Telugu Global
National

సాయంత్రం 5 గంటలకల్లా రాకపోయారో.. శివసేన ఎమ్మెల్యేలకు అల్టిమేటం

మహారాష్ట్ర రాజకీయాలు గంటకో రకంగా మారిపోతున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులతో మహారాష్ట్ర వికాస్ అఘాడీ ప్రభుత్వం అసలు అధికారంలో ఉంటుందా లేక పడిపోతుందా..? అన్నట్టు ఉంది పరిస్థితి..! ఓ వైపు సీఎం ఉధ్ధవ్ థాక్రే రాజీనామా చేయవచ్చని, రాష్ట్ర అసెంబ్లీ రద్దు కావచ్చని హాట్ హాట్ గా వార్తలు వస్తున్నవేళ .. బుధవారం సాయంత్రం 5 గంటలకు సీఎం ఉద్ధవ్ థాక్రే అధికార నివాసమైన వర్షలో జరిగే సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరు కావాలని శివసేన […]

shivsena-ultimatum-mlas
X

మహారాష్ట్ర రాజకీయాలు గంటకో రకంగా మారిపోతున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులతో మహారాష్ట్ర వికాస్ అఘాడీ ప్రభుత్వం అసలు అధికారంలో ఉంటుందా లేక పడిపోతుందా..? అన్నట్టు ఉంది పరిస్థితి..! ఓ వైపు సీఎం ఉధ్ధవ్ థాక్రే రాజీనామా చేయవచ్చని, రాష్ట్ర అసెంబ్లీ రద్దు కావచ్చని హాట్ హాట్ గా వార్తలు వస్తున్నవేళ .. బుధవారం సాయంత్రం 5 గంటలకు సీఎం ఉద్ధవ్ థాక్రే అధికార నివాసమైన వర్షలో జరిగే సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరు కావాలని శివసేన అల్టిమేటం జారీ చేసింది.

ఈ మీటింగ్ కి గైర్హాజ‌రైన పక్షంలో మీరు పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవాలనే భావిస్తున్నట్టు పరిగణించబడుతుందని, ఫలితంగా చట్టం ప్రకారం మీ సభ్యత్వ అనర్హతకు సంబంధించి చర్య తీసుకుంటామని చీఫ్ విప్ సునీల్ ప్రభు ఈ అల్టిమేటంలో హెచ్చరించారు. ఈ మేరకు వాట్సాప్, ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ ల ద్వారా స‌మాచారాన్ని చేర‌వేశారు. ఈ సమావేశానికి రాకపోతే పార్టీ నియ‌మాల ప్రకారం మీ సభ్యత్వం రద్దయినట్టే అని ఆయన పేర్కొన్నారు.

ఉద్ధవ్ థాక్రే వ‌ర్చువ‌ల్‌గా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించిన తరువాత ఈ అల్టిమేటం జారీ అయింది. శివసేన రెబల్ నేత, మంత్రి ఏక్‌నాథ్ షిండే బీజేపీ పాలిత అస్సోం రాష్ట్రానికి తన వర్గం ఎమ్మెల్యేలతో విమానంలో ఎగిరిపోవడంతో సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. తనకు 40 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఇండిపెండెంట్ల మద్దతు ఉందని ఆయన ప్రకటించారు. పార్టీలు మారే ప్రసక్తి లేదని, తాము బాలాసాహెబ్ థాక్రే ప్రబోధించిన హిందుత్వాన్ని పాటిస్తామని ఆయన పదేపదే చెబుతున్నారు.

గుజరాత్ లోని సూరత్ నుంచి విమానంలో గౌహతికి ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రయాణించారో తెలియదు గానీ ఈ విమానంలో సిబ్బందితో సహా 89 మంది ప్రయాణికులు ఉన్నారట. గౌహతి విమానాశ్రయం నుంచి ఎమ్మెల్యేలను మూడు బస్సుల్లో హోటల్ కు తరలించారు. 288 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీపీ నుంచి 53 మంది, కాంగ్రెస్ నుంచి 44 మంది సభ్యులున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు జైల్లో ఉండగా ఒకరు మరణించారు. ప్రస్తుతం సాధారణ మెజారిటీ మార్క్ 144..అయితే కొన్ని పత్రికలు దీన్ని 143గా పేర్కొన్నాయి. మరి ఈ మార్క్ ఎవరికి లాభిస్తుందో, ఏమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

55 మంది సేన ఎమ్మెల్యేల్లో 40 మంది, ఆరుగురు ఇండిపెండెంట్లు షిండే ఆధ్వర్యాన గౌహతిలోని హోటల్ లో ఉన్నారని సమాచారం. ఈ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన పక్షంలో శివసేన బలం 15కి ప‌డిపోతుంది. ఫిరాయింపుల నిషేధ చట్టం బారి నుంచి రక్షించుకోవాలంటే షిండేకి కనీసం 37 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. సేన సభ్యుల్లో మూడింట రెండువంతుల మంది మద్దతు ఉన్నప్పుడు అసెంబ్లీలో ఓ ప్రత్యేక పార్టీగా దానికి గుర్తింపు లభిస్తుంది. పైగా శివసేన పార్టీ గుర్తు తమకే చెందాలని షిండే నేతృత్వంలోని రెబల్స్ ఎన్నికల సంఘాన్ని కోరవచ్చు. మెజారిటీ సపోర్ట్ ఉన్న వర్గానికి పార్టీ చిహ్నం లభిస్తుంది. దీనివల్ల అసెంబ్లీలో మహా వికాస్ అఘాడీ బలం 112కి తగ్గుతుంది. 46 మంది సభ్యులు రాజీనామా చేసిన పక్షంలో సభలో కొత్త మెజారిటీ మార్క్ 121 అవుతుంది. అయితే తమకు ఈ మార్క్ కన్నా ఎక్కువమంది సభ్యుల మద్దతు ఉందని బీజేపీ చెప్పుకుంటోంది.

First Published:  22 Jun 2022 5:35 AM GMT
Next Story