Telugu Global
NEWS

‘జాతీయ’ సమావేశాల్లోనూ తెలంగాణాపై ‘ విషం’చిమ్మడమే!

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ భారీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కావడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వ్యక్తమవడం సహజం. మోదీ, అమిత్ షా తదితర హేమాహేమీలు తరలిరానున్నారు. మూడురోజుల పాటు వాళ్ళు ఇక్కడే మకాం వేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేయడానికి పార్టీ ఉన్నతస్థాయి సమావేశం తలపెట్టారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు గాను తెలంగాణను వ్యూహాత్మకంగానే బీజేపీ ఎంపిక చేసింది. […]

BJP-Meetig-HYD
X

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ భారీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కావడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వ్యక్తమవడం సహజం. మోదీ, అమిత్ షా తదితర హేమాహేమీలు తరలిరానున్నారు. మూడురోజుల పాటు వాళ్ళు ఇక్కడే మకాం వేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేయడానికి పార్టీ ఉన్నతస్థాయి సమావేశం తలపెట్టారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు గాను తెలంగాణను వ్యూహాత్మకంగానే బీజేపీ ఎంపిక చేసింది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత ఇక తెలంగాణలో బోణీ చేయవచ్చని ఆ పార్టీ భావిస్తుంది. ఇందుకుగాను పలు ప్రయోగాలు చేస్తున్నారు. లక్ష్మణ్ ను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపారు. తెలంగాణ బీసీకి తాము మరో రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపామని చెప్పుకునేందుకు అవకాశం దక్కినట్టు బీజేపీ భావన.

అయితే తెలంగాణలో అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష, అత్యాశ సంగతెలా ఉన్నా, తెలంగాణ ఏర్పాటును కించపరచి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన బీజేపీ నాయకత్వం .. రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పవలసి ఉంది. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్టు తీర్మానం చేయవలసి ఉంది. అది సాధ్యమా? తెలంగాణ ప్రజలకు జవాబుదారీ కాకపోతే జాతీయ కార్యవర్గ సమావేశాలు జరపడానికి ఆ పార్టీకి నైతిక హక్కు ఉందో, లేదో బండి సంజయ్ కానీ, పూర్వాశ్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు అయిన ఈటల రాజేందర్ వంటి వారు చెప్పవలసి ఉంది.

”కాంగ్రెస్ పార్టీ అత్యంత సిగ్గు చేటైన రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించింది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఏపీ ప్రజల పట్ల కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించింది. పార్లమెంటులో మైకులు బంద్ చేసి,పెప్పర్ స్ప్రే కొట్టి విభజన బిల్లును ఆమోదించారు. తెలంగాణ ఏర్పాటును మేము వ్యతిరేకించలేదు. కానీ విభజన పద్ధతి అదేనా? అందరితో మాట్లాడి కలిసికట్టుగా రాష్ట్రాన్ని ఏర్పాటుచేసి ఉండవచ్చు. కానీ.. అధికారంతో వచ్చిన అహంకారం తలకెక్కి క్రూరంగా వ్యవహరించారు.

వాజ్ పేయి హయాంలో బీజేపీ మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. కానీ.. ఎలాంటి సమస్యా తలెత్తలేదు. అన్ని నిర్ణయాలూ శాంతియుతంగానే జరిగాయి. రాష్ట్ర విభజన సరిగా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావు. హడావుడిగా రాష్ట్ర విభజన చేశారు” అని ప్రధాని ఇటీవల రాజ్యసభలో అన్నారు.“ దేశాన్ని ముక్కలు చేయాలనే దురాలోచన ఉన్నవారే ఆంధ్రప్రదేశ్, తెలంగాణను విడగొట్టారు. రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్లు పూర్తయినా ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత లేదు. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు మాట్లాడే ప్రజలైనా ఒకరి ముఖం ఇంకొకరు చూసుకోలేని పరిస్థితి ఎదురయ్యింది. ఇలాంటి విద్వేషమార్గం అవసరమా? బీహార్ నుంచి జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గ‌ఢ్ లు విడిపోయినా వారంత ఒకరినొకరు గౌరవిస్తూ సంతోషంగా ముందుకు వెళ్తున్నారు” అని 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారసభల్లో మోదీ చెప్పారు.

