Telugu Global
National

నాలుగేళ్ళ తర్వాత మేము పకోడీలు అమ్ముకోవాలా ?

అగ్నిప‌థ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. అనేక చోట్ల హింసాత్మకంగా మారాయి. కేంద్ర ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాలు…పోలీసు లాఠీ చార్జ్ లో ఆందోళనకారుల‌కు గాయాలు, ఆందోళనకారుల రాళ్ళ దాడిలో పోలీసులకు గాయాలు….పోలీసు కాల్పుల్లో నిరుద్యోగుల మరణాలు…. ఇలా ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాలు రణరంగంగా మారాయి. బీహార్లో మొదట ప్రారంభమైన ఉద్యమం హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకూ చేరింది. హైదరాబాద్ లో పోలీసు కాల్పుల్లో రాకేష్ […]

bihar new
X

అగ్నిప‌థ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. అనేక చోట్ల హింసాత్మకంగా మారాయి. కేంద్ర ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాలు…పోలీసు లాఠీ చార్జ్ లో ఆందోళనకారుల‌కు గాయాలు, ఆందోళనకారుల రాళ్ళ దాడిలో పోలీసులకు గాయాలు….పోలీసు కాల్పుల్లో నిరుద్యోగుల మరణాలు…. ఇలా ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాలు రణరంగంగా మారాయి.

బీహార్లో మొదట ప్రారంభమైన ఉద్యమం హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకూ చేరింది. హైదరాబాద్ లో పోలీసు కాల్పుల్లో రాకేష్ అనే ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.ప్రాణాలకు తెగించి రోడ్డెక్కి ఉద్యమిస్తున్న ఆ నిరుద్యోగుల మాటలు ప్రభుత్వం ఎలాగూ వినడానికి ప్రయత్నించడం లేదు. కనీసం మనం విందాం…. వాళ్ళ మాటల్లోని న్యాయాన్యాయాలను పరిశీలిద్దాం…

ది వైర్ అనే వెబ్ సైట్ ప్రతినిధులు బీహార్ లో నిరసనలు తెలుపుతున్న అనేక మంది నిరుద్యోగులతో మాట్లాడారు. వాళ్ళ మాటలను రికార్డ్ చేశారు. వాళ్ళ ధుంఖాన్ని, ఆక్రోశాన్ని, ఆవేదనను ప్రజల ముందుకు తీసుకవచ్చారు… ఇవి ఒక్క బీహార్ నిరుద్యోగుల మాటలు కాదు దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల మాటలు…

బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా ఆనంద్‌పూర్ గ్రామానికి చెందిన రోహిత్ కుమార్ గత నాలుగేళ్లుగా ఇండియన్ ఆర్మీలో చేరేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు అగ్నిపథ్ పథకం కింద నాలుగు సంవత్సరాల పాటు యువకులను నియమించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కుమార్ ను అతని ప్రయత్నాలను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టింది.

“కొత్త పథకం ప్రకారం నేను నాలుగు సంవత్సరాలు సైన్యంలో పని చేస్తాను. నెలకు రూ. 25,000-30,000 జీతం పొందుతాను. నాలుగు సంవత్సరాల తర్వాత, నేను సైన్యం నుండి తొలగించబడవచ్చు. అప్పుడు నేనేం చేస్తాను? నాలుగేళ్ల తర్వాత పకోడీలు అమ్మాల్సిందే! నేను వేరే చోట ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటే మంచిది కదా ”అని కుమార్ అన్నారు.

అగ్నిపథ్ పథకం ప్రకారం, నాలుగేళ్ల కాలం పూర్తయిన తర్వాత, రెగ్యులర్ ఉద్యోగాల కోసం వీళ్ళకు అవకాశం ఉంటుంది. అయితే మొత్తం అగ్నివీరుల్లో కేవలం 25% మంది మాత్రమే సాయుధ బలగాల్లో రెగ్యులర్ కేడర్‌లుగా ఎంపిక చేయబడతారు. అగ్నివీర్లకు మొదటి సంవత్సరంలో రూ. 4.76 లక్షలు లభిస్తాయి, నాలుగో సంవత్సరంలో రూ. 6.92 లక్షలకు అప్‌గ్రేడ్ చేయబడుతుంది.ఆర్మీ ఉద్యోగార్ధులు ఈ పద్దతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

బీహార్‌లోని ఛప్రా జిల్లాలోని మఖ్దుమ్‌గంజ్‌కు చెందిన పద్దెనిమిదేళ్ల శైలేష్ కుమార్ రాయ్ కూడా ఆర్మీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

“నేను ఆర్మీకి తప్ప మరే సెక్టార్‌కి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని అమలు చేస్తే, నా జీవితమంతా నాశనం అవుతుంది’ అని రాయ్ అన్నారు.

“జూన్ 20 నుండి, మేము నిరసనను మళ్ళీ కొనసాగిస్తాము. అవసరమైతే, మేము ఢిల్లీకి వెళ్లి మా నిరసనను తెలియజేస్తాము… ఆర్మీలో చేరితే నా ఉద్యోగం స్థిరంగా ఉంటుందనే ఆశతో నేను రెండేళ్లుగా సిద్ధమవుతున్నాను. ఇప్పుడిక అగ్నిపథ్ వల్ల నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగిగా మిగులుతాను ” అని రాయ్ అన్నారు.

