Telugu Global
National

‘అగ్నిపథ్’ నిరసనలు…ఎవరిది కుట్ర ? ఎవరు రెచ్చగొడుతున్నారు ?

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్‘ పథకం పట్ల నిరుద్యోగ యువత ఆగ్రహంగా ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కొన్ని చోట్ల ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. సికిందరాబాద్ లో పోలీసు కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. ఇంత పెద్ద ఎత్తున ఈ పథకంపై వ్యతిరేకత వస్తూ ఉంటే కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారు. పైగా నిరుద్యోగులను మరింత రెచ్చగొడుతున్నారు. ‘అగ్నిపథ్’ పథకం పై కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి […]

agnipath
X

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్‘ పథకం పట్ల నిరుద్యోగ యువత ఆగ్రహంగా ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కొన్ని చోట్ల ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. సికిందరాబాద్ లో పోలీసు కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. ఇంత పెద్ద ఎత్తున ఈ పథకంపై వ్యతిరేకత వస్తూ ఉంటే కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారు. పైగా నిరుద్యోగులను మరింత రెచ్చగొడుతున్నారు.

‘అగ్నిపథ్’ పథకం పై కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అది వాలంటరీ పథకమని తప్పనిసరిగా చేరాలనే రూలేం లేదని ఆయన అన్నారు. పైగా తెలంగాణకు చెందిన ఓ మంత్రి యువతనూ రెచ్చగొట్టాడని ఆరోపణలు చేశాడు.

ఇక ఏదేమైనా ఈ పథకాన్ని అమలు చేసి తీరుతామని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు మాట్లాడుతున్నారు. ఈ పథకం నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరమని, కావాలనే కొందరు యువతను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

కేంద్ర మంత్రుల వ్యాఖ్యల్లో నిజముందా ? నిజంగానే ‘అగ్నిపథ్’ కు వ్యతిరేకంగా ఎవరైనా కుట్ర చేస్తున్నారా ? నిరుద్యోగులను నిజంగానే ఎవరైనా రెచ్చగొడుతున్నారా ? చదువుకొని ఉద్యోగాల కోసం తిప్పలుపడుతున్న నిరుద్యోగులు ఎవరైనా రెచ్చగొడితే రెచ్చి పోవడానికి అంత ఙానం లేనివాళ్ళా ?
అసలు నిజమేంటి ?

ఆర్మీ ఉద్యోగాల కోసం రెండేళ్ళ క్రితమే ఫిజికల్ టెస్టులు, మెడికల్ టెస్టుల్లో పాసై రాత పరీక్ష కోసం ఎదిరి చూస్తున్నవాళ్ళు దేశంలో లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ రెండేళ్ళుగా అసహనంతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆర్మీలో చేరుదామా అని తహతహలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెగ్యులర్ ఆర్మీ రిక్రూట్ మెంట్ ఆపేసి నాలుగేళ్ళకే రిటైర్ అయ్యే విధంగా ‘అగ్నిపథ్ ‘ పథకం తీసుకరావడం కుట్రనా దాన్ని వ్యతిరేకించడం కుట్రనా ? పదిహేడున్నర‌ సంవత్సరాల వయసు నుండి 23 సంవత్సరాల వయసు వరకు అభ్యర్థులను ఈ స్కీం కింద సెలక్ట్ చేసి 6 నెలలు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత‌ నాలుగేళ్ళకు రిటైర్ చేస్తారు. రిటైర్ అయిన తర్వాత తమ జీవితం, జీవనం ఏంటని అడుగుతున్న నిరుద్యోగుల ప్రశ్నలో కుట్ర ఉందా ? పదవతరగతి వరకే చదువుకొని ఉద్యోగంలో చేరితే నాలుగేళ్ళ తర్వాత వాళ్ళకు 12వ తరగతి సర్టిఫికెట్ ఇస్తారట. ఆ సర్టిఫికెట్ తో వాళ్ళేంచేయాలి. ఆ సర్టిఫికట్లతో ఏ ఉద్యోగాలొస్తాయి ? నాలుగేళ్ళు ఉద్యోగం చేసి మళ్ళీ చదువుకోవడం సాధ్యమవుతుందా ? అంతే కాదట వాళ్ళకు వ్యాపారాలు చేయడానికి బ్యాంకులోన్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ దేశంలో నిరుద్యోగులకు బ్యాంకు లోన్ల ప్రహసనం మనకు తెలియందా ? తామంతా చివరకు పకోడీలు అమ్ముకోవాల్సిందేనా అని ఇవ్వాళ్ళ సికిందరాబాద్ స్టేషన్ దగ్గర ఓ నిరుద్యోగి వేసిన ప్రశ్న‌లో కిషన్ రెడ్డికి కుట్ర కనిపించిందా ?

