Telugu Global
NEWS

కడుపుతో ఉన్నారా… ఉద్యోగానికి అన్ ఫిట్

స్త్రీ గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వటం, పిల్లలను పెంచడం… అనేవి మానవజాతిని ముందుకు తీసుకు వెళ్లే సహజమైన అంశాలే అయినా… అవి పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయాలుగా భావించడం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఆయా సమయాల్లో ఆమె ఎదుర్కొంటున్న వివక్షే ఇందుకు ఉదాహరణ. ఇటీవల ఇండియన్ బ్యాంక్ సైతం అలాంటి వివక్షని చూపిస్తూ ఒక నూతన రిక్రూట్ మెంట్ నిబంధనని విధించింది. ఆ నిబంధన మేరకు మూడు లేదా అంతకంటే ఎక్కువ నెలల గర్భవతులైన స్త్రీలను … […]

కడుపుతో ఉన్నారా… ఉద్యోగానికి అన్ ఫిట్
X

స్త్రీ గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వటం, పిల్లలను పెంచడం… అనేవి మానవజాతిని ముందుకు తీసుకు వెళ్లే సహజమైన అంశాలే అయినా… అవి పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయాలుగా భావించడం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఆయా సమయాల్లో ఆమె ఎదుర్కొంటున్న వివక్షే ఇందుకు ఉదాహరణ. ఇటీవల ఇండియన్ బ్యాంక్ సైతం అలాంటి వివక్షని చూపిస్తూ ఒక నూతన రిక్రూట్ మెంట్ నిబంధనని విధించింది. ఆ నిబంధన మేరకు మూడు లేదా అంతకంటే ఎక్కువ నెలల గర్భవతులైన స్త్రీలను …

వెంటనే ఉద్యోగంలోకి తీసుకోలేమని, వారిని తాత్కాలికంగా ఫిట్ గా లేనట్టుగా పరిగణిస్తామని, అభ్యర్థికి… ప్రసవానంతరం ఆరువారాల తరువాత మరొకసారి ఫిట్ నెస్ ని నిర్దారించే పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని, అప్పుడే ఉద్యోగంలోకి తీసుకుంటామని నూతన నిబంధనల్లో ఇండియన్ బ్యాంకు పేర్కొంది. ఈ అంశంపై మీడియాలో కథనాలు రావటంతో ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. బ్యాంకు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతూ ఇండియన్ బ్యాంక్ వారికి నోటీసు జారీ చేసింది.

బ్యాంకు విధించిన నిబంధనలు వివక్షతో కూడుకున్నవని, అవి చట్టబద్ధం కావని, ఈ నిబంధనల వలన సామాజిక భద్రతా కోడ్ 2020 కింద గర్భవతులైన మహిళలు తమకు చట్టపరంగా అందాల్సిన ప్రసూతి ప్రయోజనాలను నష్టపోతారని కమిషన్ పేర్కొంది. బ్యాంకు తీసుకున్న నిర్ణయం వలన గర్భవతులు ఆలస్యంగా ఉద్యోగంలో చేరాల్సి రావటంతో తమ సీనియారిటీని కోల్పోతారని, ఈ నిబంధనలను వెనక్కు తీసుకోవాలని మహిళా కమిషన్ కోరింది. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ ఇదే అంశంపై రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ కు ఓ లేఖను కూడా రాశారు. ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.

గర్భిణిని తాత్కాలికంగా ఫిట్ నెస్ లేనట్టుగా భావించడం సరికాదని, నేటికీ మన సమాజంలో చాలా బలంగా ఉన్న పితస్వామ్య భావజాలం, మహిళల పట్ల వివక్షలే ఇందుకు కారణమని, రిజర్వు బ్యాంకు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటుందని, భవిష్యత్తులో ఇలాంటి చట్టవిరుద్ధమైన నిబంధనలు రాకుండా తగిన మార్గదర్శకాలు రూపొందిస్తుందని తాను ఆశిస్తున్నట్టుగా స్వాతి తెలిపారు. జనవరి నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇదేరకమైన నిబంధనని గర్భిణులకు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు, అంతకంటే ఎక్కువ నెలలున్న గర్భిణులను తాత్కాలికంగా అన్ ఫిట్ గా పరిగణిస్తున్నామని, వారు ప్రసవం తరువాత నాలుగు నెలలలోపు జాబ్ లో చేరవచ్చని ఎస్ బి ఐ పేర్కొంది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా వివిధ వర్గాలనుండి తీవ్రమైన నిరసనలు రావటంతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.

First Published:  22 Jun 2022 1:11 AM GMT
Next Story