Telugu Global
National

కాబూల్ లోని గురుద్వారాపై ఐసిస్ ఉగ్రవాదుల దాడి

ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లోని గురుద్వారాపై శనివారం ఉదయం ఐసిస్ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. కార్తె పర్వాన్ గురుద్వారాలో ఒక్కసారిగా కాల్పులు, పేలుళ్లు సంభవించాయని, ఫలితంగా ఇందులోని సిక్కుల్లో చాలామంది మరణించడమో, గాయపడి ఉండడమో జరిగి ఉండవచ్చునని భావిస్తున్నామని గురుద్వారా అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ ని ఉటంకిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి ఆర్.పి. సింగ్ తెలిపారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని సాయుధ దుండగులు ఈ గురుద్వారాలోకి చొరబడి కాల్పులు జరిపారని, రెండు సార్లు […]

isis-terrorists-attack-gurudwara-in-kabul
X

ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లోని గురుద్వారాపై శనివారం ఉదయం ఐసిస్ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. కార్తె పర్వాన్ గురుద్వారాలో ఒక్కసారిగా కాల్పులు, పేలుళ్లు సంభవించాయని, ఫలితంగా ఇందులోని సిక్కుల్లో చాలామంది మరణించడమో, గాయపడి ఉండడమో జరిగి ఉండవచ్చునని భావిస్తున్నామని గురుద్వారా అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ ని ఉటంకిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి ఆర్.పి. సింగ్ తెలిపారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని సాయుధ దుండగులు ఈ గురుద్వారాలోకి చొరబడి కాల్పులు జరిపారని, రెండు సార్లు పేలుళ్లకు పాల్పడ్డారని తెలుస్తోంది.

ఉదయపు ప్రార్ధనల కోసం సుమారు 30 మంది హిందూ సిక్కులు అక్కడ ఉన్నట్టు ఢిల్లీకి సమాచారమందింది. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకోగా భీతావహ పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో గురుద్వారా సెక్యూరిటీ గార్డు మరణించాడు. ఆరు గంటల ప్రాంతంలో ఇక్కడ తాము పెద్ద పేలుడు శబ్దం విన్నామని, ఆ తరువాత అరగంటకే మరో శబ్దం వినిపించిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారని చైనా వార్తా సంస్థ సిన్ హువా పేర్కొంది. ఈ ఘటనలో అనేకమంది మరణించి ఉండవచ్చునని, సెక్యూరిటీ దళాలు వార్నింగ్ షాట్లు కూడా కాల్చారని తెలిసినట్టు ఈ సంస్థ వెల్లడించింది.

ముగ్గురు తాలిబన్ సైనికులు గాయపడ్డారని, దుండగుల్లో ఇద్దరిని పట్టుకున్నారని సమాచారం.. ఉగ్రవాదులు గురుద్వారాలో ప్రవేశించినప్పుడు లోపల 25 నుంచి 30 మంది ఉన్నారని, కనీసం 15 మంది అక్కడి నుంచి పారిపోయారని తెలుస్తోంది. మిగిలినవారు అందులోనే చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు. బహుశా ఐసిస్ టెర్రరిస్టులే ఈ ఘాతుకానికి కారకులని తెలుస్తోంది. గత ఏడాది అక్టోబరులో కూడా సుమారు 20 మంది టెర్రరిస్టులు కార్తె పర్వాన్ గురుద్వారాలోకి ప్రవేశించి గార్డులను కట్టివేసి హింసకు పాల్పడ్డారు.

2020 మార్చిలో శ్రీగురు హర్ రాయ్ సాహిబ్ గురుద్వారాపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 27 మంది సిక్కులు మరణించగా.. అనేకమంది గాయపడ్డారు. ఈ నెల 11 న కూడా కాబూల్ లోని జనావాస ప్రాంతంలో జరిగిన పేలుడులో పలువురు గాయపడ్డారు. 2020 నాటి గురుద్వారా దాడిని తాము రిపీట్ చేస్తామని ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు హెచ్చరిస్తూ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. తాజా ఘటనపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ.. తమకు పూర్తి సమాచారం అందవలసి ఉందని పేర్కొంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, మరిన్ని వివరాలకోసం ఎదురు చూస్తున్నామని ఈ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు.

First Published:  18 Jun 2022 1:24 AM GMT
Next Story