ఉదయం సికిందరాబాద్ లో నిరుద్యోగుల ఆందోళ‌నకు స్పందనగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. గతంలో వన్ ర్యాంక్ – వన్ పెన్షన్ అంటూ సైనిక ఉద్యోగులకు కేంద్రం తీవ్ర నష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు అప్పట్లో సైనికులకు ఇచ్చే పెన్షన్లో కోత విధించేందుకు కేంద్రం.. వన్ ర్యాంక్ – వన్ పెన్షన్ అనే విధానం తీసుకొచ్చిందని ఇప్పుడు ఏకంగా నో ర్యాంక్ – నో పెన్షన్ అంటూ అన్నీ ఎత్తివేసే ఎత్తుగడలో ఉన్నారని మండిపడ్డారు. గతంలో రైతు చట్టాలు తీసుకొచ్చి రైతుల జీవితాలతో ఆడుకున్నారని, ఇప్పుడు సైనికుల జీవితాలతో ఆడుకోవడం మొదలు పెట్టారని.. మోదీని విమర్శించారు కేటీఆర్.

ఈ మాటల్లోని నిజం కాకుండా కిషన్ రెడ్డికి రెచ్చగొట్టడంగా కనిపించడం బీజేపీ విధానాల డొల్లతనానికి పరాకాష్టకాదా ?

ఇక దేశవ్యాప్త‍ంగా యువత, ముఖ్యంగా లక్షల్లో ఉన్న‌ఆర్మీ అభ్యర్థులు ఆవేదనతో, ఆక్రోషంతో, కడుపు మంటతో… మరో వైపు జీవితం నాశనమవుతుందనే ధుంఖంతో గతిలేక రోడ్డుమీదికి వచ్చి నిరసనలు చేస్తూ ఉంటే…తమ పథకం నిజంగానే అద్భుతమైనదైతే ఆందోళన చేస్తున్నవారిని కన్విన్స్ చేయడమో లేక‌ అభ్యర్థులు, మేదావులు చెబుతున్నట్టు ఆ పథకం ప్రస్తుత ఆర్మీ అభ్యర్థుల జీవితాలనే కాదు దేశ భద్రతనే ప్రశ్నార్దకం చేస్తుందనేదాంట్లో నిజముంటే ‘అగ్నిపథ్’ ను ఉపసంహరించుకోవడమో చేయాలి. కానీ ఎవరేమన్నా, ఎన్ని నిరసనలు చేసినా కొనసాగించి తీరుతామని, ఏం చేస్తారో చేసుకోండన్నట్టు రాజ్ నాథ్ సింగ్ , అమిత్ షాలు మాట్లాడటం రెచ్చగొట్టడమా లేక తమ భవిష్యత్తు కోసం ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగులకు ఈ దేశ పౌరులుగా మద్దతు తెలపడం రెచ్చగొట్టడమా ?

మొన్నటికి మొన్న కార్పోరేట్ కంపెనీల లాభాల కోసం మూడు వ్యవసాయ చట్టాలు తీసుకవచ్చినప్పుడు దేశ రైతాంగం ఉద్యమిస్తే బీజేపీ నాయకగణం ఇలాంటి ఆరోపణలే చేసింది. తాము తీసుకవచ్చిన చట్టాలు రైతుల మేలు కోసమే అని, కావాలనే విపక్షాలు రైతులను రెచ్చకొడుతున్నాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తున్నారని, ఉద్యమించేవాళ్ళంతా తీవ్రవాదులని, ఖాలస్తీనీలని, అర్బన్ నక్సల్ అని రకరకాల ఆరోపణలకు పూనుకుంది. చివరకు రైతాంగ ఉద్యమం దెబ్బకు చెంపలేసుకొని, దేశానికి క్షమాపణలు చెప్పి ఆ చట్టాలను ఉపసంహరించుకుంది. ఇది ఎప్పటి చరిత్రో కాదుకదా నిన్న, మొన్న జరిగిందే కదా ! వ్యవసాయ చట్టాలు అయిపోయాయి ఇప్పుడిక ‘అగ్నిపథ్’ వంతా ? రైతులను వదిలేసి ఇప్పుడు సైన్యం మీద పడ్డారా ? ఈ దేశాన్ని రక్షించే సైనికుల జీతాల దగ్గర కక్కుర్తిపడటం దేశభక్తా అది తప్పని చెప్పడం దేశభక్తా ?

ఇప్పుడు చెప్పండి ఎవరు కుట్రలు చేస్తున్నారు ? ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారు ? ఎవరి ప్రయోజనాల కోసం బీజెపి పాలన సాగిస్తోంది ?

Next Story