Telugu Global
National

ఢిల్లీ డిప్యూటీ సీఎంపై అస్సోం సీఎం భార్య 100 కోట్ల దావా

తన మంత్రివర్గ సహచరుడు సత్యేంద్ర జైన్ పై వచ్చిన అవినీతి ఆరోపణలతో అసలే తలనొప్పి తెచ్చుకున్న ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కి మరో సంకటం వచ్చి పడింది. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఓ వివాదంలో చిక్కుకోవడంతో ఏం చేయాలో తెలియక ఆయన తల పట్టుకుంటున్నారు. సిసోడియా తనపై చేసిన ఆరోపణలకు గాను అస్సోం సీఎం హిమంత బిస్వ శర్మ భార్య రింకు భూయాన్ శర్మ ఆయన మీద రూ.100 కోట్లకు […]

ఢిల్లీ డిప్యూటీ సీఎంపై అస్సోం సీఎం భార్య 100 కోట్ల దావా
X

తన మంత్రివర్గ సహచరుడు సత్యేంద్ర జైన్ పై వచ్చిన అవినీతి ఆరోపణలతో అసలే తలనొప్పి తెచ్చుకున్న ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కి మరో సంకటం వచ్చి పడింది. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఓ వివాదంలో చిక్కుకోవడంతో ఏం చేయాలో తెలియక ఆయన తల పట్టుకుంటున్నారు. సిసోడియా తనపై చేసిన ఆరోపణలకు గాను అస్సోం సీఎం హిమంత బిస్వ శర్మ భార్య రింకు భూయాన్ శర్మ ఆయన మీద రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశారు.

2020లో దేశంలో కరోనా ఉధృతంగా ఉండగా అస్సోం ప్రభుత్వం రింకు భూయాన్ శర్మ, ఆమె కుమారుడు నిర్వహిస్తున్న ఓ బిజినెస్ సంస్థకు పీపీఈ కిట్ల సరఫరాకు సంబంధించి కాంట్రాక్టు ఇచ్చిందని, అయితే మార్కెట్ రేట్లకన్నా ఇవి అత్యధిక ధరలు పలికాయని సిసోడియా ఆరోపించారు. ఈ మేరకు ఆయన అస్సోం మిషన్ డైరెక్టర్ ఎస్. లక్ష్మణన్ నుంచి జేసీబీ ఇండస్ట్రీస్ కి పంపిన ఓ బిల్లును ట్యాగ్ చేసి ట్వీట్‌చేశారు.

ఈ సంస్థ పేరిట ఒక్కో పీపీఈ కిట్ కి 990 రూపాయల చొప్పున 5 వేల కిట్ల కొనుగోలుకు మీ భార్య కాంట్రాక్టు తీసుకున్నారు. ఈ బిల్లు సరైనదా కాదా చెప్పండి అని మ‌నీష్ సిసోడియా ప్రశ్నించారు. ఇది అవినీతి కిందికి రాదా అని నిల‌దీశారు. ఈ నెల 4న ఆయన ఇలా అస్సోం ప్రభుత్వాన్ని ‘నిలదీశారు’. కానీ ఈ ఆరోపణలపై రింకు శర్మ లోగడ వివరణ ఇచ్చారు. ఈ వివాదంలో.. తన భార్యను హిమంత్ బిస్వా శర్మ సమర్థిస్తూ.. ఈ వందయేళ్లలో దేశం కనీవినీ ఎరుగని విప‌త్క‌ర ప‌రిస్థితిని ఎదుర్కొన్నప్పుడు తమ రాష్ట్రంలో ఇలాంటి కిట్లు దాదాపు లేనేలేవని, కానీ తన భార్య చొరవ తీసుకుని ప్రభుత్వానికి ఉచితంగా 1500 కిట్లను విరాళంగా ఇచ్చిందన్నారు. ఆమె ఒక్కపైసా అయినా తీసుకోలేదన్నారు.

ఆ తరువాత రింకు శర్మ కూడా మళ్ళీ ఇదే విషయమై క్లారిటీ ఇచ్చారు. తన భర్త ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన పేరును తాను వాడుకోలేదన్నారు. ఏమైనా ఇది పెను వివాదంలా మారి సిసోడియా మెడకు చుట్టుకుంది. నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు గాను మీ మీద రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నానంటూ ఆమె తన లాయర్ తరఫున సిసోడియాకు నోటీసు పంపింది. దీనిపై గౌహతి కామరూప్ సివిల్ జడ్జి కోర్టులో బుధవారం విచారణ జరుగుతుందని లాయర్ పద్మాధర్ నాయక్ తెలిపారు.

First Published:  22 Jun 2022 1:52 AM GMT
Next Story