Telugu Global
National

నా సహనం సీక్రెట్ అదే- రాహుల్

నేషనల్ హెరాల్డ్ కేసులో ఐదు రోజుల పాటు ఈడీ విచారణ ఎదుర్కొన్న రాహుల్‌ గాంధీ.. తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈడీ తనను విచారించిన విధానాన్ని సరదగా కార్యకర్తలతో పంచుకున్నారు. ఈడీ విచారణ చాలా చిన్న అంశమని వాటిని పట్టించుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. అగ్నిపథ్‌ లాంటి పెద్ద అంశాలపై దృష్టి పెట్టాలని కార్యకర్తలకు సూచించారు. 12 అడుగుల పొడవు, వెడల్పు ఉన్న గదిలో తనను గంటల […]

Rahul-gandhi
X

నేషనల్ హెరాల్డ్ కేసులో ఐదు రోజుల పాటు ఈడీ విచారణ ఎదుర్కొన్న రాహుల్‌ గాంధీ.. తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈడీ తనను విచారించిన విధానాన్ని సరదగా కార్యకర్తలతో పంచుకున్నారు. ఈడీ విచారణ చాలా చిన్న అంశమని వాటిని పట్టించుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. అగ్నిపథ్‌ లాంటి పెద్ద అంశాలపై దృష్టి పెట్టాలని కార్యకర్తలకు సూచించారు.

12 అడుగుల పొడవు, వెడల్పు ఉన్న గదిలో తనను గంటల తరబడి కూర్చోబెట్టారని.. ఆ సమయంలో ఈడీ అధికారులు ఇన్ని గంటల పాటు ఒకేచోట కూర్చోవడం వల్ల మీరు అలసిపోవడం లేదా అని ప్రశ్నించారన్నారు. కూర్చొని, కూర్చొని తామంతా అలసిపోయామంటూ అధికారులు చెప్పారన్నారు. అలసిపోకుండా ఉండడానికి కారణం చెప్పాలని కోరారని.. తొలుత తాను చెప్పను పోండి అన్నానని.. ఆ తర్వాత ఒక కారణం వారికి వివరించానని రాహుల్ చెప్పారు.

తాను మెడిటేషన్‌ అలవాటు కారణంగానే అలసిపోవడం లేదని చెప్పానని.. కానీ అసలు కారణం మాత్రమే వేరే ఉందన్నారు. తాను ఒక్కడినే గదిలో ఉన్నా తన చూట్టూ కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు తనతో ఉన్నట్టుగా అనిపించేదన్నారు. ప్రజాస్వామాన్ని రక్షించాలనుకునే వారంతా తనతో ఉన్నట్టుగా అనిపించేదని.. ఈడీ వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపకపోయినా వారంతా గదిలో తనతో ఉన్నారని రాహుల్ వ్యాఖ్యానించారు.

2004 నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేయడం వల్ల తనకు మరింత సహనం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సహనం నేర్పుతుందని.. అవతలి పార్టీకి సహనం అక్కర్లేదని, అబద్దాలు మాట్లాడితే చాలంటూ బీజేపీని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాల తరహాలోనే ఒకరోజు అగ్నిపథ్‌ను కూడా నరేంద్రమోడీ వెనక్కు తీసుకుంటారని రాహుల్ జోస్యం చెప్పారు.

చైనా ఇప్పటికే మన భూభాగాన్ని ఆక్రమిస్తోందని.. వెయ్యి చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తోందని.. ఇలాంటి సమయంలో సైన్యాన్ని బలోపేతం చేయాల్సిందిపోయి బలహీనపరుస్తున్నారని రాహుల్ విమర్శించారు.

First Published:  22 Jun 2022 9:22 PM GMT
Next Story