Telugu Global
MOVIE REVIEWS

గాడ్సే మూవీ రివ్యూ

నటీనటులు – సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి, నాజర్, షాయాజీ షిండే, కిషోర్‌, ఆదిత్య మీన‌న్‌, బ్ర‌హ్మాజీ తదిత‌రులు బ్యానర్ – సీకే స్క్రీన్స్ నిర్మాత – సి.కల్యాణ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు – గోపీ గణేశ్ సంగీత దర్శకుడు – శాండీ నిడివి – 2 గంటల 25 నిమిషాలు సెన్సార్ – U/A రేటింగ్ – 2/5 హిట్ కాంబినేషన్.. ఇది పైకి చెప్పుకోడానికి మాత్రమే. మార్కెట్ పెంచుకోడానికి మాత్రమే. ప్రతిసారి ఈ కాంబినేషన్ […]

satyadev godse movie review
X

నటీనటులు – సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి, నాజర్, షాయాజీ షిండే, కిషోర్‌, ఆదిత్య మీన‌న్‌, బ్ర‌హ్మాజీ తదిత‌రులు
బ్యానర్ – సీకే స్క్రీన్స్
నిర్మాత – సి.కల్యాణ్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు – గోపీ గణేశ్
సంగీత దర్శకుడు – శాండీ
నిడివి – 2 గంటల 25 నిమిషాలు
సెన్సార్ – U/A
రేటింగ్ – 2/5

హిట్ కాంబినేషన్.. ఇది పైకి చెప్పుకోడానికి మాత్రమే. మార్కెట్ పెంచుకోడానికి మాత్రమే. ప్రతిసారి ఈ కాంబినేషన్ హిట్ కొడుతుందని చెప్పలేం. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. హీరో సత్యదేవ్, దర్శకుడు గోపీ గణేశ్ ది హిట్ కాంబినేషన్. ఇద్దరూ కలిసి తీసిన బ్లఫ్ మాస్టర్ హిట్టయింది. ఇప్పుడీ కాంబినేషన్ రిపీట్ అయింది. కానీ ఫలితం మాత్రం తేడా కొట్టింది. ఈరోజు థియేటర్లలోకొచ్చిన గాడ్సే సినిమా ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించింది.

ఈ సినిమా ట్రయిలర్ చూసినప్పుడే కొందరికి కొన్ని అనుమానాలు కలిగాయి. సినిమా రిలీజైన తర్వాత ఆ అనుమానాలే నిజమయ్యాయి. ట్రయిలర్ లో ఎలాగైతే కొత్తదనం కనిపించలేదో.. ఈ సినిమా ట్రయిలర్ లో కూడా ఎలాంటి కొత్తదనం కనిపించలేదు. ఊహించినట్టు సాగే కథ, అంతకంటే ఘోరంగా ఉన్న నెరేషన్ ఈ సినిమా ఫలితాన్ని పూర్తిగా మార్చేశాయి.

ముందుగా కథ గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. హైదరాబాద్ లో ప్రముఖులు ఒక్కొక్కరిగా కిడ్నాప్ అవుతుంటారు. వాళ్లందర్నీ గాడ్సే (సత్యదేవ్)అనే వ్యక్తి కిడ్నాప్ చేస్తుంటాడు. తన డిమాండ్స్ తో సంచలనం రేపుతాడు. ఈ క్రమంలో ఈ కేసును సాల్వ్ చేసేందుకు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వైశాలి (ఐశ్వర్య లక్ష్మి) రంగంలోకి దిగుతుంది. తన పరిశోధనలో భాగంగా గాడ్సే మరెవరో కాదు, ప్రముఖ వ్యాపారవేత్త అని తెలుసుకుంటుంది వైశాలి. ఇంతకీ గాడ్సే ఎందుకిలా కిడ్నాప్స్ చేస్తుంటాడు? అతడి డిమాండ్స్ ఏంటి? అసలు గాడ్సే ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

ఈ కథను ఊహించుకుంటేనే సెటప్ ఏంటనేది మీకు అర్థమై ఉంటుంది. అవును.. 2-3 గదుల్లో సింపుల్ గా తీసేసిన సినిమా ఇది. ఇక హీరో అయితే, సింగిల్ కాస్ట్యూమ్ తో ఒకే కుర్చీలో కూర్చొని డైలాగులు చెబుతూనే ఉంటాడు. ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాడు. ఈ కాలం ఇలాంటి డైలాగులు, ఇలాంటి సెటప్ వర్కవుట్ అవ్వదనే విషయం మేకర్స్ కు తట్టకపోవడం ఆశ్చర్యం.

