Telugu Global
NEWS

ప్లాస్టిక్ బియ్యం అని తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతాం..

ఏపీలో రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం.. ప్లాస్టిక్ బియ్యం అని ఇటీవల టీడీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల ప్రజలు కూడా ఇవి ప్లాస్టిక్ బియ్యం అంటూ ఆరోపణలు చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీలో ఎక్కడా ప్లాస్టిక్ బియ్యం అనేవి లేవని, అవి ఫోర్టిఫైడ్ బియ్యం అని, పోషకాహార లోపం, ప్రధానంగా రక్తహీనతను నివారించేందుకే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు సివిల్ సప్లై అధికారులు. వీటి తయారీకి ఖర్చు ఎక్కువ […]

ration-rice-false-news
X

ఏపీలో రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం.. ప్లాస్టిక్ బియ్యం అని ఇటీవల టీడీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల ప్రజలు కూడా ఇవి ప్లాస్టిక్ బియ్యం అంటూ ఆరోపణలు చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీలో ఎక్కడా ప్లాస్టిక్ బియ్యం అనేవి లేవని, అవి ఫోర్టిఫైడ్ బియ్యం అని, పోషకాహార లోపం, ప్రధానంగా రక్తహీనతను నివారించేందుకే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు సివిల్ సప్లై అధికారులు. వీటి తయారీకి ఖర్చు ఎక్కువ అవుతున్నా.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని.. వీటిపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవుపలికారు.

ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి..?

ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, బి-12 లాంటి సూక్ష్మ పోషకాలు తక్కువ పరిమాణంలో బియ్యంతో జోడించడాన్ని ఫోర్టిఫికేషన్ అంటారు. ఈ పద్ధతిలో ఆయా సూక్ష్మ పోషకాలతో సిద్ధమైన బియ్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్‌ అంటారు. ఇలా తయారు చేసిన ఫోర్టిఫైడ్ బియ్యంలో ఆ సూక్ష్మ పోషకాలు 45రోజుల వరకు ఉంటాయి. భారత్ లో రక్తహీనత వ్యాధికి విరుగుడుగా ప్రభుత్వం ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. పోషకాహారలోపం పిల్లల ఎదుగుదలపై కూడా ప్రభావం చూపిస్తుంది. మహిళలు, పిల్లల్లో రక్తహీనత సమస్య తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా ప్రపంచఆరోగ్య సంస్థ ప్రకటించింది. అన్ని దేశాలు తక్షణమే శ్రద్ద వహించాలని చెప్పింది. ఈ ఫోర్టిఫైడ్ బియ్యం ఆ లోపాలను తీరుస్తుంది.

ఉప్పుకు అయోడిన్..

గతంలో సాధారణ ఉప్పుకు అయోడిన్ జోడించడం ద్వారా ఉప్పును ఫోర్టిఫైడ్ చేసింది ప్రభుత్వం. 1980లలో ప్రజలు ఆహారంలో తీసుకునే ఉప్పులో అయోడిన్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత వంటనూనెలు, పాలు, గోధుములను కూడా ఫోర్టిఫికేషన్ పద్ధతిలో అందిస్తోంది. ఇప్పుడు బియ్యాన్ని ఫోర్టిఫైడ్ చేసి ప్రజలకు పంపిణీ చేస్తోంది.

ఇటీవల ఏపీలో ఫోర్టిఫైడ్ బియ్యంపై పలు ఆరోపణలు రావడంతో.. కడప జిల్లాలో పౌరసరఫరాల శాఖ అధికారులు, యూనివర్శిటీ ప్రొఫెసర్లు అవగాహన సదస్సు నిర్వహించారు. ఫోర్టిఫైడ్ బియ్యం అంటే ఏంటి, వాటి ఉపయోగాలేంటి.. అనే విషయాలను వివరించి, ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించారు. ఫోర్టిఫైడ్ బియ్యాన్ని.. ప్లాస్టిక్ బియ్యం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రజల్లో అపోహలు పెంచే ప్రయత్నం చేస్తే.. పౌరసరఫరాల శాఖ కేసులు నమోదు చేస్తుందని హెచ్చరించారు. ప్రజల ముందే అధికారులు, నేతలు ఫోర్టిఫైడ్ బియ్యంతో వండిన అన్నాన్ని తిన్నారు, వారి అపోహలు తొలగించారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేస్తున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఇదే బియ్యాన్ని పంపిణీ చేస్తారు.

First Published:  17 Jun 2022 9:05 PM GMT
Next Story