Telugu Global
NEWS

చదరంగ ఒలింపియాడ్ కు శ్రీకారం.. 180 దేశాల మేధో యుద్ధం!

ఇతిహాస క్రీడ చదరంగానికి, భారత్ కు అవినాభావ సంబంధమే ఉంది. వేల సంవత్సరాల క్రితమే భారతగడ్డపై రూపుదిద్దుకొన్న మేధో క్రీడ చదరంగం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా 180కి పైగా దేశాలకు విస్తరించింది. అంతర్జాతీయ క్రీడాంశాలలో ఓ ప్రధాన క్రీడగా ఉన్న చదరంగం పురుషుల, మహిళల వ్యక్తిగత పోటీలతో పాటు… టీమ్ విభాగంలో సైతం అంతర్జాతీయ చదరంగ సమాఖ్య పోటీలు నిర్వహిస్తూ వస్తోంది. వివిధ దేశాలకు చెందిన జాతీయ జట్ల మధ్య రెండేళ్లకోమారు..చెస్ ఒలింపియాడ్ పేరుతో […]

inauguration-of-the-chess-olympiad-intellectual-war-of-180-countries
X

ఇతిహాస క్రీడ చదరంగానికి, భారత్ కు అవినాభావ సంబంధమే ఉంది. వేల సంవత్సరాల క్రితమే భారతగడ్డపై రూపుదిద్దుకొన్న మేధో క్రీడ చదరంగం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా 180కి పైగా దేశాలకు విస్తరించింది. అంతర్జాతీయ క్రీడాంశాలలో ఓ ప్రధాన క్రీడగా ఉన్న చదరంగం పురుషుల, మహిళల వ్యక్తిగత పోటీలతో పాటు…

టీమ్ విభాగంలో సైతం అంతర్జాతీయ చదరంగ సమాఖ్య పోటీలు నిర్వహిస్తూ వస్తోంది. వివిధ దేశాలకు చెందిన జాతీయ జట్ల మధ్య రెండేళ్లకోమారు..చెస్ ఒలింపియాడ్ పేరుతో గత నూరేళ్లుగా పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రపంచ చెస్ లో ఓ బలీయమైన శక్తిగా రూపుదిద్దుకొన్న భారత్.. మొట్టమొదటి సారిగా 44వ చెస్ ఒలింపియాడ్ కు ఆతిథ్యమిస్తోంది.

తమిళనాడులోని మహాబలిపురం వేదికగా జులై 28 నుంచి 14 రోజులపాటు జరిగే ఈ ప్రపంచ చదరంగ సంగ్రామంలో పాల్గొనటానికి 180 దేశాలకు చెందిన వందలాదిమంది క్రీడాకారులు తరలి వస్తున్నారు. ఈ పోటీల టార్చ్ రిలే కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో శ్రీకారం చుట్టారు…

భారత గడ్డపై తొలిసారిగా…
వాస్తవానికి 2022 చెస్‌ ఒలింపియాడ్ ను రష్యా నిర్వహించాల్సి ఉంది. అయితే..రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ పోటీలను నిర్వహించే అవకాశం భారత్ కు దక్కింది. అనుకోకుండా దొరికిన ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోడానికి భారత చదరంగ సమాఖ్య నడుం బిగించింది. 1927లో మొట్టమొదటి చదరంగ ఒలింపియాడ్ ను నిర్వహించారు. మూడుదశాబ్దాల విరామం తర్వాత ఆసియాగడ్డపై చెస్ ఒలింపియాడ్ కు ఆతిథ్యమిస్తున్న తొలి దేశంగా భారత్ రికార్డుల్లో చేరనుంది.

తమిళనాడు ప్రభుత్వ చేయూతతో భారత చదరంగ దిగ్గజాల అడ్డాగా చెన్నైకి చేరువనే ఉన్న మహాబలిపురాన్ని వేదికగా ఖరారు చేశారు. పురుషుల, మహిళల టీమ్ విభాగాలలో జరిగే చెస్ ఒలింపియాడ్ లో మొత్తం 188 దేశాలకు చెందిన 343 జట్లు తలపడటానికి రంగం సిద్ధమయ్యింది. భారత్ వేదికగా మొట్టమొదటిసారిగా జరుగనున్న ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేస్తున్నాయి.

