Telugu Global
National

మోదీని ఉతికి ఆరేసిన ‘వాషింగ్టన్ పోస్ట్’

భారత దేశంలో మోదీ పాలనను ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ఉతికి ఆరేసింది. భారత్ లో మైనార్టీలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయని, మోదీ తన మౌనంతో ఆ దాడులకు పరోక్ష మద్దతు ఇస్తున్నాడని ఆరోపించిన ఆ పత్రిక ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం కలగజేసుకొని భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి అని పేర్కొంది. బుల్డోజర్ ల తో మైనార్టీల ఆస్తులు ధ్వంసం, మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు, హిజబ్ వివాదం, మతపరమైన మైనారిటీలపై ద్వేషపూరిత దాడులు, మైనార్టీల పట్ల […]

modi, washington post
X
భారత దేశంలో మోదీ పాలనను ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ఉతికి ఆరేసింది. భారత్ లో మైనార్టీలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయని, మోదీ తన మౌనంతో ఆ దాడులకు పరోక్ష మద్దతు ఇస్తున్నాడని ఆరోపించిన ఆ పత్రిక ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం కలగజేసుకొని భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి అని పేర్కొంది.
బుల్డోజర్ ల తో మైనార్టీల ఆస్తులు ధ్వంసం, మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు, హిజబ్ వివాదం, మతపరమైన మైనారిటీలపై ద్వేషపూరిత దాడులు, మైనార్టీల పట్ల బిజెపి నాయకుల ద్వేషపూరిత ప్రసంగాలు, భారత్ లో పెరుగుతున్న తీవ్రమైన మత అసహనం…తదితర విషయాలపై ‘వాషింగ్టన్ పోస్ట్’ సంపాదకీయం ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని వ్యతిరేకించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది.
మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యల తర్వాత అంతర్జాతీయంగా వ్యతిరేకత రావడంతో గత్యంతరం లేక ఆ నాయకులపై బీజెపి చర్యలు తీసుకుందని, కానీ నిజానికి మోదీకి గానీ బీజేపీకి గానీ వారిపై చర్యలు తీసుకోవడం ఇష్టంలేదని ఆ పత్రిక పేర్కొంది.
”అనేక నెపాలు ఆపాదించి బీజేపీ ప్రభుత్వం, అధికారులు మైనార్టీల ఇళ్ళను బుల్డోజర్లతో కూల్చివేశారు, కర్నాటకలో బిజెపి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో హిజాబ్‌లను నిషేధించింది, దీనిని హైకోర్టు కూడా సమర్థించింది. భారతీయ ముస్లింలు, ఇతర మతపరమైన మైనారిటీలపై ద్వేషపూరిత నేరాలు ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో జరుగుతున్నాయి. బిజెపి నాయకులు స్వయంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మోడీ మౌనంగా చూస్తూ ఉన్నారు” అని వాషింగ్టన్ పోస్ట్ సంపాదకీయం వ్యాఖ్యానించింది.
బీజేపీ చరిత్రను చూస్తే… ఈ మధ్య ప్రవక్త వివాదం సందర్భంగా చేసిన మత సహన ప్రకటన నమ్మశక్యంగా లేదుఅని పేర్కొంది పత్రిక‌. ఒకవైపు నిరసనకారులపై పోలిసులు దాడులు చేస్తూ, ఇద్దరి మరణానికి డజన్ల మంది గాయాలపాలవ్వడానికి కారణమై మతసహనం గురించి మాట్లాడటాన్ని ఆ పత్రిక అపహాస్యం చేసింది.
ఇటీవలి మహ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యల ఎపిసోడ్‌లో మతపరమైన అసహనాన్ని ప్రభుత్వం ఖండించడానికి అసలు కారణం సహజ వాయువు, ఆర్థిక సహకారం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఉగ్రవాద నిరోధం, ఇంటెలిజెన్స్ తదితర అంశాలపై భారతదేశం ఎక్కువగా ఆధారపడే మధ్యప్రాచ్య దేశాలు దూరం అవుతాయనే ఆందోళనే తప్ప మరేమీ కాదని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. లక్షలాది మంది భారతీయులు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పని చేస్తున్నారు. అనేక మంది అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ప్రతినెల ఆయా దేశాల నుండి భారత్ కు పెద్ద మొత్తంలో డబ్బులు పంపుతుంటారు. మోడీ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా మార్చాలనుకుంటున్నారు; మరోవైపు భారతదేశంలోని ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్‌ను ఇతర దేశాలు వ్యతిరేకించినప్పుడు, అతని పార్టీ ప్రోత్సహించిన అటువంటి విధానాలకు ఎదురుదెబ్బ తగిలింది. అని ఆ పత్రిక సంపాదకీయం వ్యాఖ్యానించింది.
ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి అని ఆ పత్రిక సూచించింది. “భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలను బైడెన్ ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఏప్రిల్‌లో చెప్పారు, మత స్వేచ్చ క్షీణిస్తున్న దేశంగా భారతదేశాన్ని వర్ణించారు. అయితే తాజాగా రేగిన ఈ వివాదంపై వైట్‌హౌస్ మౌనంగా ఉంది. భారతదేశం బహుళత్వ ప్రజాస్వామ్యం కావచ్చు లేదా చీకటి, అసహన జాతీయవాదం పెరిగిన‌ దేశం కావచ్చు. కానీ యునైటెడ్ స్టేట్స్ మతసహనానికి అనుకూలంగా చురుకుగా పని చేయాలి.” అని ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక సూచించింది.
అయితే ఇవే మాటలు ఈ దేశంలో మేదావులు, టీఆరెస్ తో సహా అనేక ప్రాంతీయ పార్టీలు ఎంతో కాలంగా చెప్తూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన విధానాలను విమర్షించే వాళ్ళపై,బీజేపీని వ్యతిరేకించేవాళ్ళపై ఈడీలు, సీబీఐలు, ఎన్ ఐ ఏలతో దాడులు చేయిస్తూ, మాట్లాడే ప్రతి గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఇప్పుడు అంతర్జాతీయంగా వస్తున్న వ్యతిరేకతతతో వణికిపోతున్నదన్నది ఎంత‌ నిజమో తన విద్వేష పద్దతులను విడనాడడానికి సిద్దంగా లేదన్నది కూడా అంతే నిజం. అదే విషయం ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక తన భాషలో చెప్పింది. ఈ భాష మోదీకి ఎలాగూ అర్దంకాదు. కనీసం అర్దం చేసుకున్నవాళ్ళు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.
Next Story