చాలా మందికి, ఆర్మీ ఉద్యోగాలు అపారమైన గౌరవాన్ని కలుగజేస్తాయి. ఆర్థిక భద్రత ఉంటుంది. ఇతర పోటీ పరీక్షలకు అవసరమైన వనరులు లేనందున, గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత శారీరకంగా దృడంగా ఉండటం పై దృష్టిపెడతారు. ఆర్మీలో రాత పరీక్షకన్నా శారీరక, వైద్య పరీక్షలకే ఎక్కువ మార్కులుంటాయి. దాదాపు బీహార్ లోని ప్రతి గ్రామంలో, యువకులు ఉదయాన్నే పరుగెత్తడం, కఠినమైన వ్యాయామాలు చేయడం మామూలు విషయం.

తాను, తన‌ స్నేహితులు ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటల సమయం శారీరకంగా దృడంగా ఉండటం కోసం వ్యాయామాలు చేస్తామని రాయ్ చెప్పారు.

‘‘ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి ఐదు కిలోమీటర్లు పరిగెత్తుతాం. ఆ తర్వాత మేము శారీరక వ్యాయామాలు చేస్తాము. తర్వాత ఇంటికి తిరిగి వచ్చి ఇంటి పనులు చేసుకుంటూ చదువుకుంటాను. మేము సాయంత్రం కూడా మళ్ళీ పరుగు, వ్యాయామ‍ం చేస్తాము. ఇంత కష్టపడినా నాలుగేళ్ల ఉద్యోగం కోసం ఆర్మీలో చేరడంలో అర్థం లేదు” అని అన్నారు.

నాలుగేళ్లుగా ప్రిపేర్ అవుతున్న ఛప్రాకు చెందిన చంద్రకేత్ కుమార్ కు కూడా ఇదే మాట అంటున్నాడు.

“వ్యాయామం చేయడానికి, మేము ఉదయం 4 , 5 గంటలకు మేల్కొంటాం. నేను విపరీతంగా అలసిపోతాను, తగినంత నిద్ర ఉండదు, కానీ నాయకులకు మా పట్టింపు లేదు. వారు ఎయిర్ కండిషన్ గదులలో కూర్చుని, అన్ని సౌకర్యాలను ఉచితంగా పొందుతూ తమకు నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. ”అని కుమార్ అన్నారు.

“కేవలం నాలుగు సంవత్సరాల ఉపాధి హామీ కోసం ప్రాణాలను అర్పించడానికి ఏ యువకుడూ ఇష్టపడడు. నాలుగేళ్ల తర్వాత పదవీ విరమణ చేయాల్సి వస్తే ఎవరైనా ఆర్మీలో ఎందుకు చేరతారు? నేతల కోసం ప్రభుత్వం ఇలాంటి నిబంధనలు తీసుకువస్తుందా? ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా నాలుగేళ్లకోసారి ఎన్నికవుతారా? అని కుమార్ ప్రశ్నించారు. త్వరలోనే తన వయసు ఉద్యోగ అర్హతను దాటిపోతుందని కుమార్ ఆందోళన చెందుతున్నాడు.

“ప్రభుత్వం మమ్మల్ని నాశనం చేసింది, అయితే భవిష్యత్తులో సైన్యానికి సిద్ధమయ్యే యువతకోసమైనా మేము ఆందోళన చేస్తాము” అని ఆయన అన్నారు.

సాధారణ ఆర్మీ ఉద్యోగార్ధులు కాకుండా, నిరసనకారులలో ఎక్కువ మంది రెండు సంవత్సరాల క్రితం శారీరక, వైద్య పరీక్షలలో ఉత్తీర్ణులైన యువకులు ఉన్నారు, అయితే కరోనా వల్ల‌ వారి రాత పరీక్షలను రెండేళ్ళుగా వాయిదా వేస్తూ వస్తున్నారు.

“నేను రన్నింగ్ టెస్ట్‌కు అర్హత సాధించాను. మెడికల్ టెస్ట్ కూడా పాసయ్యాను. కానీ గత ఏడాదిన్నర కాలంలో రాత పరీక్ష ఎనిమిది సార్లు వాయిదా పడింది. ఇప్పుడు అగ్నిపథ్ పథకం కింద, ఇప్పటికే రన్నింగ్, మెడికల్ టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధించిన వారు కూడా మొత్తం ప్రక్రియను మళ్లీ పూర్తి చేయవలసి ఉంటుందని నేను వింటున్నాను, ”అని రోహిత్ కుమార్ అన్నారు.

రోహిత్ కుమార్ రాత పరీక్షల్లో బాగా రాణించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఇన్‌స్టిట్యూట్‌లో 1.5 లక్షల రూపాయల ఫీజు చెల్లించి శిక్షణ తీసుకున్నాడు.”ఇప్పుడు నేను నిస్సహాయంగా ఉన్నాను నాకు ఏమి చేయాలో తెలియడంలేదు” అని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇది ఒక్క బీహార్ కథే కాదు ప్రతి రాష్ట్రంలో సైన్యంలో చేరాలని కలలు కంటున్న లక్షలాది మంది కథ. అనేక ఏళ్ళుగా వాళ్ళు పడుతున్న శ్రమ, డబ్బు ఖర్చు, వెచ్చించిన సమయం అంతా నీళ్ళలో పోసినట్టుగా అయిపోయిందన్న ఆవేదన వాళ్ళది. నిన్న సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనలకు దిగిన వందలాది మంది నిరుద్యోగులది కూడా అదే వ్యధ. వాళ్ళు కూడా రోహిత్ కుమార్ లాగానే ప్రశ్నించారు. ”నాలుగేళ్ళ తర్వాత మేం పకోడీలు అమ్ముకోవాలా ?” ఈ ప్రశ్నకు జవాబు మనకైనా తెలుసా ?

First Published:  18 Jun 2022 5:37 AM GMT
Next Story