ఈ సంగతి పక్కనపెడితే, అసలు కథలో కీ-పాయింట్ ను దర్శకుడు ఎస్టాబ్లిష్ చేయలేదు. అసలు పాయింట్ వదిలేసి కొసరు ఎక్కువగా చూపించాడు. చివరికి సత్యదేవ్ పాత్రను కూడా బలంగా చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో సినిమా అంతా ముగిశాక ప్రేక్షకుడు ఓ పెద్ద నిట్టూర్పు విడుస్తాడు. దీనికితోడు సత్యదేవ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా రొటీన్ గా ఉంటుంది.

హిట్ కాంబినేషన్ ఉందనే ధైర్యంతో దర్శకుడు లాజిక్స్ ను గాలికొదిలేశాడు. చాలా సన్నివేశాల్లో లాజిక్కులు మిస్సయ్యాయి. దీంతో ఎంతో కీలకమైన సెకండాఫ్ తేలిపోయింది. కనీసం ద్వితీయభాగంపైనైనా దర్శకుడు కాస్త గట్టిగా వర్కవుట్ చేసి ఉంటే బాగుండేది. సమాజాన్ని, అవినీతిపరుల్ని ప్రశ్నిస్తూ చాంతాడంత డైలాగ్స్ చెప్పిస్తే సరిపోతుందని అనుకున్నాడు. పోనీ అవైనా బాగున్నాయా అంటే అస్సలు ఎక్కవు. అక్కడ, ఇక్కడ ఏరుకొని రాసుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే మరీ దారుణం. ఈమధ్య కాలంలో ఇంత ఓవర్ క్లయిమాక్స్ ఎక్కడా చూసి ఉండం.

ఓవైపు ఇంత రచ్చ సాగుతున్నప్పటికీ, మరోవైపు సత్యదేవ్ మాత్రం సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. తన పాత్రకు అతడు పూర్తి న్యాయం చేశాడు. అయితే కథలోనే కన్నం ఉన్నప్పుడు క్యారెక్టర్ తో కవర్ చేయడం కష్టమనే విషయాన్ని సత్యదేవ్ మరిచిపోయాడు. ఇక హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యలక్ష్మికి కూడా సరైన ఎంట్రీ పడలేదు. దర్శకుడు చెప్పాడా లేక ఆమె అత్యుత్సాహం చూపించిందా అన్నట్టు కొన్ని చోట్ల చాలా ఓవర్ గా ఉంది ఆమె నటన. బ్రహ్మాజీ, భరణి, నాగబాబు, ప్రియదర్శి పాత్రలు రొటీన్ గా ఉన్నాయి. వాళ్ల పాత్రలు చూస్తే, ఇంకా ఎన్ని సార్లు ఇలాంటి క్యారెక్టర్లు రిపీట్ చేస్తార్రా బాబూ అని గట్టిగా అరవాలనిపిస్తుంది.

టెక్నికల్ గా కూడా సినిమా చాలా వీక్ గా ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పుకోడానికేం లేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి. కాస్త ఖర్చు పెడదామన్నా నిర్మాతకు, ఈ కథ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దర్శకుడు గోపీగణేశ్ ఈసారి ఫెయిలయ్యాడు. బ్లఫ్ మాస్టర్ లో కొత్త పాయింట్ ను ఎత్తుకున్న ఈ దర్శకుడు, గాడ్సేతో మాత్రం మూసలో పడిపోయాడు. కథలేని ఈ సినిమాలో స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆశించడం అత్యాశే అవుతుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తే, సత్యదేవ్ చూసుకుంటాడులే, మనకెందుకొచ్చిన కష్టం అని గోపీ గణేశ్ తప్పుకున్నట్టు అనిపిస్తుంది.

ఓవరాల్ గా విరాటపర్వానికి పోటీగా వచ్చిన గాడ్సే సినిమా ఏమాత్రం మెప్పించదు. అక్కడక్కడ సత్యదేవ్ నటనను మినహాయిస్తే, ఈ సినిమాలో చెప్పుకోడానికేం లేదు.

Next Story