Telugu Global
Cinema & Entertainment

మార్వెల్ తరహా మల్టీవర్స్‌లు.. మన సినిమాల్లో కూడా!

ప్రాంతీయ సినిమా నుంచి ఇండియన్ సినిమాగా ఎదుగుతున్న మన సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా మార్పులొస్తున్నాయి. మల్టీ స్టారర్ సినిమాలతో పాటు మల్టీ యూనివర్స్ కథలు కూడా తెరకెక్కుతున్నాయి. ఈ తరహాలో రూపొందుతున్న తాజా చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే.. సాధారణంగా ఒక సినిమాలో ఉండే కథ, పాత్రలు కేవలం ఆ సినిమా వరకే పరిమితం అవుతుంటాయి. కానీ మార్వెల్ సృష్టించిన సినిమాటిక్ యూనివర్స్‌లో మాత్రం అలా కాదు. ఒక సినిమాలో కనిపించే పాత్ర మరొక సినిమా కథలో […]

మల్టీవర్స్
X

ప్రాంతీయ సినిమా నుంచి ఇండియన్ సినిమాగా ఎదుగుతున్న మన సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా మార్పులొస్తున్నాయి. మల్టీ స్టారర్ సినిమాలతో పాటు మల్టీ యూనివర్స్ కథలు కూడా తెరకెక్కుతున్నాయి. ఈ తరహాలో రూపొందుతున్న తాజా చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే..

సాధారణంగా ఒక సినిమాలో ఉండే కథ, పాత్రలు కేవలం ఆ సినిమా వరకే పరిమితం అవుతుంటాయి. కానీ మార్వెల్ సృష్టించిన సినిమాటిక్ యూనివర్స్‌లో మాత్రం అలా కాదు. ఒక సినిమాలో కనిపించే పాత్ర మరొక సినిమా కథలో కూడా ఎంట్రీ ఇస్తుంది. వేర్వేరు హీరోలు వేర్వేరు కథల్లో కలుస్తుంటారు. అలాగే ఒక సినిమా కథ.. మరొక సినిమాతో లింక్ అయ్యి ఉంటుంది. ఇలా కథలు, పాత్రలతో ఒక కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించడమే సినిమాటిక్ యూనివర్స్ అంటే. అయితే ఇప్పుడీ ట్రెండ్ మన సినిమాల్లో కూడా మొదలైంది.

లోకేష్ కనగరాజ్ యూనివర్స్

రీసెంట్‌గా వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ సినిమాను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. గతంలో వచ్చిన కార్తీ ఖైదీ సినిమా నేపథ్యం చుట్టూనే “విక్రమ్” కథ కూడా తిరుగుతుంటుంది. ఈ రెండు చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్.. తనదైన శైలిలో ఒక డ్రగ్ మాఫియా వరల్డ్‌ను సృష్టించాడు. ఈ చిత్రాలను కనెక్ట్‌ చేస్తూ లోకేశ్‌ సరికొత్త మల్టీవర్స్‌ సృష్టించబోతున్నాడు. ఒకవైపు ఏజెంట్‌ “విక్రమ్‌” కథ నడుస్తుండగానే మరోవైపు “ఢిల్లీ” , “రోలెక్స్” పాత్రలను కూడా క్లైమాక్స్‌లో చూపించి తన నెక్ట్స్ మూవీకి హింట్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత లోకేశ్‌ విజయ్‌తో ఓ సినిమా చేస్తారని టాక్‌. మరి ఈ చిత్రం వీటికి కనెక్ట్‌ అయి ఉంటుందా? లేదా కొత్త కథా? అన్నది తెలియాల్సి ఉంది.

ప్రశాంత్ నీల్ యూనివర్స్

ఇకపోతే కెజీయఫ్ సిరీస్‌తో సెన్షేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కూడా ఇదే తరహాలో ప్లాన్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రశాంత్ నీల్ అనౌన్స్ చేసిన సలార్‌, ఎన్టీఆర్‌ 31 సినిమాల థీమ్‌ కూడా కెజీయఫ్ తరహాలోనే డార్క్‌ గ్రే కలర్‌ థీమ్‌లో ఉన్నాయి. కోల్ మైనింగ్ నేపథ్యంలో సాగే సలార్ సినిమాకు కెజీయఫ్‌తో లింక్ ఉందని టాక్. కేజీయఫ్‌2 లో ఈశ్వరీరావు కొడుకు ‘ఫర్మాన్‌’ అధీర చేతికి చిక్కిన తర్వాత అతడిని చంపేశారా? లేదా? అన్నది స్పష్టంగా చూపించలేదు. అయితే కెజీయఫ్‌లో ‘ఫర్మాన్‌’ మెడలో ఉన్న లాకెట్‌ “సలార్‌”లో ప్రభాస్‌ మెడలో ఉన్న లాకెట్‌ ఒకేలా ఉన్నాయని, సలార్‌లో కూడా ఒక ముఖ్య పాత్రలో ఈశ్వరీరావు నటిస్తుంది కాబట్టి ఈ రెండు కథలకు కచ్చితంగా లింక్ ఉందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ 31 కథ కూడా కెజీయఫ్, సలార్ కథల నేపథ్యంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి తన యూనివర్స్‌ని రివీల్ చేయకముందే ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేస్తున్నాడు ప్రశాంత్.

అస్త్ర యూనివర్స్‌

బాలీవుడ్ నుంచి ప్రతిష్టాత్మంకగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర మూవీ కూడా ఇదే కోవకు చెందుతుంది. హిందూ మిథాలజీలోని అస్త్రాలు, వాటి పవర్స్ ఆధారంగా ఒక అస్త్ర యూనివర్స్ ను క్రియేట్ చేసినట్టు బ్రహ్మాస్త్ర ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ అస్త్ర యూనివర్స్‌లో మొదటి భాగంగా “బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ”.. త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, అమితాబ్‌, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

First Published:  19 Jun 2022 2:22 AM GMT
Next Story