Telugu Global
NEWS

మళ్లీ కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కదిలిస్తున్న రేవంత్.. కాంగ్రెస్‌లో మళ్లీ మొదలైన వర్గపోరు

కాంగ్రెస్‌ పార్టీ అంటేనే గ్రూపు రాజ‌కీయాల‌కు కేరాఫ్ అని అందరికీ తెలిసిందే. అధికారంలో లేనప్పుడు ఈ వర్గపోరు మరింతగా ముదిరిపోతుంది. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం మా పార్టీ సిద్ధాంతం అన్న‌ట్టుగా చెప్పుకుంటుంటారు. 8 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో లేని కాంగ్రెస్.. ఏపీలో పూర్తిగా కనుమరుగవగా.. తెలంగాణలో మాత్రం కాస్త బలంగానే క‌న‌బ‌డుతోంది. కానీ, ఈ పార్టీకి సరైన నాయకుడు లేక కార్యకర్తల్లో ఆందోళన నెలకొన్న సమయంలో టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టారు. ఇక […]

revanth-reddy-enters-into-a-confrontation-with-the-komatireddy-brothers-and-fighting-that-has-resumed-in-the-congress
X

కాంగ్రెస్‌ పార్టీ అంటేనే గ్రూపు రాజ‌కీయాల‌కు కేరాఫ్ అని అందరికీ తెలిసిందే. అధికారంలో లేనప్పుడు ఈ వర్గపోరు మరింతగా ముదిరిపోతుంది. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం మా పార్టీ సిద్ధాంతం అన్న‌ట్టుగా చెప్పుకుంటుంటారు. 8 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో లేని కాంగ్రెస్.. ఏపీలో పూర్తిగా కనుమరుగవగా.. తెలంగాణలో మాత్రం కాస్త బలంగానే క‌న‌బ‌డుతోంది. కానీ, ఈ పార్టీకి సరైన నాయకుడు లేక కార్యకర్తల్లో ఆందోళన నెలకొన్న సమయంలో టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టారు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్‌లో లుకలుకలు మరోసారి మొదలయ్యాయి.

వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి పీసీసీ ఇవ్వడంపై పలువురు సీనియర్ నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అయితే రేవంత్ పదవిని కొనుక్కున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తికి పదవి కట్టబెడతారా అని విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు జగ్గారెడ్డి, వీహెచ్ వంటి నేతలు కూడా తోడయ్యారు. దీంతో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై అధిష్టానం ఆందోళన చెందింది. సీనియర్ నేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆయనే వరంగల్ సభకు వచ్చి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. గాంధీభవన్‌లో మీటింగ్ పెట్టి నాయకులకు దిశానిర్దేశం చేశారు.

దీంతో సీనియర్ నాయకులు గత కొంతకాలంగా సైలెంట్‌గానే ఉంటున్నారు. ఇటీవల కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి రేవంత్ రెడ్డి అమెరికాలో కూడా పర్యటించారు. రాజ్‌భవన్ ముట్టడి వంటి కార్యక్రమాలతో పార్టీలో ఊపు వచ్చింది. కాగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం సీనియర్లు తనను అన్న మాటలు మర్చిపోలేదని తెలుస్తుంది. వారికి చెక్ పెట్టేందుకు వ్యూహం రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీనియర్ నాయకుల నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులను రేవంత్ ప్రోత్సహిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంత కాలంగా పార్టీలో ఉన్నారో లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహించే పనిలో పడ్డారు రేవంత్. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని సీనియర్లకు దీటుగా ద్వితీయ శ్రేణి నాయకులను తయారు చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు గాను నల్గొండ జిల్లాలో పర్యటించాలని రేవంత్ ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.

గతంలో కూడా నల్గొండలో పర్యటించేందుకు రేవంత్ సిద్దపడగా.. వెంకట్‌రెడ్డి వ్యతిరేకించారు. దీంతో ఆయన నాగార్జునసాగర్‌లో సమావేశం పెట్టుకున్నారు. అయితే ఈ సారి మాత్రం ద్వితీయ శ్రేణి నాయకులతో కలసి నల్గొండలో పర్యటించాలని భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్న పార్టీలో ఏకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే వర్గ పోరును ప్రోత్సహిస్తున్నారని సీనియర్లు అంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులను ఎక్కువగా ప్రోత్సహిస్తే ఎన్నికల నాటికి టికెట్ల కోసం గొడవలు ముదురుతాయని చెప్తున్నారు. అయితే సీనియర్ల మాటను మాత్రం రేవంత్ పట్టించుకోవడం లేదని.. నల్గొండలో పర్యటించే తీరతానని సన్నిహితులతో చెప్తున్నట్లు సమాచారం.

First Published:  22 Jun 2022 10:31 PM GMT
Next Story