Telugu Global
NEWS

40 వేల కోట్ల.. తెలంగాణ భూములపై మోడీ కన్ను

దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డుఅదుపు లేకుండా అమ్మేస్తున్న కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణకు గర్వకారణమైన కంపెనీలపైనా కన్నేసింది. బహిరంగ మార్కెట్‌లో వేల కోట్ల విలువ చేసే భూములున్న సంస్థల ఆస్తులను తమకు ఇష్టులైన ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం పావులు కదుపుతోందన్న వార్తలొస్తున్నాయి. ఈ ప్రయత్నాలను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్‌కు లేఖ రాశారు. అందులో పలు కీలకమైన అంశాలను కేటీఆర్‌ ప్రస్తావించారు. తెలంగాణలో ప్రస్తుతం […]

40 వేల కోట్ల.. తెలంగాణ భూములపై మోడీ కన్ను
X

దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డుఅదుపు లేకుండా అమ్మేస్తున్న కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణకు గర్వకారణమైన కంపెనీలపైనా కన్నేసింది. బహిరంగ మార్కెట్‌లో వేల కోట్ల విలువ చేసే భూములున్న సంస్థల ఆస్తులను తమకు ఇష్టులైన ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం పావులు కదుపుతోందన్న వార్తలొస్తున్నాయి. ఈ ప్రయత్నాలను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్‌కు లేఖ రాశారు.

అందులో పలు కీలకమైన అంశాలను కేటీఆర్‌ ప్రస్తావించారు. తెలంగాణలో ప్రస్తుతం వ్యాపార వాణిజ్య, పారిశ్రామికీకరణకు మంచి వాతావరణం ఉందని తెలిసి కూడా, ఇక్కడ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి ప్రారంభించి వేలమందికి ప్రత్యక్షంగా, లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నా కేంద్రం ఆ దిశగా కాకుండా, వాటిని అమ్మేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆక్షేపించారు.

దేశ ఆర్థిక ప్రగతికి దన్నుగా నిలిచిన సంస్థలను అప్పనంగా అమ్మడమే లక్ష్యంగా, పెట్టుబడుల ఉపసంహరణకు ప్రయత్నాలు చేయడాన్ని లేఖలో కేటీఆర్ వ్యతిరేకించారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఆరు ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించేందుకు సిద్ధమవుతోందని కేటీఆర్‌ వివరించారు. ఈ సంస్థల భూముల వ్యవహారాన్ని కేటీఆర్ ప్రముఖంగా తన లేఖలో ప్రస్తావించారు.

గతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఆరు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం 7200 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. కేంద్రం అమ్మేందుకు సిద్ధ‌మైన సంస్థల్లో హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెట్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, HMT, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CCI),ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నట్టు కేటీఆర్‌ వెల్లడించారు. ప్రభుత్వ ధరల ప్రకారం చూస్తే గతంలో రాష్ట్రం ఈ ఆరు సంస్థలకు కేటాయించిన భూముల విలువ 5వేల కోట్లు. బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం అయితే ఈ భూములు విలువ 40వేల కోట్లకు పైగా ఉంటుందని కేటీఆర్‌ వివరించారు.

పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుతో స్థానిక ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్న ఉద్దేశంతో, పారిశ్రామికాభివృద్ది జరగాలన్న ఆశయంతోనే గతంలో ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తక్కువ ధరకు, అనేక సందర్భాల్లో ఉచితంగానూ కేటాయించిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూముల్లో కొత్త పరిశ్రమలు, సంస్థలను ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఆ భూములను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు.

సంస్థలు కేంద్ర ప్రభుత్వానివైనా, సంస్థల భౌతిక ఆస్తులను తెలంగాణ ప్రజల హక్కుగానే తమ ప్రభుత్వం గుర్తిస్తోందని కేటీఆర్‌ స్పష్టంచేశారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో వాటిని ప్రైవేట్‌ పరం చేయడం అంటే.. తెలంగాణ ఆస్తులను కేంద్రం అమ్ముతున్నట్టుగానే ఇక్కడి ప్రజలు భావిస్తారని కేటీఆర్ లేఖలో తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో ప్రజా రవాణా కోసం నిర్మించే 'స్కైవే'లు వంటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భూములను అడిగితే.. కేంద్రం ప్రభుత్వం తమ అధీనంలోని భూములకు మార్కెట్ ధర చెల్లించి తీసుకోవాలంటోందని, అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూములను ఇప్పుడు అమ్ముకునే హక్కు కేంద్రానికి మాత్రం ఎలా ఉంటుందని కేటీఆర్ ప్రశ్నించారు.

తమిళనాడుతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆయా రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అంశాన్ని కేటీఆర్‌ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించే బదులు.. వాటి పునరుద్దరణ చేపట్టి బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నత ఆశయాల కోసం కేటాయించిన భూములను అమ్మేసుకుని సొమ్ము చేసుకుని బయటపడతామంటే మాత్రం క‌చ్చితంగా వ్యతిరేకించి తీరుతామని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఒకవేళ ఆయా పరిశ్రమలను తిరిగి ప్రారంభించే అవకాశం లేకపోతే.. ఆయా సంస్థల భూముల్లో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కేటీఆర్‌ కీలక ప్రతిపాదన తన లేఖలో ఆర్థిక మంత్రి ముందు ఉంచారు.

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే విషయంలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తోందని కేటీఆర్‌ విమర్శించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కహానీలు చెబుతున్న ప్రధాని మోడీ.. సంస్థలను అమ్మే పనిలో మాత్రం బిజీగా ఉన్నారని కేటీఆర్‌ మండిపడ్డారు.

First Published:  19 Jun 2022 11:20 PM GMT
Next Story