”తల్లిని చంపి బిడ్డను బతికించారు” అని 2014 ఎన్నికల ప్రచార వేళ బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి మోదీ తిరుపతి సభలో అన్నారు. తల్లి అంటే ఆయన దృష్టిలో ఆంధ్రప్రదేశ్. బిడ్డ అంటే తెలంగాణ. మోదీ 2014 కు ముందు నుంచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకి అని తేలిపోయింది. అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి తదితర మంత్రులు పెద్దఎత్తున విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం సమయంలో ”రాష్ట్ర ఏర్పాటులో మా పాత్ర మరిచిపోవద్దు, ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి” అని బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలుగా వ్యాఖ్యానించిన విషయాన్ని ఎవరూ మరచిపోలేదు.

ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ అందరికంటే ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాకినాడ తీర్మానం ద్వారా బీజేపీ మద్దతు తెలిపింది. అదే పార్టీకి చెందిన ప్రధాని మోదీ, ఆయన కుడిభుజం అమిత్ షా తరచూ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తప్పుబడుతూ వస్తున్నారు. ఎనిమిదేండ్లుగా వాళ్ళ వైఖరిలో మార్పు రాకపోవడం వెనుక బీజేపీ నాయకుల కడుపు నిండా తెలంగాణ పట్ల విషం ఉన్నట్టు బహిర్గతమవుతుంది. తెలంగాణ ఏర్పాటును మోదీ అవహేళన చేస్తుండడం తెలంగాణ బీజేపీ నాయకులకు మింగుడుపడని వ్యవహారం.

కానీ, మింగలేని, కక్కలేని పరిస్థితి వారిది. కాగా విభజన చట్టం ప్రకారం నేరవేర్చాల్సిన హామీలను కేంద్రం ఇప్పటికీ నెరవేర్చలేదు. ఎన్డీయే మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే, ఆ తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం అక్కడ సమస్యలు పరిష్కరించింది. అలాగే రెండు రాష్ట్రాల సీఎంలతో విభజన సమస్యలపై ప్రధాని మోదీ ఒక్కసారికూడా చర్చించలేదు.

తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రధాన మంత్రి పలుమార్లు దెబ్బతీస్తున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, పోరాటాల గురించి మోదీకి కనీస అవగాహన లేదు. అడ్డంగా విభజించారనో, నిలువునా విభజించారనో తరచూ చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితం. అవివేక చర్య.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రజలు కోరుకున్నారు. రాష్ట్రం ఏర్పడింది. ప్రధాని మోదీ ఆగ్రహం కాంగ్రెస్ ధోరణి పైనే తప్ప తెలంగాణపై కాదని తెలంగాణ బీజేపీ నాయకులు సమర్ధించుకుంటున్నారు. కానీ ప్రజల హృదయం గాయపడి ఉంది. గాయపరిచిన బీజేపీని ప్రజలు ఎట్లా ఆదరిస్తారు? ఎందుకు ఆదరించాలి? కేసీఆర్ పాలనపై ఒక ప్రతిపక్ష పార్టీగా ఎన్ని విమర్శలయినా చేయవచ్చు. ఆరోపణలు గుప్పించవచ్చు. ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామని కూడా శపథం చేయవచ్చు. ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ అవతరణ తీరునే అవమానిస్తూ, అగౌరవపరుస్తూ చేసే వ్యాఖ్యలను ప్రజలు ఆమోదించరు.

ఇదిలా ఉండగా 40 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను అమ్మడానికి మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ తెలంగాణ నాయకులు జవాబు చెప్పాలి. తెలంగాణలోని కేంద్రప్రభుత్వ సంస్థలు హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెట్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్,హెచ్.ఎం.టీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోదీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్మే చర్యలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ 6 సంస్ధలకు గతంలో సూమారు 7200 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ ధరల ప్రకారం వీటి విలువ కనీసం 5వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం 40వేల కోట్లకు పైగా ఉంటుందని కేటీఆర్ అంటున్నారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు, సంస్థలను ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే ఆయా భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధీనంలోని భూములు తెలంగాణ ఆస్తి. వీటిని తెగనమ్మే ప్రయత్నాలపై టీ-బీజేపీ ఇప్పటిదాకా స్పందించలేదు.

First Published:  21 Jun 2022 7:00 AM GMT
Next Story