75 నగరాల ద్వారా టార్చ్ రిలే…
ఒలింపిక్స్ తరహాలో చెస్‌ ఒలింపియాడ్ లో సైతం క్రీడాజ్యోతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని నిర్వాహక సంఘం నిర్ణయించింది. న్యూఢిల్లీ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో భారత చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కు ప్రధాని నరేంద్ర మోదీ క్రీడాజ్యోతిని అందచేయటంతో టార్చ్ రిలే కార్యక్రమానికి తెరలేచింది.

దేశం ఉత్తర భాగంలోని లే, శ్రీనగర్, పశ్చిమభారత్ లోని జైపూర్, సూరత్, ముంబై, మధ్యభారత్ లోని భోపాల్, పాట్నా, తూర్పు భారత్ లోని కోల్ కతా, గాంగ్టక్ నగరాల మీదుగా హైదరాబాద్, బెంగళూరు, త్రిసూర్, పోర్ట్ బ్లేయర్, కన్యాకుమారి మీదుగా జులై 27 నాటికి మహాబలిపురం నగరానికి క్రీడాజ్యోతి చేరనుంది. పది దశాబ్దాల చదరంగ ఒలింపియాడ్ చరిత్రలో క్రీడాజ్యోతి కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారి. చదరంగ క్రీడ గొప్పతనాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పడానికి ఈ క్రీడాజ్యోతి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడతుందని ఐదుసార్లు ప్రపంచ చెస్ విజేత , సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాధన్ ఆనంద్ ప్రకటించాడు.

భారత్ కు భలే చాన్స్….
చదరంగంలో భారత్ కు ఘనమైన చరిత్రే ఉంది. చెస్ ఒలింపియాడ్ లో సైతం భారత్ 2014లో కాంస్యం, 2020లో స్వర్ణం, 2021లో కాంస్య పతకాలు సాధించింది. రష్యా, బ్రిటన్, నార్వే, చైనా లాంటి దేశాలకు గట్టిపోటీ ఇస్తూ ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా గుర్తింపు సంపాదించింది. గత చెస్ ఒలింపియాడ్ లో కాంస్య పతకంతోనే సరిపెట్టుకొన్న భారత్ ప్రస్తుత టోర్నీలో మాత్రం ఆతిథ్య హోదాలో మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఉంది. పురుషుల, మహిళల విభాగాలలో మొత్తం 20 మంది సభ్యులతో కూడిన భారతజట్లకు విశ్వనాథన్ ఆనంద్ మెంటార్ గా వ్యవహరించనున్నారు.

నలుగురు తెలుగు గ్రాండ్ మాస్టర్లు..
ఒలింపియాడ్ లో పాల్గొనే భారత జట్లను అఖిలభారత చెస్ సమాఖ్య ఖరారు చేసింది. ఇండియా-ఏ, ఇండియా-బీ జట్లలో మొత్తం 20 మంది క్రీడాకారులకు ర్యాంకింగ్స్ ఆధారంగా చోటు కల్పించింది. భారత పురుషుల, మహిళల-ఏ జట్లలోనే తెలుగు రాష్ట్ర్రాల గ్రాండ్ మాస్టర్లు పెంటేల హరికృష్ణ, ఇరగేసి అర్జున్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక చోటు దక్కించుకొన్నారు. వరంగల్ యువ సంచలనం, తెలంగాణా తొలి గ్రాండ్ మాస్టర్ ఇరగేసి అర్జున్ తన కెరియర్ లో తొలిసారిగా చెస్ ఒలింపియాడ్ కు ఎంపికయ్యాడు. ఇటీవలే ముగిసిన పలు అంతర్జాతీయ టోర్నీలతో పాటు జాతీయ చెస్ టోర్నీలోనూ విజేతగా నిలవడం ద్వారా భారతజట్టులో చోటు సంపాదించగలిగాడు.

చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారతజట్టులో తెలుగు రాష్ట్ర్రాలకు చెందిన నలుగురు గ్రాండ్ మాస్టర్లు చోటు సంపాదించడం ఇదే మొదటిసారి.విశ్వనాథన్ ఆనంద్ మాటల్లో చెప్పాలంటే..స్వదేశీగడ్డపై తొలిసారిగా జరుగుతున్న ఈ ప్రపంచ చదరంగ మహాసంగ్రామంలో భారత్ ఏదో ఒక పతకం నెగ్గితీరడం ఖాయం. రెండువారాలపాటు జరిగే ఈ చెస్ ఒలింపియాడ్ ప్రపంచ చదరంగ.ప్రధానంగా భారత చెస్ అభిమానుల మెదడుకు మేత మాత్రమే కాదు..పసందైన చదరంగ విందు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  19 Jun 2022 11:17 PM GMT
Next Story