Telugu Global
NEWS

జాతీయ పార్టీ వచ్చాక.. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి?

జాతీయ పార్టీ పెట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో బరిలోకి దిగిన తర్వాత అలుపెరగకుండా, విరామం లేకుండా పోరాడిన కేసీఆర్.. జాతీయ పార్టీ పెట్టిన తర్వాత కూడా దేశమంతా విస్తృతంగా పర్యటించాలని భావిస్తున్నారు. జాతీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు తెలుస్తున్నది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌లను జాతీయ స్థాయిలో దీటుగా ఎదుర్కోవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికే జాతీయ పార్టీకి […]

TRS-President-change-after-BRS
X

జాతీయ పార్టీ పెట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో బరిలోకి దిగిన తర్వాత అలుపెరగకుండా, విరామం లేకుండా పోరాడిన కేసీఆర్.. జాతీయ పార్టీ పెట్టిన తర్వాత కూడా దేశమంతా విస్తృతంగా పర్యటించాలని భావిస్తున్నారు. జాతీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు తెలుస్తున్నది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌లను జాతీయ స్థాయిలో దీటుగా ఎదుర్కోవలసిన అవసరం ఉన్నది.

ఇప్పటికే జాతీయ పార్టీకి పలు రాష్ట్రాల్లో ఎవరెవరికి బాధ్యతలు అప్పగించాలనే విషయంపై కసరత్తు చేసినట్లు తెలుస్తున్నది. రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ వంటి వారిని పార్టీలోకి తీసుకొని వచ్చి కొన్ని రాష్ట్రాల్లో బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అవసరం అయితే వేరే రాష్ట్రాల్లో ముఖ్యమైన రాజకీయ నాయకులను పార్టీలోకి ఆహ్వానించి వారికి కీలక బాధ్యతలు కట్టబెట్టవచ్చు.

ఇదే క్రమంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు కూడా వేరే వారికి అప్పగించాలని అనుకుంటున్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అప్పగిస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉన్నది. చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ ఏపీ, తెలంగాణకు కుటుంబేతర వ్యక్తులను అధ్యక్షులుగా చేశారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే పద్దతిని అనుసరించబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కుటుంబేతర వ్యక్తికి కట్టబెట్టాలని ఆయన నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

రాష్ట్రంలో రెడ్డి వర్గం టీఆర్ఎస్ పార్టీకి దూరమవుతున్నట్లు కేసీఆర్ గ్రహించారు. అదే వర్గానికి చెందిన వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే తిరిగి దగ్గర అవ్వొచ్చని కేసీఆర్ అనుకుంటున్నారు. ఈ క్రమంలో తనకు చాలా నమ్మకస్తుడైన మంత్రి ప్రశాంత్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. దీంతో రెడ్డి వర్గంలో ఉన్న అసంతృప్తిని కాస్త చల్లబర్చాలని భావిస్తున్నారు.

ఇక కేటీఆర్ ఎప్పటిలాగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండబోతున్నారు. రాబోయే రోజుల్లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి.. ఆయన సీఎం అయితే, పార్టీ పగ్గాలు వేరే వారి చేతిలో ఉండటంతో ప్రజల్లోకి పాజిటివ్ మెసేజ్ వెళ్తుందని భావిస్తున్నారు. అంతే కాకుండా పార్టీలో ఎవరైనా అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంటుందనే భావన నేతలు, కార్యకర్తల్లో కూడా వస్తుందని అనుకుంటున్నారు.

ఇక పార్టీలోని కొంత మంది కీలక నేతలకు జాతీయ పార్టీలో పదవులు ఇవ్వబోతున్నారు. దీంతో రాష్ట్ర పార్టీలో కొన్ని ఖాళీలు ఏర్పడుతాయి. వీటిని అసంతృప్త నేతలతో భర్తీ చేస్తే.. అసమ్మతి కూడా తగ్గుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. మొత్తానికి జాతీయ పార్టీ పెట్టి.. రాష్ట్రంలో కొంత మందిని తన దారికి తెచ్చుకోవాలని కేసీఆర్ భారీ వ్యూహం రచించినట్లు అర్థం అవుతున్నది.

First Published:  16 Jun 2022 9:39 PM GMT
Next Story