పెరిగి పెద్దవవుతున్నాయి. ఇటీవల రాజోలు నియోజకవర్గంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి రుద్రరాజు వెంకట రామరాజు రాజీనామా చేశారు, ఆయనతోపాటు మరికొంతమంది కార్యకర్తలు కూడా పార్టీని వీడారు. అయితే హిందూపురంలో అలాంటి పరిస్థితి లేదు. వైసీపీలోనే రెండు వర్గాలున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ చేతిలో వైసీపీ అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ 17వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ప్రస్తుతం ఆయన హిందూపురం నియోజకవర్గానికి ఇన్ చార్జిగా ఉన్నారు. 2024లో అక్కడినుంచి వేణుగోపాల్ రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్య వైరం మొదలైంది. ఈ వైరం పెరిగి పెద్దదై.. చివరకు పరస్పర దాడుల వరకూ వెళ్లింది. మరి దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

First Published:  24 Jun 2022 8:10 AM GMT
Next Story